రఘురామపై చంద్ర‌బాబు అసంతృప్తి!.. ఏం జ‌రిగింది..?

అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారి సీరియస్ అయినట్టు తెలుస్తోంది.;

Update: 2025-06-28 04:51 GMT
రఘురామపై చంద్ర‌బాబు అసంతృప్తి!.. ఏం జ‌రిగింది..?

అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారి సీరియస్ అయినట్టు తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు వైసీపీలో ఉన్నాయన్న అధికారంలోనే ఉన్న పార్టీపై అధికార పార్టీ ఎంపీగా తీవ్ర విమర్శలు గుప్పించారు. అప్పటి సీఎం, అప్పటి నాయకులు, అప్పటి పార్టీని కూడా ఆయన దూషించారు. రోజు రచ్చబండ పేరుతో ఆయన మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఫలితంగా వైసిపి డ్యామేజ్ అయింది. సొంత పార్టీ తప్పులను ఎత్తిచూపడం తప్పు కాదు. కానీ దానికి కూడా ఒక వేదికంటూ ఉంటుంది.

మరీ మితిమీరిన విమ‌ర్శ‌లు, మితిమీరిన వ్యాఖ్యలు చేయడం సొంత పార్టీ నాయకులకు సరికాదన్నది రఘురామ‌ కృష్ణరాజుకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రాజకీయాల్లోకి వచ్చింది తక్కువ కాల‌మైనా ఎక్కువ విజ్ఞత ఉన్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఒక పెద్ద మనిషి తరహాగా ఉంటున్నారు. క్షత్రియ సామాజిక వర్గంలోనే కాకుండా ఇటు కమ్మ సామాజిక వర్గంలోనూ ఆయన పట్ల గౌరవం ఉన్నవారు అనేక మంది ఉన్నారు. చాలామంది పెద్దమనిషి తరహాలోనే ఆయనను భావిస్తారు. అభిమానిస్తారు. గౌరవిస్తారు.

అయితే.. ఆయ‌న ఇప్పుడు వాటిని కాపాడుకోలేకపోతున్నారని మాట వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వంపై తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రతిపక్షానికి ఆయుధంగా మార్చాయి. అది చిన్న విషయమైనా దాన్ని రఘురామ కృష్ణరాజు పెద్దది చేసి చూపడం, విమర్శలు గుప్పించడం అందునా ప్రభుత్వ పెద్దలు అంటూ కామెంట్ చేయడం వంటివి రాజకీయంగా కూటమికి ఇరుకున పెట్టాయని చెప్పాలి. దీనిని ప్రతిపక్షం చాలా అనుకూలంగా వాడుకుంది.

వాస్తవానికి రఘురామ‌కు ప్రతిపక్ష వైసిపికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత‌ పరిస్థితి ఉంది. అయితే.. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలను మాత్రం వైసిపి తనకు అనుకూలంగా మలుచుకుంది. ఇది సీఎం చంద్రబాబుకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఏదైనా ఉంటే పార్టీలో చెప్పాలని, దీనికి అంతర్గతంగా చెప్పేందుకు అవకాశం కూడా ఉందని, లేకపోతే అంతర్గతంగా లేఖ రాయ‌చ్చని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. అంతేగానీ ఇలా బహిరంగ వ్యాఖ్యలు, బహిరంగ ప్రెస్ మీట్ లు పెట్టడం సరికాదని చంద్రబాబు పరోక్షంగా వ్యాఖ్యానించారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. 

ఇటీవల సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో కూటమి ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనిలో ప్రోటోకాల్ పాటించలేదన్నది రఘురామ‌ కృష్ణరాజు చేసిన ప్రధాన ఆరోపణ. సహజంగా ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు జాగ్రత్తగానే వ్యవహరించాలి. అయినా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ప్రోటోకాల్ అన్నది మంచిదే అయినప్పటికీ ఒక్కొక్కసారి లేనంత మాత్రాన దానివల్ల నష్టపోయే అవకాశం కానీ నష్టం చేకూర్చే అంశం కానీ ప్రజల ఓటు బ్యాంకు పోయే అవకాశం కానీ ఏమీ ఉండదు.

కానీ.. జరిగిన పొరపాటును సరిదిద్దుకునేలాగా రఘురామకృష్ణ రాజు సూచనలు, సలహాలు చేసి ఉంటే బాగుండేది. కానీ, ఆయన విమ‌ర్శించేశారు. నేనే ఆ కార్య‌క్ర‌మానికి వెళ్లి ఉంటే బ‌య‌ట‌కు వ‌చ్చేసే వాడిని. . అనే శారు. ప్రభుత్వ పెద్దలు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షానికి వజ్రాయుధంగా మారాయి. వాస్త‌వానికి ఇతర నాయకులు ఎవరూ అవమానపడలేదు. ఇతర నాయకులు ఎవరు కార్యక్రమం పై వ్యతిరేక వ్యాఖ్యలు కూడా చేయలేదు. కానీ అసలు ఈ కార్యక్రమానికి హాజరుకాని రఘురామకృష్ణరాజు మాత్రం దీనిని ఎత్తి చూపడం ద్వారా ప్రధాన సమస్య తీసుకువచ్చారనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

ముఖ్యంగా కూటమి పార్టీల నాయకులు ఇలా వ్యాఖ్యానించకుండా ఉంటే బాగుండేదని అంటున్నారు. దీనిపైనే చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇకమీదట జాగ్రత్తగా ఉండాలని అధికారులకు చెబుతూనే రఘురామ కూడా ఇలా చేయకుండా ఉండాల్సిందని ఆయన చెప్పడం... సున్నితంగా హెచ్చరించి నట్టుగానే భావించాలి.

Tags:    

Similar News