బాబు సింగపూర్ టూర్...అమరావతి కి గేమ్ చేంజర్!
అమరావతికి సింగపూర్ సొగసులు కూడా అద్దాలని నిర్ణయించుకున్నారు.;
ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనను సిద్ధమయ్యారు. ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకూ ఆరు రోజుల పాటు ముఖ్యమంత్రి అత్యున్నత స్థాయి బృందంతో కలిసి సింగపూర్ పర్యటన చేపడుతున్నారు. బాబు సింగపూర్ పర్యటన నేపథ్యం చాలా కీలకంగా ఉంది. 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉండగా సింగపూర్ అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగస్వామ్యం అయింది. అమరావతిలో ఎన్నో కీలక ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా సింగపూర్ ముందుకు వచ్చింది.
ఈ విషయంలో సింగపూర్ తో అవగాహన ఒప్పందాలను కూడా నాటి చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకుంది. 2014-19 మధ్య సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం కూడా గత ప్రభుత్వం చేసుకుంది. ఆ దేశ ప్రధానమంత్రి ఇతర అధికారులతో చర్చించి కమిటీలు వేసి అమరావతి అభివృద్ది కోసం సింగపూర్ ని భాగస్వాములను చేశారు. అంతే కాదు అమరావతి రాజధానిలో 1450 ఎకరాలు భూమిని స్విస్ ఛాలెంజ్ విధానంలో 42:58 నిష్పత్తిలో కేటాయించారు.
అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సింగపూర్ అధికారులపై కేసులు పెట్టారని అక్కడికి వెళ్లి మరీ వారిని వేధించారని మంత్రి నారాయణ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి ఒక నగరం నిర్మాణం ఎలా చేయాలో అవగాహన లేదని మండిపడ్డారు. సింగపూర్ భాగస్వామ్యం కనుక జరిగితే అమరావతికి పెద్ద కంపెనీలు,బ్యాంకులు వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చేవని ఆయన అన్నారు. గతంలో వైసీపీ హయాంలో సింగపూర్ ప్రభుత్వానికి ఏపీ సర్కార్ కు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని అన్నారు. చంద్రబాబు.సింగపూర్ పర్యటనలో ఏపీ ప్రభుత్వంపై ఉన్న ముద్ర పోగొట్టుకునేలా వారితో కీలక సమావేశాలు జరుగుతాయని అన్నారు.
మరో వైపు చూస్తే సింగపూర్ భాగస్వామ్యం ఉంటే అంతర్జాతీయ రాజధానిగా అమరావతిని చేయవచ్చు అన్నది కూటమి ప్రభుత్వం ఆలోచనగా ఉంది. అమరావతికి సింగపూర్ సొగసులు కూడా అద్దాలని నిర్ణయించుకున్నారు. దాంతో సాదరంగా సింగపూర్ ప్రభుత్వాన్ని అమరావతి విషయంలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించ బోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ భవనాలు తయారు అవుతున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తున్నాయి దేశంలోని ప్రముఖ కంపెనీలను ఆహ్వానిస్తున్నారు. వారంతా అమరావతిలో పెట్టుబడి పెడితే అమరావతి రూపు రేఖలు పూర్తిగా మారిపోతుందని ఊహిస్తున్నారు. మరో నలభై వేల ఎకరాల భూములు రెండవ విడతలో తీసుకోవడం వెనక కూడా ప్రభుత్వం ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు.
మొత్తంగా డెబ్బై నుంచి ఎనభై వేల ఎకరాలలో అంతర్జాతీయ రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలన్నదే ప్రణాళిక అంటున్నారు. రేపటి రోజున చెన్నై, హైదరాబాద్ బెంగళూరులను దాటుకుని మరీ అమరావతికి పెట్టుబడిదారులు రావాలంటే బిగ్ స్కేల్ మీదనే అభివృద్ధి ఉండాలన్నది బాబు మార్క్ ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే సింగపూర్ కి బాబు వెళ్తున్నారు. బాబు టూర్ లో భారీ లక్ష్యాలే ఉన్నాయని చెబుతున్నారు. ఇక సింగపూర్ లో చంద్రబాబు కేవలం అమరావతికి మాత్రమే కాకుండా ఏపీలోని కీలక ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు సేకరిస్తారు అని అంటున్నారు.
బ్రాండ్ ఎపి ప్రమోషన్ తో రాష్ట్రానికి పెట్టుబడులను సాధించేందుకు సిగపూర్ పర్యటనను ఒక వేదికగా చంద్రబాబు చేసుకోనున్నారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ విధానాలను వివరిస్తారని చెబుతున్నారు. ఏపీకి ఉన్న పొటెన్షియాలిటీని వివరిస్తారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవేలు, హార్బర్లు, భూముల లభ్యత, కనెక్టివిటీ, 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం, నిపుణులైన మానవ వనరులు గురించి బాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించనున్నారు.
మొత్తం ఆరు రోజుల పర్యటనలో సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అలాగే రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సిఎం పారిశ్రామిక వేత్తలను కోరనున్నారు.
తొందరలోనే విశాఖ కేంద్రంగా పెట్టుబడుల సదస్సుని చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నిర్వహించనుంది. ఆ సదస్సుకు సింగపూర్ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తారు. డిజిటల్ ఎకానమీ, ఫిన్‌టెక్‌పై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. అలాగే సింగపూర్‌లో నిర్వహించే బిజినెస్ రోడ్ షోకు హాజరవుతారు. ఆ దేశంలోని వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను కూడా ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. మొత్తం మీద అమరావతికి ఏపీకి గేమ్ చేంజర్ గా బాబు సింగపూర్ టూర్ మారనుంది అని అంటున్నారు.