టార్గెట్ ఆపోలో హాస్పిటల్స్.. ప్రైవేటు సంస్థలపై మరోసారి రాహుల్ సంచలన వ్యాఖ్యలు
బహుజన నాయకుడు, బీఎస్పీ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం జయంతి వేడుకలు సందర్భంగా రాహుల్ గాంధీ లఖనవూలో పర్యటించారు.;
దేశంలో సామాజిక న్యాయం సరిగా అమలు కావడం లేదని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలోని టాప్ 500 కంపెనీల్లో దళిత, ఓబీసీ, ఆదివాసీలు ఎవరూ నిర్ణయాధికార పోస్టుల్లో లేరని ఎత్తిచూపారు. ఈ క్రమంలో ఆయన ఆపోలో ఆస్పత్రులను ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. దేశంలో ప్రైవేటు సంస్థల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని రాహుల్ గాంధీ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికలు ముందు భారత్ జోడో యాత్ర చేసిన సమయంలో ఆయన ఈ డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. రానురాను తన వాదనను మరింత తీవ్రం చేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లఖనవూలో పర్యటించిన రాహుల్ గాంధీ ప్రైవేటు సంస్థల్లో బడుగు బలహీన వర్గాల ప్రాతినిధ్యంపై చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీశాయి.
బహుజన నాయకుడు, బీఎస్పీ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం జయంతి వేడుకలు సందర్భంగా రాహుల్ గాంధీ లఖనవూలో పర్యటించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో దళితులు, ఆదివాసీలు, ఓబీసీలకు సరైన ప్రాతినిధ్యం ఉండటం లేదని వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా 'మీరు అపోలో ఆస్పత్రికి వెళ్తే ఒక్క దళిత, ఓబీసీ, ఆదివాసీ కమ్యూనిటీకి చెందిన వైద్యుడు కనిపించడు.’’ అంటే రాహుల్ ఎత్తిచూపారు. దేశంలో 500 టాప్ కంపెనీల సీఈవోల లిస్టు తీసినా బడుగు, బలహీన వర్గాల వాళ్లు కనిపించరని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం, సంపద పంపిణీలో అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతోందని విమర్శలు గుప్పించారు.
ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఆకట్టుకునే కార్యక్రమాలకు విపక్ష కూటమి శ్రీకారం చుట్టింది. బహుజన నేత, మన్యవీర్ కాన్షీరాం జయంతి మార్చి 15న జరగనుంది. దీనికి రెండు రోజుల ముందు సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా కాన్షీరాం జయంతి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇక గత కొంతకాలంగా రాహుల్ గాంధీ వినిపిస్తున్న ‘‘జితినీ ఆబాదీ, ఉత్నా హక్ (ఎవరి జనాభా ఎంత ఉందో, వారికి అంత వాటా ఉండాలి) నినాదాన్ని మరోసారి ప్రస్తావించారు. 90 శాతం జనాభాకు వ్యవస్థలో భాగస్వామ్యం లేకపోతే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదని రాహుల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, రాహుల్ గాంధీ లేవనెత్తిన సామాజిక న్యాయంపై మిశ్రమ స్పందన వస్తోంది. సామాజిక న్యాయం జరగాలంటే కేవలం ప్రభుత్వ రంగంలోనే కాకుండా, ప్రైవేటు రంగంలో కూడా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఉండాలని రాహుల్ మద్దతుదారులు కోరుతున్నారు. వ్యవస్థాగతమైన అసమానతలను తొలగించడానికి ఇటువంటి చర్చ అవసరమని వీరు సమర్థిస్తున్నారు. అదేసమయంలో ప్రైవేటు రంగంలో ప్రతిభ ఆధారంగానే నియామకాలు జరగాలని, అక్కడ కూడా కుల ప్రాతిపదికన కోటాలు లేదా విభజన తీసుకురావడం వల్ల దేశ ఆర్థిక వృద్ధి దెబ్బతింటుందని విమర్శకులు వాదిస్తున్నారు.
రాహుల్ గాంధీ 'కుల రాజకీయాల'ను ప్రేరేపిస్తూ దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని అధికార పక్షం ఆరోపిస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్న నేపథ్యంలో, ఉపాధి కల్పించే ప్రైవేటు రంగంలో వెనుకబడిన వర్గాలకు చోటు లేకపోతే వారు ఆర్థికంగా ఎప్పటికీ వెనుకబడే ఉంటారనేది రాహుల్ గాంధీ వాదనగా ఉంది. ఈ క్రమంలో ఆయన సందర్భం దొరికినప్పుడు అల్లా టాప్ 500 కంపెనీలను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆపోలో ఆస్పత్రి పేరును ప్రస్తావించడమే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.