టీడీపీ ఓట్లు ఏపీలో లేవా...!?
తెలుగుదేశం పార్టీ చరిత్ర ఈనాటిది కాదు. ఇప్పటికి 42 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ. నాలుగు దశాబ్దాల క్రితమే అధికారాన్ని అందుకున్న పార్టీ;
తెలుగుదేశం పార్టీ చరిత్ర ఈనాటిది కాదు. ఇప్పటికి 42 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ. నాలుగు దశాబ్దాల క్రితమే అధికారాన్ని అందుకున్న పార్టీ. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఒక సమ్మోహిత శక్తి. ఆయన ప్రాభవంతో టీడీపీ పల్లె పట్నం లేకుండా ఎదిగింది. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటికి ఉమ్మడి ఏపీ జనాభా ఆరు కోట్లు.
అందుకే అప్పట్లో ఎన్టీఆర్ తన ప్రతీ ప్రసంగంలో ఆరు కోట్ల ఆంధ్రులు అంటూ వారికి ఉత్తేజపరచే వారు ఒక విధంగా టీడీపీకి గట్టి ఫౌండేషన్ వేశారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ హయాంలో మొదటి రెండు ఎన్నికల్లో అంటే 1983, 1985లలో గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు తేడా లేకుండా జై కొట్టాయి. ఇక 1989 నాటికి అప్పటికి ఏడేళ్ల పాలన పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ తొలిసారి ఓడారు.
ఆనాడు రూరల్ ఓటర్లు ఎన్టీఆర్ కి మద్దతుగా నిలిస్తే పట్టణ ప్రాంతాలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. 1994లో చూస్తే పట్టణ ప్రాంతాలలో కొంత మొగ్గు వచ్చినా పూర్తి స్థాయిలో టీడీపీకి మాత్రం పట్టణ ప్రాంతాల మద్దతు దక్కలేదు ఇక 1995లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఐటీ అన్న కొత్త సెక్టార్ లో ఉద్యోగావకాశాలను కల్పించారు. ఆయన తొలి దశ పాలన అంతా సంస్కరణల దిశగా సాగింది. దాంతో పల్లె దూరం అవుతూ వచ్చింది.
రైతాంగం వారి ప్రాముఖ్యతలు బాబు ఉమ్మడి ఏపీ తొమ్మిదేళ్ల పాలనలో ప్రధమ ప్రాధాన్యతలుగా రాలేకపోయాయి. దాన్ని పట్టుకున్నారు వైఎస్సార్. ఆయన కాంగ్రెస్ తరఫున గ్రామీణ ప్రాంతాన్ని రైంతాంగాన్ని ఆకట్టుకునే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. వైఎస్సార్ హయాంలో రెండు టెర్ములలో దక్కిన విజయం అంతా గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ కి మొగ్గు చూపించబట్టే జరిగింది.
అలా రూరల్ సెక్టార్ లో బలమైన పునాది కాంగ్రెస్ కి ఏర్పడింది. టీడీపీకి మాత్రం అర్బన్ సెక్టార్ మద్దతు బాబు సంపాదించగలిగారు. అదే విభజన ఏపీలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ఓటు అంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి టర్న్ అయింది. పైగా వైఎస్సార్ పధకాలను మరింతగా చేర్చి జగన్ ఇస్తూ పోతున్నారు.
దాంతో రూరల్ అంటే వైసీపీ అర్బన్ అంటే టీడీపీ అన్న డివిజన్ వచ్చింది. ఇవన్నీ ఇలా ఉంటే అర్బన్ సెక్షన్లు పూర్తి స్థాయిలో ఓటేస్తే టీడీపీ విజయం దక్కుతుంది కానీ వారి ఓటింగ్ తగ్గుతోంది. అదే టైం లో వారు చాలా చోట్లకు ఉద్యోగార్థం వెళ్లిపోతున్నారు. చాలా మంది విదేశాలలో సెటిల్ అయిపోయారు.
పార్టీ సమావేశంలో ఇదే విషయాన్ని బాబు చెబుతూ ఐటీ సెక్టార్ ని తాను అభివృద్ధి చేస్తే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభించాయని వారంతా పట్నాలు దాటి విదేశాలకు వెళ్లి సెటిల్ అయ్యారని, వారి వల్ల ఆయన కుటుంబాలు బాగుపడ్డాయని గుర్తు చేశారు. అయితే దాని వల్ల టీడీపీకే నష్టం జరిగింది అని అన్నారు. టీడీపీ ఓటు బ్యాంక్ అంతా విదేశాలకు అలా తరలిపోయింది అని బాబు సరికొత్త విశ్లేషణ చేశారు.
ఆ ఓటింగ్ అంతా తోడు అయితే టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. ఇదిలా ఉంటే టీడీపీకి ఈ రోజుకీ విదేశాలలో బలమైన ఓటింగ్ ఉంది. కానీ వారు వచ్చి ఓటేయడానికే శ్రమ పడాల్సి వస్తోంది. రూరల్ ఓటింగ్ వైసీపీకి చెక్కు చెదరకుండా ఉంటే అర్బన్ ఓటింగ్ పట్టుకోవడానికి నిలబెట్టుకోవడానికి టీడీపీ మరింతగా శ్రమించాల్సి వస్తోంది. అందుకే బాబు మా ఓటింగ్ అంతా రాష్ట్రం దాటి వెళ్లిపోయింది అని హాట్ కామెంట్స్ చేయాల్సి వచ్చింది అని అంటున్నారు.