బెంగాల్‌ గడ్డపై 'యోగి' మార్క్.. అక్రమార్కుల గుండెల్లో ’సువేందు‘ 'బుల్‌డోజర్' వణుకు!

ఈ సందర్భంగా ఎంపీ రాజు బిస్తా మాట్లాడుతూ.. సిలిగురిలో గత కొన్నేళ్లుగా అక్రమ నిర్మాణాలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు.

Update: 2026-05-16 02:30 GMT

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో "తగ్గేదేలే" అనే నినాదంతో సువేందు సర్కార్ సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. ఇన్నాళ్లూ ఒక తీరుగా సాగిన పాలన.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్ఫూర్తితో 'బుల్‌డోజర్ మోడల్' వైపు మళ్లింది. ప్రభుత్వ భూములను కబ్జా చేసినా అక్రమ నిర్మాణాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తూ.. సిలిగురి వేదికగా బుల్‌డోజర్లు గర్జించడం మొదలుపెట్టాయి. యూపీ నుంచి ప్రత్యేకంగా బుల్‌డోజర్లను రప్పిస్తూ ఎంపీ రాజు బిస్తా మద్దతుతో సువేందు ప్రభుత్వం చేపట్టిన ఈ 'క్లీన్ డ్రైవ్' రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా, అక్రమ మద్యం, డ్రగ్స్ మాఫియాల అంతమే లక్ష్యంగా సాగుతున్న ఈ 'సువేందు మార్క్' దూకుడు.. బెంగాల్ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పశ్చిమ బెంగాల్‌లో కొత్త రాజకీయ వాతావరణం వేగంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం సువేందు అధికారి వరుస కీలక నిర్ణయాలతో పాలనలో దూకుడు పెంచుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆయన.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ అమలు చేస్తున్న “బుల్‌డోజర్ మోడల్”ను ఇప్పుడు బెంగాల్‌లోనూ ప్రవేశపెడుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే అక్రమ నిర్మాణాలపై భారీ స్థాయిలో చర్యలు ప్రారంభించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా సిలిగురి ప్రాంతంలో ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలు, జలవనరులపై ఏర్పడిన అక్రమ కట్టడాలను గుర్తించిన ప్రభుత్వం.. వాటి కూల్చివేతకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే బుల్‌డోజర్లు రంగంలోకి దిగి పలు నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నాయి. దీంతో “యోగీ మార్క్ పాలన” ఇప్పుడు బెంగాల్‌లో మొదలైందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఈ చర్యలకు డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తా పూర్తి మద్దతు ప్రకటించారు. అక్రమ నిర్మాణాలను ఏ పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ నుంచి రెండు డజన్లకు పైగా బుల్‌డోజర్లను తెప్పిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో చట్టపరమైన పాలనను బలపరచడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

సిలిగురిలో ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో శాంతిభద్రతలు, భూకబ్జాలు, డ్రగ్స్ నియంత్రణ, అక్రమ మద్యం దుకాణాలు, అనధికార బార్‌ల తొలగింపు వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది. ముఖ్య అధికారులు, పోలీసు విభాగం ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో కఠిన చర్యలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నగర పరిధిలో విస్తరించిన అక్రమ నిర్మాణాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా ఎంపీ రాజు బిస్తా మాట్లాడుతూ.. సిలిగురిలో గత కొన్నేళ్లుగా అక్రమ నిర్మాణాలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. స్థానిక మున్సిపాలిటీ పాలకులు, అధికారులు తమ బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఈ విషయంలో త్వరలోనే అధికారులను వివరణ కోరనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూములపై ఎలాంటి ఆక్రమణలు సహించబోమని, చెరువులు, యు జలవనరులను పూర్తిగా కాపాడుతామని స్పష్టం చేశారు.

బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఒకవైపు ప్రభుత్వం “అక్రమాలపై యుద్ధం”గా ప్రచారం చేస్తుండగా.. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం దీనిని రాజకీయ లక్ష్యాలతో చేస్తున్న చర్యలుగా విమర్శిస్తున్నాయి. అయినప్పటికీ ప్రజల్లో క్రమశిక్షణ, చట్ట పరిరక్షణ, భూకబ్జాల నిర్మూలన అంశాలపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోందనే భావన బలపడుతోంది.

దీంతో ఇకపై పశ్చిమ బెంగాల్‌లో కూడా యూపీ తరహా కఠిన పాలన కొనసాగుతుందా..? “యోగీ ఫార్ములా”నే సువేందు ప్రభుత్వం అమలు చేస్తుందా..? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News