AC లు- కూలర్ లతో పని లేదు! జోధ్‌పూర్ 'నెట్-జీరో' కూలింగ్ షెల్టర్.. సామాన్యుల చల్లని గూడు!
పర్యావరణ అనుకూలంగా రూపొందించిన ఈ కేంద్రం పూర్తిగా సౌర విద్యుత్ పైనే ఆధారపడి పనిచేస్తుంది. పైన అమర్చిన సోలార్ ప్యానెల్స్ ద్వారా లోపల ఉండే ఫ్యాన్లు, లైట్లకు అవసరమైన విద్యుత్ అందుతుంది.
భారతదేశంలో వేసవి తీవ్రత ఏటేటా పెరుగుతున్న తరుణంలో సామాన్యులను వడగాల్పుల నుండి రక్షించేందుకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరం ఒక అద్భుతమైన మార్గాన్ని అన్వేషించింది. ఎయిర్ కండిషనర్లు (ఏసీ) వంటి ఖరీదైన .. విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే పరికరాలు లేకుండానే కేవలం ప్రకృతి సిద్ధమైన మార్గాల ద్వారా చల్లదనాన్ని అందించే `నెట్-జీరో కూలింగ్ షెల్టర్`ను అక్కడ నిర్మించారు. ఈ వినూత్న ప్రయత్నాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు. సిటీ ప్రణాళికలో కేవలం సాంకేతికత మాత్రమే కాదు... సామాన్యులపై ఉండే `సానుభూతి` ఎంతటి మార్పును తెస్తుందో ఈ షెల్టర్ నిరూపిస్తోందని ఆయన కొనియాడారు.
ఈ కూలింగ్ షెల్టర్ ప్రత్యేకత ఏమిటంటే బయట ఎండ 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నా... దీని లోపల ఉష్ణోగ్రత దాదాపు 8 డిగ్రీల వరకు తక్కువగా ఉంటుంది. దీని కోసం ఎటువంటి కృత్రిమ కూలింగ్ సిస్టమ్స్‌ను వాడలేదు. దీనికి బదులుగా స్మార్ట్ ప్యాసివ్ డిజైన్ పద్ధతులను అవలంబించారు. షెల్టర్ పైకప్పుపై సౌర వికిరణాలను పరావర్తనం చేసే రిఫ్లెక్టివ్ కోటింగ్... గాలిని చల్లబరిచేందుకు వట్టి(గడ్డి) వేళ్ల పరదాలు..వేడి గాలిని బయటకు పంపి చల్లని గాలిని లోపలికి తెచ్చే విండ్ టవర్లను ఇక్కడ అమర్చారు. ఆధునిక విజ్ఞానాన్ని, సాంప్రదాయ పద్ధతులను మేళవించి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు.
మహిళా హౌసింగ్ ట్రస్ట్ -జోధ్‌పూర్ నగర్ నిగమ్ సంయుక్తంగా `హీట్ యాక్షన్ ప్లాన్` కింద ఈ ప్రాజెక్టును చేపట్టాయి. ముఖ్యంగా వీధి వ్యాపారులు, డెలివరీ బాయ్స్, దినసరి కూలీలు, వృద్ధుల వంటి ఎండలో తిరగక తప్పని వ్యక్తుల కోసం ఈ షెల్టర్ ఒక గొప్ప వరంగా మారింది. ఒకేసారి 40 నుండి 45 మంది విశ్రాంతి తీసుకునేలా దీనిని తీర్చిదిద్దారు. ఎండ తీవ్రతకు గురైన వారు ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోవడమే కాకుండా... శరీరంలో నీటి శాతాన్ని పెంచే ఓఆర్ఎస్ ద్రావణం, చల్లని తాగునీరు, అత్యవసర ఫస్ట్ ఎయిడ్ కిట్ సౌకర్యాలను కూడా ఉచితంగా పొందవచ్చు.
పర్యావరణ అనుకూలంగా రూపొందించిన ఈ కేంద్రం పూర్తిగా సౌర విద్యుత్ పైనే ఆధారపడి పనిచేస్తుంది. పైన అమర్చిన సోలార్ ప్యానెల్స్ ద్వారా లోపల ఉండే ఫ్యాన్లు, లైట్లకు అవసరమైన విద్యుత్ అందుతుంది. అంటే కార్బన్ ను విడుదల చేయకుండానే ఇది ప్రజలకు ఉపశమనాన్ని ఇస్తోంది. వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేటి కాలంలో ఇటువంటి సుస్థిరమైన పరిష్కారాలు విలాసం కాదు.. అత్యంత అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జోధ్‌పూర్ చూపించిన ఈ మార్గం దేశంలోని ఇతర నగరాలకు ఒక చక్కని పాఠంలా నిలుస్తుంది.
భారతదేశంలోని ప్రతి నగరంలో బస్టాపుల మాదిరిగానే ఇటువంటి కూలింగ్ షెల్టర్ల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. తక్కువ ఖర్చుతో పర్యావరణానికి మేలు చేస్తూ.. ప్రాణాలను కాపాడే ఇటువంటి ఆవిష్కరణలు సామాన్య మానవుడి జీవన ప్రమాణాలను పెంచుతాయి. జోధ్‌పూర్ `నెట్-జీరో` షెల్టర్ కేవలం ఒక విశ్రాంతి గది మాత్రమే కాదు.. అది వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి మనముందున్న ఒక శక్తివంతమైన ఆయుధం. భవిష్యత్తులో పట్టణీకరణ అంటే కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాదని.. అది ప్రకృతితో మమేకమైన మనుషుల సృజనాత్మకతతో కూడుకున్న నిర్మాణం అని ఈ ప్రాజెక్ట్ చాటిచెబుతోంది.