వన్ టైం ఎమ్మెల్యేలుగా ఉండిపోతారా? బాబు మాస్ వార్నింగ్

ప్రభుత్వానికి.. పార్టీకి నష్టం వాటిల్లేలా వ్యవహరించే సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చేశారు. వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోతామనుకుంటే మీ ఇష్టం..;

Update: 2025-06-08 04:16 GMT
వన్ టైం ఎమ్మెల్యేలుగా ఉండిపోతారా? బాబు మాస్ వార్నింగ్

వీలైనంతవరకు సర్ది చెప్పటం.. తీరు మార్చుకోకున్నా బుజ్జగించటం.. చర్యల కత్తికి పదును పెట్టేందుకు మొహమాటానికి గురయ్యే చంద్రబాబు తీరును పలువురు తప్పు పడుతుంటారు. అయితే.. తన పాత అలవాట్లను మార్చుకున్నట్లుగా ఆయన తన తాజా తీరుతో స్పష్టం చేశారు. ప్రభుత్వానికి.. పార్టీకి నష్టం వాటిల్లేలా వ్యవహరించే సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చేశారు. వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోతామనుకుంటే మీ ఇష్టం.. అలాంటి వారిని వదులుకోవటానికి నేను సిద్ధమంటూ స్పష్టం చేవారు.

అందరి ఎమ్మెల్యేల పనితీరు మీదా తనకు సమాచారం ఉందని.. ప్రతి ఒక్క ఎమ్మెల్యేతోనూ తాను ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తానని చెప్పిన చంద్రబాబు.. తాజాగా పార్టీకి చెందిన మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలతో టెలీ కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. నేతల పనితీరుపై సర్వే నివేదికలు.. సమాచారం తెప్పిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. కొందరు బాగా పని చేస్తున్నారంటూ వారిని అభినందిస్తూనే.. గాడి తప్పిన నేతల్ని తాను ఉపేక్షించలేనని తేల్చి చెప్పారు.

ఒకరిద్దరు కోసం ప్రభుత్వ.. పార్టీ ప్రయోజనాల్ని పణంగా పెట్టలేనని.. అలాంటోళ్లను తాను దూరం పెడతానని స్పష్టం చేసిన చంద్రబాబు.. ‘అలాంటి వారిని వదులుకునేందుకు సిద్ధమని ఇప్పటికే ఒక్రటెండు సార్లు స్పష్టం చేశా. త్వరలో ప్రతి ఎమ్మెల్యేతో ముఖాముఖి భేటీలు నిర్వహిస్తా. వారి పని తీరుకు సంబంధించిన నివేదికల్ని వ్యక్తిగతంగా అందజేస్తా. పని చేయని వారి విషయంలో 1995 నాటి విధానాన్ని అమలు చేస్తా’ అని స్పష్టం చేశారు.

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారు మరింత బాధ్యతగా పని చేయాలని చెప్పిన చంద్రబాబు.. ప్రజలకు.. కార్యకర్తలకు అందుబాటులో ఉండాలన్నారు. అతి విశ్వాసంతో వ్యవహరిస్తే వారికే ఎక్కువ నష్టం కలుగుతుందన్న చంద్రబాబు.. ‘‘మీరు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదన్నది నా ఆలోచన. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు మనల్ని గమనిస్తుంటారు. ప్రజలు మనతో ఉండేలా చూసుకోవాలి. వారిలో నమ్మకాన్ని కలిగించాలి. మంచి చేస్తే మరిన్ని అవకాశాలు కల్పిస్తా. తప్పు చేస్తే దూరం పెడతా. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే’ అని చెప్పారు. మాటల్లో చూపించిన కరకుదనం.. నిర్ణయాల రూపంలోనూ చూపిస్తే బాగుంటుందన్న మాట తెలుగు తమ్ముళ్ల నోట వినిపిస్తోంది.మరి.. చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News