50 ఏళ్లు CMగా ఏల్తాడు.. అమెరికా-రష్యా సమస్యా తీరుస్తాడు! దళపతి విజయ్‌పై జోశ్యం నవ్వులపాలు!
రాధన్ పండిట్ కేవలం విజయ్ ప్రాంతీయ అధికారానికే పరిమితం కాకుండా.. ఆయనకు అంతర్జాతీయ స్థాయి శక్తులు ఉన్నాయని విశ్లేషించారు.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన దళపతి జోసెఫ్ విజయ్ జాతకంపై ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం జాతీయ మీడియాలో సైతం హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సంచలన విజయం సాధిస్తుందని ఎన్నికలకు ముందే జోస్యం చెప్పిన ఈ పండితుడు తాజాగా విజయ్ సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. విజయ్ జాతకంలో `సునామీ` లాంటి బలమైన గ్రహస్థితులు ఉన్నాయని.. ఆయన మరో 50 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా దేశ రాజకీయాలను శాసిస్తారని రాధన్ పండిట్ పేర్కొన్నారు.
ప్రస్తుతం 51 ఏళ్ల వయసులో ఉన్న ముఖ్యమంత్రి విజయ్.. జ్యోతిష్యుడి లెక్కల ప్రకారం 101 ఏళ్ల వయసు వచ్చే వరకు తమిళనాడును పాలిస్తారనే వార్త సోషల్ మీడియాలో..ప్రధాన వార్తా ఛానళ్లలో హెడ్‌లైన్స్‌గా నిలిచింది. రాధన్ పండిట్ కేవలం విజయ్ ప్రాంతీయ అధికారానికే పరిమితం కాకుండా.. ఆయనకు అంతర్జాతీయ స్థాయి శక్తులు ఉన్నాయని విశ్లేషించారు. భవిష్యత్తులో రష్యా, అమెరికా దేశాల మధ్య ఉన్న ప్రపంచ స్థాయి విభేదాలను, అంతర్జాతీయ పంచాయితీలను కూడా విజయ్ తన దౌత్య శక్తులతో పరిష్కరిస్తారని.. అలాగే 2029 నాటికి ఆయన దేశ ప్రధాని అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని సంచలన ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఈ వ్యవహారం పెద్ద వివాదంగా మారింది.
అయితే ఈ జ్యోతిష్యుడి వ్యాఖ్యల వెనుక తమిళనాడు సెక్రటేరియట్‌లో జరిగిన ఒక హైడ్రామా దాగి ఉంది. ఎన్నికల్లో విజయ్ గెలుపును కచ్చితంగా అంచనా వేసినందుకు గాను సీఎం విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రాధన్ పండిట్‌ను ప్రభుత్వంలో అత్యంత కీలకమైన `ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ - పొలిటికల్` (ఓఎస్‌డి) గా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పెరియార్, అన్నాదురైల హేతువాద - ద్రవిడ సిద్ధాంతాలకు పురిటిగడ్డ అయిన తమిళనాడులో ఒక లౌకిక ప్రభుత్వంలో జ్యోతిష్యుడికి అధికారిక పదవి కట్టబెట్టడం ఏమిటంటూ ప్రతిపక్ష డిఎంకె, ఎఐఎడిఎంకె లతో పాటు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, వీసీకే, సీపీఐ(ఎం) వంటి మిత్రపక్షాలు సైతం తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.
శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించాల్సిన ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి మూఢనమ్మకాలకు చోటు కల్పించడం అరిష్టమంటూ అసెంబ్లీ లోపల, బయట విమర్శలు వెల్లువెత్తడంతో సీఎం విజయ్ తక్షణమే రక్షణాత్మక చర్యలు చేపట్టారు. విపక్షాలు -కూటమి పార్టీల నుండి వచ్చిన తీవ్ర నిరసనల నేపథ్యంలో నష్టనివారణ చర్యగా రాధన్ పండిట్ నియామక ఉత్తర్వులను జారీ చేసిన కేవలం 18 గంటల్లోనే (ఒక రోజు తిరక్కుండానే) విజయ్ ప్రభుత్వం రద్దు చేసింది. అసెంబ్లీలో బలపరీక్ష ముగిసిన వెంటనే ఈ రద్దు సర్క్యులర్ వెలువడటం గమనార్హం.
మొత్తానికి ఒక జ్యోతిష్యుడు ముఖ్యమంత్రికి 101 ఏళ్ల వరకూ పాలన ఉంటుందని, రష్యా-అమెరికా గొడవలు తీరుస్తారని చెప్పిన అసాధారణమైన జ్యోస్యం మీడియాలో పెద్ద ఎత్తున మీమ్ ఫెస్టివల్ కి దారి తీసినా.. ఆ జ్యోతిష్యుడి ప్రభుత్వ పదవీ కాలం మాత్రం కేవలం 18 గంటలకే పరిమితం కావడం గమనార్హం. ఒక స్టార్ హీరోగా ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిన విజయ్ పరిపాలన ప్రారంభంలోనే ఎదుర్కొన్న ఈ మొట్టమొదటి సిద్ధాంతపరమైన సవాలును జ్యోతిష్యుడిని పక్కన పెట్టడం ద్వారా సద్దుమణిగేలా చేశారు. అయితే ఈ 50 ఏళ్ల సీఎం యోగం.. అంతర్జాతీయ పంచాయితీల కామెంట్స్‌పై నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.