జాతీయ రాజకీయాల్లోకి రేవంత్ రెడ్డి ?

ఒక న్యూస్ పోర్టల్ నిర్వహించిన ఒక కాంక్లేవ్ లో రేవంత్ రెడ్డి తాజాగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రాజకీయం గురించి తెలంగాణాలో కాంగ్రెస్ గురించి చెప్పారు.

Update: 2026-05-16 03:46 GMT

తెలంగాణా కాంగ్రెస్ ముఖ్య్మంత్రిగా రేవంత్ రెడ్డి గత రెండున్నరేళ్ళుగా కొనసాగుతున్నారు. ఆయనకు మరో సగం కాలం పైగా అధికారం చేతిలో ఉంది. ఇక కాంగ్రెస్ లో ఆయన మంచి పట్టు సాధించారు. కాంగ్రెస్ వంటి మహా సముద్రంలో రేవంత్ రెడ్డి తనదైన రాజకీయ వ్యూహాలతో అందరినీ కలుపుకుని పోతున్నారు. ఇక రేవంత్ రెడ్డి జాతీయ స్థాయిలోనూ తన ప్రభావాన్ని చూపిస్తున్నారు. తాజాగా జరిగిన కేరళం ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి అక్కడ యూడీఎఫ్ విజయం సాధించడంలో భాగం అయ్యారు. ఢిల్లీలో పార్టీ తరఫున జరిగే కార్యక్రమాలలో కూడా ఆయన కనిపిస్తూ ఉంటారు. అలాంటి రేవంత్ రెడ్డికి జాతీయ రాజకీయాల మీద మోజు ఉందా అంటే కచ్చితంగా ఉంటుంది. మరి ఆయన జాతీయ రాజకీయాలలో ప్రవేశం ఎపుడు అన్న ప్రశ్నలకు ఆయనే జవాబు చెప్పారు.

అప్పటి నుంచీ అక్కడ :

ఒక న్యూస్ పోర్టల్ నిర్వహించిన ఒక కాంక్లేవ్ లో రేవంత్ రెడ్డి తాజాగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రాజకీయం గురించి తెలంగాణాలో కాంగ్రెస్ గురించి చెప్పారు. కాంగ్రెస్ గెలుస్తుందని మళ్ళీ మళ్ళీ కూడా విజయం తమదే అని ధీమా వ్యక్తం చేశారు. ఇక తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళేది 2034 అని ఆయన చెప్పారు. అంటే మరో టెర్మ్ కూడా తానే తెలంగాణాకు సీఎం గా ఉంటాను అని చెప్పకనే చెప్పారు అన్న మాట. తెలంగాణా ఎన్నికలు 2028లో జరుగుతాయి. ఆ తరువాత మళ్ళీ 2033లో జరుగుతాయి. రేవంత్ రెడ్డి చెప్పేది ఏంటి అంటే 2034 లో కూడా కాంగ్రెస్ తెలంగాణాలో అధికారంలో ఉంటుందని. ఆ విధంగా కాంగ్రెస్ ని గెలిపించిన తరువాత తాను జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడతాను అని అంటున్నారు. అంటే తెలంగాణాలో కాంగ్రెస్ హ్యాట్రిక్ కొడుతుందని రేవంత్ రెడ్డి గాఢంగా నమ్ముతున్నారు అన్న మాట. అందులో రెండు సార్లు తానే సీఎం అవుతాను అని కూడా ఆయన బలంగా విశ్వసిస్తున్నారు అన్న మాట.

టార్గెట్లు గట్టిగానే :

ఇక రేవంత్ రెడ్డి తరచూ మరో మాట కూడా అంటూ ఉంటారు. తాను రాజకీయాల్లో మరో ఇరవై ఏళ్ళ పాటు కొనసాగుతాను అని. అందులో పదేళ్ళు రాష్ట్ర రాజకీయాలకు అంకితం చేస్తే మరో పదేళ్ళు జాతీయ స్థాయి రాజకీయాలకు అన్న మాట. ఈ విధంగా లెక్క చూసుకుని మరీ రేవంత్ రెడ్డి టార్గెట్లు పెట్టుకున్నారని అంటున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందని ఆయన చెప్పడం వెనక ఆయన ధీమా వెనక కూడా కచ్చితమైన రాజకీయ సమీకరణలు పక్కా లెక్కలూ ఉన్నాయని అంటున్నారు. బీఆర్ ఎస్ లో ఇబ్బందులు బీజేపీ పూర్తిగా ఎదగలేకపోవడం వంటివి కూడా కాంగ్రెస్ కి కలసి వస్తాయని ఆయన విశ్లేషించుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి రానున్న కాలంలో దేశానికి రాహుల్ ప్రధాని అవుతారని కూడా నమ్మకంగా ఉన్న రేవంత్ రెడ్డి 2034 కి నాటికి కేంద్ర రాజకీయాల్లో ప్రవేశిస్తాను అని అంటున్నారు. అంటే ఆయన జాతీయ స్థాయిలో ఏ విధంగా రాణించాలన్నది కూడా ఒక స్పష్టమైన ఆలోచనలో ఉన్నారని చెప్పుకోవాల్సిందే.

Tags:    

Similar News