బారికేడ్లపై సీఎం చంద్రబాబు సీరియస్.. దెబ్బకు పూలకుండీలు వచ్చేశాయి
అందుకే అంటారు రాజకీయ పార్టీ అధినేతలకు అధికారం ఒక్కటే ఇస్తే అస్సలు బాగుండదు.;
అందుకే అంటారు రాజకీయ పార్టీ అధినేతలకు అధికారం ఒక్కటే ఇస్తే అస్సలు బాగుండదు. అప్పుడప్పుడు ప్రజలు వారికి అధికారంతో పాటు.. ప్రతిపక్షంలో ఉండేలా చేస్తే.. వారి మైండ్ లో సెట్ లో మార్పు వచ్చేందుకు వీలువతుంది. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మరే రాజకీయ పార్టీ అధినేత తినని ఎదురుదెబ్బల్ని తిన్నారు చంద్రబాబు. అందుకే కాబోలు.. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆయన చిన్న విషయాల్ని సైతం సునిశితంగా గమనిస్తూ.. వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవటం కనిపిస్తుంది.
వెలగపూడిలోని సచివాలయానికి వెళుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎక్కడ పడితే అక్కడ బారికేడ్లు పెట్టిన పోలీసుల తీరును గుర్తించారు. ఈ తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన ఆయన.. ఇది రాష్ట్ర సచివాలయమా? కమర్షియల్ కాంప్లెక్సా? అంటూ ప్రశ్నించారు. పోలీసుల తీరును తప్పు పట్టారు. సచివాలయానికి సీఎం వచ్చే వేళలో.. రోడ్డుపైకి వాహనాలు.. ప్రజలు ప్రవేశించకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేవారు.
సచివాలయ ప్రధాన రహదారికి ఇరువైపులా ప్రకటనలతో కూడిన బారికేడ్లను అడ్డుపెట్టిన తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సచివాలయ ప్రాంగణం ఆహ్లాదంగా ఉండాలే తప్పించి..బారికేడ్లతో గందరగోళంగా ఉండొద్దని స్పష్టం చేశారు. అంతేకాదు.. సచివాలయానికి చేరుకున్న తర్వాత ఆర్టీజీఎస్ మీటింగ్ లోనూ బారికేడ్లు పెట్టిన తీరును ప్రశ్నించారు. రోడ్డును పూర్తిగా మూసేయటాన్ని తప్పు పట్టారు.
పింఛన్ల పంపిణీకి తాను ఊళ్లకు వెళుతుంటే.. అక్కడ ఏర్పాట్లు బాగుంటున్నాయని.. దాంతో పోలిస్తే.. సచివాలయం వద్ద బారికేడ్లు పెట్టిన తీరు అస్సలు బాగోలేదని పేర్కొన్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకొని.. మార్చేయాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ కావటంతోయుద్ధ ప్రాతిపదికన అక్కడున్న బారికేడ్లను తీసేసిన పోలీసు యంత్రాంగం అక్కడ పూలకుండీలను ఏర్పాటు చేశారు. చిన్న లోపాల్ని గుర్తించి.. వాటిని వెంటనే సరిదిద్దేలా వ్యవహరిస్తున్న చంద్రబాబు తీరు చూస్తే.. ఆయనలో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి.