టీడీపీ ఫైవ్ ఫార్ములా: త్వరలో కీలక సర్వే.. !
రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ సర్వే చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అయితే ఇది ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై కాకుండా పార్టీకి సంబంధించిన నాయకుల పని తీరుపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు.;
రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ సర్వే చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అయితే ఇది ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై కాకుండా పార్టీకి సంబంధించిన నాయకుల పని తీరుపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. త్వరలోనే మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందన్న వార్తల నేపథ్యంలో ఈ సర్వేకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇటీవల కాలంలో నాయకులపై తరచుగా విమర్శలు వస్తున్నాయి. అదే విధంగా ఆరోపణలు పెరుగుతున్నాయి. అయితే అందరూ అని కాదు కానీ ఎక్కువ నియోజకవర్గాల్లో పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ కొన్ని కొన్ని కీలక నియోజకవర్గాల్లో నాయకుల పనితీరు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు వంటి వాటిని అంచనా వేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు మరోసారి సర్వే చేయించేందుకు సిద్ధమవుతోంది. ప్రధానంగా ఈ సర్వేలో మండల స్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా నాయకుల పనితీరును తెలుసుకుంటారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలో జరగనున్న నేపథ్యంలో అసలు వాస్తవ పరిస్థితి ఎట్లా ఉంది.. ప్రజలకు- నాయకులకు మధ్య ఉన్న సంబంధాలు బలంగా ఉన్నాయా లేవా.. అనే అంశాలను నిర్ధారించుకుంటారు. అలాగే నాయకులు ఏ మేరకు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అనేది తెలుసుకుంటారు.
వ్యక్తిగతంగా పనితీరును అంచనా వేయడంతో పాటు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో నాయకుల పాత్ర ఎంతవరకు ఉందో తెలుసుకుంటారు. వారు ఏ మేరకు సక్సెస్ గా వ్యవహరిస్తున్నారు అన్న కీలక విషయాన్ని కూడా పరిగణాల్లోకి తీసుకుంటారు. మొత్తంగా ఐదు అంశాలను ఈ సర్వేలో ప్రస్తావించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సర్వే సాగేది వీటిపైనే..
1) ప్రజలతో నాయకులకు ఉన్న సంబంధం. వారితో ఉన్న కలివిడి. సమస్యల పరిష్కారం.
2) సంక్షేమ పథకాలు ప్రభుత్వ పనితీరుపై ప్రజలకు వివరిస్తున్న తీరు. వాటిలో వారి పాత్ర.\ గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నియోజకవర్గంలో ఏ మేరకు అమలు చేస్తున్నారు, దీనిపై ఏ విధంగా ముందుకు సాగుతున్నారు.
3) ప్రజాదర్బార్ల నిర్వహణ. సమస్యలను పరిష్కరిస్తున్న విధానం. ప్రజల సంతృప్తిని అంచనా వేస్తారు.
4) పార్టీలో క్షేత్రస్థాయి నాయకులను కలుపుకొని వెళ్తున్న తీరు. అదే విధంగా సమస్యలు పరిష్కారం... వంటి వాటిని తెలుసుకుంటారు.
5) వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్‌ను కాపాడుకుంటున్నారా లేదా అనేది అంచనా వేస్తారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో తమ ఇమేజ్‌ను కొంతమేరకైనా పుంజుకునేలా చేస్తారా లేదా? అనేది చూస్తారు. ఇలా ఐదు కోణాల్లో సర్వే చేయించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.