మూడు రోజులే గ‌డువు.. బాబు డిసైడ్ అయ్యారా.. ?

రాజ్యసభ పై తమ ఆశలు పెట్టుకున్నామని మాజీ ఎంపీ ఒకరు చెప్పుకొచ్చారు. అదేవిధంగా పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన మాజీ మంత్రి ఒకరు ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు.

Update: 2026-05-29 01:30 GMT

రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యేందుకు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. జూన్ ఒకటో తారీఖున రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. కేంద్ర‌ ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఈ ఎన్నికలు జూన్ 1 నుంచి ప్రారంభమై 18 రోజుల్లో జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్రమంలో ఏపీకి సంబంధించి నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికే చెందుతాయి.

ముఖ్యంగా మెజారిటీ స్థానాలు దక్కించుకున్న టిడిపికే ఈ స్థానాలు లభిస్తాయి. ఇక ఈ నాలుగు స్థానాల్లో కూడా ఒకటి ఇప్పటికే టిడిపి చేతిలో ఉంది. మిగిలిన మూడు వైసీపీకి చెందిన స్థానాలు. అవి ఖాళీ అయితే కూటమి పక్షాల తరుపున నాయకులు పెద్దల సభకు వెళ్తారు. అయితే, ఈ నోటిఫికేషన్ వెలువడేందుకు మరో మూడు రోజులే సమయం ఉన్నప్పటికీ ఇంకా ఆశావ‌హులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. మహానాడు వేదికగా కూడా చాలామంది చంద్రబాబును మంత్రి లోకేష్ ను కలిసి తమ అభ్యర్థనలను వినిపించారు.

రాజ్యసభ పై తమ ఆశలు పెట్టుకున్నామని మాజీ ఎంపీ ఒకరు చెప్పుకొచ్చారు. అదేవిధంగా పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన మాజీ మంత్రి ఒకరు ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇలా టికెట్ల కోసం ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు నోటిఫికేషన్ వచ్చేందుకు సమయం దగ్గర పడింది. ఈ క్రమంలో సిఎం చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. దీనిపై తాజాగా మహానాడులో జరిగిన అంతర్గత చర్చలను గమనిస్తే కీలక విషయం ఒకటి వెలుగు చూస్తుంది.

చంద్రబాబు ఇప్పటికే డిసైడ్ అయ్యారని, పేర్లను ప్రకటించడమే మిగిలి ఉందని ఒక సీనియర్ నాయకుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిని బట్టి చంద్రబాబు ఇప్పటికే డిసైడ్ అయ్యారని స్పష్టమవుతుంది. అయితే ఏ సీటు ఎవరికి ఇస్తారు అనేది చూడాలి. మరోవైపు కూటమి పార్టీలు కూడా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో తమ సీటు కావాలని జనసేన ఇప్ప‌టికే పట్టుబట్టిన విషయం తెలిసిందే. మరోవైపు బిజెపి కూడా ఒక సీటు కోరుతోంది.

అయితే ఈ దఫా బీజేపీకి ఇవ్వబోమని చంద్రబాబు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. దీనికి కూడా అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. ఈ వచ్చిన అవకాశాన్ని బిజెపి వదులుకుంటుందా.. మొత్తం సీట్లు టిడిపికే అప్పచెబుతుందా అనేది చూడాలి. ఇలా ఒకవైపు నాయకుల మధ్య చర్చ నడుస్తోంది.. మరోవైపు చంద్రబాబు డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఏది ఏమైనా మరో మూడు రోజుల్లో ఈ విషయానికి తెర పడనుంది. ఎవరిని ఎంపిక చేస్తారు.. ఎవరిని పెద్దల‌ సభకు పంపిస్తారు అనేది చూడాలి.

ప్రస్తుతం ఉన్న‌ పరిస్థితిలో బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని డిమాండ్ ఒకవైపు వినిపిస్తుండగా మైనారిటీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం మైనారిటీ సామాజిక వర్గానికి ఏపీ నుంచి ప్రాధాన్యం లేదు. కాబట్టి వైసిపి వంటి పార్టీని ఎదుర్కొనేందుకు మైనారిటీ వర్గాన్ని కూడా చేరువ చేసుకోవాలన్నది చంద్రబాబు వ్యూహం. అయితే కచ్చితంగా ఆ కోటాలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉందని స్పష్టం అవుతుంది.

Tags:    

Similar News