బాబు మరి ఇంత మెతక అయితే ఎలా..?
తాజాగా మరోసారి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలే.. చంద్రబాబు మెతకతనాన్ని స్పష్టం చేస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.;
ఏపీ సీఎం చంద్రబాబు కూటమి కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 18 నెలలు అయింది. అయితే.. ఈ 18 మాసాల్లో దాదాపు 20 సార్లు ఆయన ఢిల్లీ చుట్టూ తిరిగారు. కేంద్ర పెద్దలను కలుసుకున్నారు. సాక్షాత్తూ ప్రధాన మంత్రిని కూడా కలుసుకున్నారు. అయినా.. ఏపీకి సంబంధించిన పనులు కొన్ని అవుతున్నాయి. మరికొన్ని అలానే పెండింగులో ఉండిపోతున్నాయి. ఈ వ్యవహారంపై తరచుగా విన్నపాలు చేయడం.. విజ్ఞాపనలు ఇవ్వడం.. శాలువాలు, మొమెంటోలు ఇవ్వడం వరకే పరిమితం అవుతున్నాయి.
తాజాగా మరోసారి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలే.. చంద్రబాబు మెతకతనాన్ని స్పష్టం చేస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ''తెలంగాణ చెప్పగానే.. చేశారు. మేం 5 నెలల నుంచి కోరుతున్నా.. పెండింగులో ఉంచారు. ఇప్పటికైనా పరిశీలించండి'' అని జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు.. పోలవరం-నల్లమల సాగర్ అనుసంధాన పనులపై విన్నవించారు. ఇక, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు.. 5000 కోట్ల అయినా.. అమరావతికి కేటాయించాలని విన్నవించారు.
వినయం మంచిదే. కానీ.. ఒక్కొక్క సారి ఇది ఇబ్బందిగా కూడా మారుతుంది. వినయ విధేయ రామ అని అనిపించుకునేందుకు, కూటమి ధర్మానికి కట్టుబడేందుకు చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ సంగతి అర్ధమవుతోంది. కానీ, ఒకవైపు రెండే ళ్ల సమయం వచ్చేస్తోంది. కానీ.. అటు పోలవరం, ఇటు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, రైతుల సమస్యలు, పోలవరం-నల్లమలసాగర్ పనులు, ఫైబర్ నెట్ వర్క్ ఇలా.. అనేక అంశాల్లో రాష్ట్రం ముందుకు సాగడం లేదు. వీటిపై ఒకింత కఠినంగా మాట్లాడితే.. తప్ప.. కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం లేదని పరిశీలకులు చెబుతున్నారు.
కేంద్రంతో ఘర్షణకు దిగాలని ఎవరూ కోరుకోవడం లేదు. కానీ, ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మాత్రం చేజార్చుకోవద్దని మాత్రమే చెబుతున్నారు. కేంద్రంలో ఇప్పుడు మోడీ సర్కారు ఉందంటే.. దీనికి కీలకం.. చంద్రబాబు మద్దతు. ఈ విషయాన్ని బాబు మరిచిపోతున్నారో.. వినయంగా ఉండాలని గిరి గీసుకున్నారో తెలియదు కానీ.. ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా.. విన్నపాలు, విజ్ఞాపనలకే పరిమితం అవుతున్నారు.
ఇదే కూటమికి 14 మంది ఎంపీలతో మద్దతు ఇస్తున్న బీహార్ సీఎం, జేడీయూ నేత నితీష్ కుమార్ ఢిల్లీ పర్యటనలకు వెళ్లడంలేదు. ఎవరినీ బ్రతిమాలడమూ లేదు. ఆయన కోరుకున్న కేంద్ర మంత్రులను రాష్ట్రానికి రప్పించుకుని నిధులు తెచ్చుకుంటున్నారు. మరి ఈ తేడా ఎలా వస్తోంది? బాబు మెతక వైఖరితో కాదా.. అనేది సందేహం. సో.. అవసరమైన చోట కొంత కఠినంగా ఉంటే తప్పులేదని పరిశీలకులు చెబుతున్నారు.