పదవుల కేటాయింపుపై బాబు కీలక నిర్ణయం?
తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.;
తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ నిర్మాణం నుండి ప్రభుత్వ పనితీరువరకు ప్రతీ స్థాయిలో శక్తివంతమైన నాయకత్వాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా యువతకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని ఆయన తేల్చి చెప్పారు. తిరిగి గ్రామీణ స్థాయి పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేయాలని సూచించారు. పదవుల కేటాయింపులో బలహీనతలకు తావు లేకుండా, బలమైన నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలనీ స్పష్టం చేశారు. పార్టీ గీత దాటితే అంగీకరించేదీ లేదని స్పష్టతనిచ్చారని తలపిస్తున్నది.
సీనియర్లతో సమావేశం..
తాజాగా పార్టీ సీనియర్ నేతలతో సమావేశమైన చంద్రబాబు, రాబోయే రోజుల్లో తీసుకోబోయే నిర్ణయాలపై మార్గదర్శకాలు ఇచ్చారు. పార్లమెంటరీ కమిటీల నియామకాల్లో పారదర్శకత ఉండాలని, కొత్త రక్తానికి అవకాశం కల్పించాలనే సూచనలు చేశారు. ఇప్పటికే ఇతర పదవులు చేపట్టి ఉన్న వారికి మరల అవకాశం ఇవ్వకుండా, కొత్త వారిని ప్రోత్సహించాలని ఆదేశించారు. “ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేలా ప్రవర్తన ఉండకూడదు” అని చంద్రబాబు నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. తప్పులు చేసిన వారికి రెండోసారి అవకాశం ఉండదని కూడా స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం దృష్ట్యా మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని కూడా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మిత్రపక్షాలతో సమన్వయం..
అదేవిధంగా, కార్యకర్తల సమస్యలను ప్రజాప్రతినిధులు నేరుగా విని పరిష్కరించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. మిత్రపక్షాలతో సమన్వయం కొనసాగిస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 34 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఈ నియామకాలపై పార్టీ సమావేశాల్లో ప్రతిపాదనలు తీసుకోనున్నారు.
టీడీపీ క్యాడర్ కు శిక్షణ
రాజకీయ వ్యూహాల్లో భాగంగా వచ్చే నెల 1 నుంచి టీడీపీ క్యాడర్‌కు శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. అలాగే, సెప్టెంబర్ 6న అనంతపురంలో “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” పేరుతో భారీ కార్యక్రమం జరగనుంది. ఈ సమష్టి చర్యలతో పార్టీని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మరింత బలంగా నిలబెట్టడమే చంద్రబాబు లక్ష్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.