బాబు లెక్కలేంటి...జగన్ మీద అంత ధీమానా ?
ఆయన వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో ఎక్కడ ఏది అవసరమో చూసుకుంటూ వెళ్తున్నారు. అదే విధంగా రాజకీయంగా ఇబ్బంది లేకుండా కూడా ఆలోచిస్తున్నారు.;
ఏపీలో సీనియర్ మోస్ట్ నేతగా నాలుగు సార్లు సీఎం గా ఉన్న చంద్రబాబు తనదైన శైలిలోనే పాలన సాగిస్తున్నారు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న బాబు ఇపుడు కూడా అదే బాటలో వడివడిగా అడుగులు వేస్తున్నారు. అదే సమయంలో సంక్షేమం వద్దకు వచ్చేసరికి తనదైన ఫిలాసఫీని ముందుకు తెస్తున్నారు.
పైగా ఆయనకు 2019 నుంచి 2024 వరకూ వైసీపీ ఇచ్చిన సంక్షేమ పధకాలు వాటి ఫలితాల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. దాంతో చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారమే ముందుకు సాగుతున్నారు అని అంటున్నారు.
ఆయన వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో ఎక్కడ ఏది అవసరమో చూసుకుంటూ వెళ్తున్నారు. అదే విధంగా రాజకీయంగా ఇబ్బంది లేకుండా కూడా ఆలోచిస్తున్నారు. వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేసే విషయంలో బాబు కరెక్ట్ గానే ఉంటున్నారు. అధికారంలోకి వచ్చీ తొలి రోజు నుంచి దానిని అమలు చేసుకుంటూ వస్తున్నారు.
పైగా వేయి రూపాయలు ఒకేసారి పెంచేశారు. ఇక లేటెస్ట్ గా మత్య్సకారులకు భృతి ని పది వేల నుంచి ఇరవై వేలకు పెంచేసి మరీ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో మంజూరు చేశారు. మూడు గ్యాస్ సిలిండర్లు ఏడాదికి ఇస్తామన్న మాటను నిలబెట్టుకున్నారు.
అదే సమయంలో ఉచిత బస్సును మహిళల కోసం అమలు చేస్తామన్న హామీ విషయంలో పెద్దగా ఆసక్తిని చూపించడంలేదు అని అంటున్నారు. అన్న దాతా సుఖీ భవ పధకాన్ని మూడు నాలుగు విడతలుగా అమలుకు ప్లాన్ చేస్తున్నారు. అది కూడా కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ తో కలిపి అని మెలిక పెట్టి రెడీ అంటున్నారు. తొందరలో ఆ పధకం కూడా అమలుకు శ్రీకారం చుడుతున్నారు.
ఇక తల్లికి వందనం అన్న పధకం కూటమి సూపర్ సిక్స్ లో ఉంది. ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికీ ఈ పధకాన్ని అమలు చేస్తామని చెప్పిన బాబు శ్రీకాకుళం సభలో మాట్లాడుతూ వాయిదా పద్ధతిలో ఈ పధకం ఇస్తామని చెప్పారు.
అంటే ఒకేసారి ఇరవై వేలు ఒక విద్యార్ధికి కాకుండా నాలుగైదు విడతలుగా ఇస్తే సర్కార్ కి భారం తగ్గుతుందని బాబు ఆలోచిస్తున్నారు అలా చేయడం వల్ల ఒకే కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఇవ్వవచ్చు. అది విద్యా సంవత్సరం ముగిసేనాటికి అన్ని వాయిదాలు కలిపి ఒక విద్యార్ధికి ఇరవై వేలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇలా బాబు తాను అమలు చేసే ప్రతీ పధకంలో చాలా ఆలోచిస్తున్నారు. దాంతో పాటు వాటి వల్ల వచ్చే ఫలితాలు బేరీజు వేసుకుంటున్నారు. అయితే ఈ వాయిదాల పద్ధతుల మీద వైసీపీ నుంచి తీవ్ర నిరసన స్వరం వినిపిస్తోంది. మాట ఇచ్చి తప్పుతున్నారు అని అంటున్నారు.
సూపర్ సిక్స్ ని అటకెక్కించే ఆలోచనలే ఇవన్నీ అని విమర్శిస్తున్నారు ఏకంగా ఒక ఏడాది పాటు తల్లికి వందనం పధకాన్ని అమలు చేయకుండా ఇపుడు వాయిదాలు ఏమిటి అని గుస్సా అవుతున్నారు వాయిదాలు అంటే విద్యార్ధులకు ఇబ్బందిగా తల్లిదండ్రులకు ఇరకాటంగా ఉంటుందని అంటున్నారు
ఒకవేళ విద్యా సంవత్సరంలో కనుక పూర్తి మొత్తం ఇవ్వకపోతే అపుడు ఏమిటి గతి అని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈ రోజు వాయిదాలు అన్నారు, రేపు కుటుంబలో ఒకరికే ఈ పధకం అంటే దిక్కేమిటి అంటున్నారు. ఇవన్నీ ప్రజలలో ఆలోచనలు రేపి వారిలో కొత్త సందేహాలు వచ్చేలా చేయాలన్నదే వైసీపీ ఆలోచన.
మరి ఈ రంగా నిరసనలు జనాలు నుంచి వస్తే ఇబ్బంది వస్తుందని బాబుకు తెలియదా అని అంటున్నారు. ఆయనకు అన్నీ తెలుసు. కానీ ఆయన అమలు చేసే తీరులో ఒక వ్యూహం ఉందని అంటున్నారు ఒకేసారి అన్ని పధకాలు అమలు చేసి ఖజానాకు ఇబ్బంది తెచ్చుకోవడం ఎంతవరకూ కరెక్ట్ అన్నది కూడా ఉంది అని చెబుతున్నారు. మరో వైపు చూస్తే పధకాలు అమలు చేసినా జనాలు పూర్తిగా టర్న్ అవుతారు అన్నది లేదని వైసీపీ పాలన రుజువు చేసిందని అలాంటపుడు శాశ్వతమైన అభివృద్ధికి ఖర్చు చేస్తూ వీలైనంత మేర పధకాల అమలుకు చూసుకుంటూ వెళ్తే ఇబ్బంది లేదని బాబు భావనగా ఉంది.
జనాలు ఎట్టి పరిస్థితుల్లో జగన్ కి చాన్స్ ఇవ్వరన్న ధీమా కూడా ఆయనకు ఉంది. ఇక ఈ రోజుకీ ఏపీకి కావాల్సింది అభివృద్ధి అనే బాబు గట్టిగా నమ్ముతున్నారు. దాంతో తాను ప్రగతి మార్గానే సాగుతున్నారు. వెల్ఫేస్ కి ప్రాధాన్యత ఎంత ఇవ్వాలో అంతా ఇస్తూ ముందుకు సాగుతున్నారని అంటున్నారు. మరి బాబు వ్యూహం సరైనదా కాదా అన్నది చూడాల్సి ఉంది.