బీజేపీకి గ్రేటర్ హడల్...ఆశలు గల్లంతేనా ?
ఇక దేశం కోసం హితం కోసం అని బీజేపీ ఎంత చెప్పిన వినే వారు ఉంటారా అన్నదే చర్చ. అదే సమయంలో పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రభావం అని చెప్పినా జనాక్రోశం గట్టిగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తాజాగా ప్రధాని నరేంద్ర మోడీని రప్పించి మరీ హైదరాబాద్ నడిబొడ్డున బీజేపీ భారీ సభను నిర్వహించింది. ఈ సభ ద్వారా గ్రేటర్ ఎన్నికలకు గేర్ మార్చి స్పీడ్ పెంచాలని బీజేపీ తెలంగాణా రాష్ట్ర శాఖ ఎంతో ఆశ పడింది. ప్రధానిగా మూడవసారి గెలిచిన తరువాత నరేంద్ర మోడీ తెలంగాణాకు రావడం ఒక ప్రత్యేక ఆకర్షణ అయితే పశ్చిమ బెంగాల్ విజయం మరో కీలక పరిణామం. ఇలా అందివచ్చిన అవకాశాలను సొంతం చేసుకుని బీజేపీ జెండా గ్రేటర్ హైదరాబాద్ మీద మోగించాలనుకుంటే నెత్తిన పిడుగు పడ్డట్లుగా పెట్రోల్ డీజిల్ ధరల బాంబు పేలింది. ఒక్కసారిగా పెరిగిన ఈ ధరలు కేవలం వాటికే పరిమితం కావు ఏకంగా ఇంటి బడ్జెట్ నే పెంచేస్తాయి. దాంతో కోటి మంది జనాభా కలిగిన గ్రేటర్ హైదరాబాద్ వాసులు ఇపుడు పెట్రోల్ షాక్ తో తల్లడిల్లిపోతున్నారు.
మురిసినంత సేపు లేదు :
గ్రేటర్ హైదరాబాద్ ఏకంగా మూడు వందలకు పైగా డివిజన్లతో ఎన్నికలు జరుపుకుంటోంది. గతంలో 150 దాకా సీట్లు ఉన్నపుడే మూడవ వంతు అంటే 40 కి పైగా డివిజన్లు సాధించి బీజేపీ జెండా భజాయించింది. ఈసారి అంతకు రెట్టింపు కూడా కాదు ఏకంగా సెంచరీలనే దాటేయాలని వీలైతే విక్టరీనే కొట్టి గ్రేటర్ పీఠం మీద జెండా పాతాలని బీజేపీ భావిస్తోంది. దానికి తగిన విధంగా సమాయత్తం అవుతున్న వేళ పెట్రోల్ డీజిల్ ధరలతో టోటల్ సీన్ గ్రేటర్ లో బూమరాంగ్ అయ్యేలా ఉందని కమలనాధులు మదనపడుతున్నారు.
అతి పెద్ద ఎఫెక్ట్ :
ఉన్నట్లుండి పెట్రోల్ మీద లీటర్ కి మూడు రూపాయలు పైగా పెరిగింది. దాంతో పెట్రోల్ అక్షరాలా 110.88 గా ఉంటే డీజిల్ ధర 98.96 రూపాయలుగా ఉంది. భాగ్యనగరవాసులకు ఇది భారీ ఇబ్బందిని తెచ్చి పెడుతోందని అంటున్నారు. చిన్న జీవులు చిరు జీవుల నుంచి అంతా కూడా తెల్లారి లేస్తే ఉరుకుల పరుగుల జీవితం. దాంతో పెట్రోల్ పోసుకుని టూ వీలర్స్ మీద వెళ్ళే వారు ఉంటే ఆటోలను ఆశ్రయించే వారు ఉన్నారు. ఈ పరిణామంతో వారికీ వీరికీ కూడా తడిసి మోపెడు అవుతుందని లెక్క వేస్తున్నారు. ఇక కూరగాయలు నిత్యావసరాలు పాలూ పెరుగు ఒకటేమిటి డీజిల్ పెరుగుదలతో అన్నీ పెరిగి ఇంటి బడ్జెట్ కూడా తల్లకిందులు అవుతోంది. ఇవన్నీ చూసిన తరువాత గ్రేటర్ జనాలు కచ్చితంగా పెంచిన వారి మీద కోపం పెంచుకుంటారు అని అంటున్నారు.
బీజేపీ ఎంత చెప్పినా :
ఇక దేశం కోసం హితం కోసం అని బీజేపీ ఎంత చెప్పిన వినే వారు ఉంటారా అన్నదే చర్చ. అదే సమయంలో పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రభావం అని చెప్పినా జనాక్రోశం గట్టిగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. మధ్య తరాగ్తి దిగువ తరగతి వర్గాలు అయితే ఈ చర్యతో యాంటీ అవుతారు అన్న బెంగ అయితే బీజేపీ పెద్దలకు పట్టుకుంది. దాంతో సడెన్ గా వచ్చి పడిన ఈ కష్టాన్ని ఎలా అధిగమించాలి ఎలా జనాలను కన్వీన్స్ చేయాలన్నదే పెద్ద టాస్క్ గా తెలంగాణా రాష్ట్ర బీజేపీ నేతలకు కనిపిస్తోంది అని అంటున్నారు.
కాంగ్రెస్ దూకుడు ఖాయం :
ఇక ఇదే అదనుగా కాంగ్రెస్ కచ్చితంగా గ్రేటర్ ఎన్నికలను జరిపించేస్తుందని అంటున్నారు. వీలైనంత తొందరగా షెడ్యూల్ ని ఖరారు చేసి ఎన్నికలు పెడుతుందని చెబుతున్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేసిన హుషార్ కి ఇపుడు విపక్షాల వీక్ నెస్ ని కూడా తోడు చేసుకుని హస్తం పార్టీ జోరు చేస్తుంది అని అంటున్నారు. మొత్తం మీద గ్రేటర్ లో గెలవాలని మేయర్ పీఠం పట్టాలని చూస్తున్న బీజేపీకి ఆ పార్టీ కేంద్ర పెద్దలే భారీ షాక్ ఇచ్చేశారు అని అంటున్నారు.