జగన్ ప్రతిపక్ష హోదాపై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్
ఏపీలో టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీగా రాజకీయం సాగుతోంది. అది వాడి వేడిగా సాగుతోంది.;
ఏపీలో టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీగా రాజకీయం సాగుతోంది. అది వాడి వేడిగా సాగుతోంది. వైసీపీ బయట మీడియా డిబేట్ లు పెడుతూంటే కూటమి పెద్దలు అసెంబ్లీలోనూ మీడియాలోనూ టీవీ డిబేట్లలోనూ బహిరంగ సభలలోనూ వైసీపీని ఆ నేతల వైఖరిని పూర్తి స్థాయిలో ఎండగడుతున్నారు. ఇదిలా ఉంటే జిల్లా అయిన తరువాత తొలిసారి మార్కాపురం పర్యటనను ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ వైసీపీ నేతల తీరు పైన జగన్ వైఖరి మీద హాట్ కామెంట్స్ చేశారు.
హోదా అంటూ బెదిరిస్తున్నారు :
వైసీపీ నేతలు అసెంబ్లీకి రమ్మంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని బెదిరిస్తున్నారు అని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అంటారు, కానీ ప్రజలు మద్దతు ఇవ్వకుండా అది ఎలా వస్తుంది అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు వేసిన ఓట్లతోనే నేను ముఖ్యమంత్రి అయ్యానని ఆయన చెప్పారు. కానీ వారు ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాలని బెదిరిస్తున్నారని బాబు ఫైర్ అయ్యారు. అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యలు చర్చించకుండా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ప్రజల కోసం రాష్ట్రం కోసమే పనిచేస్తున్నాను అని బాబు చెప్పుకొచ్చారు.
బూతులు తిడుతున్నారు :
వైసీపీ నేతలు తనను తన కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడుతున్నారని బాధ వేస్తోంది అని బాబు అన్నారు. మరణించిన నా తల్లిని, నా శ్రీమతిని మా పార్టీ నాయకులను బూతులు తిడుతున్నారని బాబు విమర్శించారు. అవినీతి పరులు బూతులు తిడితే పడాలా అని బాబు ప్రశ్నించారు. తానుగా అయితే ఎవరినీ బూతులు తిట్టలేదని బాబు అన్నారు.
కల్తీ లడ్డూలతో అపవిత్రం :
ఇదిలా ఉంటే తిరుమల పవిత్రతను కల్తీ లడ్డూలతో అపవిత్రం చేశారు అని బాబు ఆగ్రహించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి రసాయనాలతో తయారు చేసిన కల్తీ నెయ్యితో నైవేద్యం పెట్టారని అన్నారు. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి విక్రయించారని బాబు ఆరోపించారు. ఏ మాత్రం సంబందం లేని హెరిటేజ్ పై ఇప్పుడు నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని నాశనం :
అంతే కాకుండా 2019-24 మధ్య రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. భయపెట్టారని బాబు విమర్శించారు. గంజాయి, భూముల కబ్జాలతో ఆరాచకం చేశారని అన్నారు. సర్వేరాళ్లపై కూడా ఫోటోలు వేసుకున్నారని గుర్తు చేశారు. గత పాలకులు వివాదాలతో భూ కబ్జాలు చేశారని బాబు ఆరోపించారు.
రాష్ట్ర చరిత్ర మార్చాలనే :
రాష్ట్ర చరిత్ర మార్చాలనే ధృడ సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఉందని బాబు స్పష్టం చేశారు. అలాగే వరద జలాలు సముద్రంలోకి వృధాగా పోకుండా భూగర్భజలాలు పెంచుతున్నామని అన్నారు. గోదావరి నుంచి 6 వేలు, కృష్ణా నుంచి 15 వందల టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్తోందని బాబు చెబుతూ వెలిగొండ ప్రాజెక్టుకు కావాల్సింది కేవలం 53 టీఎంసీలు మాత్రమేనని అన్నారు. అందుకే తాను నీటి ప్రాజెక్టులు చేపడుతున్నామని అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా సమానంగా ఖర్చు చేస్తున్నామని ఆయన చెప్పారు.