తమాషా చేస్తున్నారు.. భరించలేను: చంద్రబాబు
ఇక, ఇక్కడితో మీ రాజకీయాలకు తెరపడుతుంది.'' అని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.;
''పోనీలే కదా.. అని చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నాను. అయినా.. నన్ను అర్ధం చేసుకోవడం లేదు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తమాషాలు చేస్తున్నారు. ఇక, భరించలేను. మిమ్మల్ని మీరు సరిచేసుకోకపోతే.. నేనే సరిచేయాల్సి వస్తుంది. ఇక, ఇక్కడితో మీ రాజకీయాలకు తెరపడుతుంది.'' అని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే, ఫస్ట్ టైమ్ గెలిచిన నాయకుడు చదలవాడ అరవిందబాబు.. రెండు రోజుల కిందట పల్నాడు ఎస్పీతో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాను చెప్పిన న్యాయవాదికి జిల్లా పోలీసుల లీగల్ సెల్ సలహాదారు పదవిని ఇవ్వనందుకు.. ఆయన ఎస్పీ ముందు చిందులు తొక్కారు. అప్పాయింటెమెంట్ ఇస్తామని చెప్పినా.. ఇప్పుడే జరగాలని పంతం పట్టి.. బాత్‌రూంలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు.
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో అరవిందబాబును శుక్రవారం పార్టీ కార్యాలయానికి పిలిచి విచారించారు. ఈ విచారణకు సంబంధించిన నివేదిక తాజాగా శనివారం చంద్రబాబుకు చేరింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఇదే తొలిసారి కాదని.. గతంలోనూ చదలవాడను హెచ్చరించామని గుర్తు చేశారు. ఇలా ప్రతి ఒక్కరూ పదే పదే తప్పులు చేస్తూ కూర్చుంటే ఎలా అని ప్రశ్నించారు.
తప్పులు చేసిన వారిని వెనుకేసుకు రావడానికి పార్టీ పెట్టలేదన్నారు. ప్రజల కోసం.. పనిచేసేవారికే పార్టీలో చోటు ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇక నుంచి కఠిన నిర్ణయాలు తీసుకుని.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా ఇచ్చేది లేదని గుర్తు పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా మిగిలిపోవాలని అనుకునే వారు.. వారి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకోవచ్చని వ్యాఖ్యానించారు.