మెషిన్ల కోసం పనిచేస్తామా? పిల్లలపై మళ్లీ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
అధిక సంతానం కనాలని ప్రకటనలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన వాదనలను సమర్థించుకున్నారు.
అధిక సంతానం కనాలని ప్రకటనలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన వాదనలను సమర్థించుకున్నారు. పిల్లలు లేకుంటే భవిష్యత్తులో మెషిన్ల కోసమే పనిచేయాల్సివస్తుందని హెచ్చరించారు. శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట బహిరంగ సభలో నవ దంపతులు ముగ్గురు అంతకంటే ఎక్కువ పిల్లలను కనాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అధిక సంతానం కన్న దంపతులకు ప్రోత్సాహకాలు ఇస్తామని కూడా ప్రకటించారు.
అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. విపక్షంతోపాటు పలువురు తటస్థ వర్గానికి చెందిన మేథావులు సైతం విమర్శలు గుప్పించారు. అధిక సంతానం కనేవారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని, పిల్లల చదువు, ఇతర కనీస అవసరాలు తీర్చడం కష్టమని వాదించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి ఇస్తామన్న రూ.30, రూ.40 వేలు ఎందుకూ సరిపోదని విమర్శలతో విరుచుకుపడ్డారు.
విపక్షంతోపాటు మేథావి వర్గం నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యవత ఎక్కువ మంది సంతానం కనేందుకు ఆసక్తి చూపాలని మళ్లీ మళ్లీ చెబుతూ ఆసక్తికర చర్చ కొనసాగేలా చేస్తున్నారని అంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన బహిరంగ సభలో తనపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ పాత వాదనను మరింత గట్టిగా వినిపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ‘అధిక సంతానంపై నేను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుబడుతున్నారు. పిల్లలు లేకపోతే మెషీన్ల కోసం పనిచేయాల్సివస్తుంది’ అంటూ ఉద్ఘాటించారు.
తన సూచనలపై ప్రతి కుటుంబం ఆలోచించాలని కోరారు. అంతేకాకుండా తన వాదనను భవిష్యత్తులో మరింత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకువెళతానని, అందరికీ అవకాహన కల్పిస్తానని చెప్పారు. భవిష్యత్తు సుస్థిరంగా ఉండాలనే ఆలోచనతో జనాభా పెరిగేందుకు కొత్త పాలసీలు కూడా తీసుకువస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. విమర్శలకు భయపడితే సంస్కరణలు సాధ్యం కావని స్పష్టం చేస్తూ.. భవిష్యత్తు సుస్థిరత కోసం సరికొత్త పాలసీలను తీసుకొస్తున్నట్లు వివరించారు.
కాగా, ముఖ్యమంత్రి తాజా వ్యాఖ్యలపై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబు అన్న మాటల్లో టెక్నాలజీ, జనాభా సమతుల్యతకు సంబంధించిన లోతైన అర్థం ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, రోబోటిక్స్ విపరీతంగా పెరుగుతున్నాయని, ఒక సమాజంలో యువత లేదా మానవ వనరులు తగ్గిపోతే, ఆ వ్యవస్థలను నడపడానికి, నిర్వహించడానికి కేవలం కొద్దిమంది మానవులు మాత్రమే మిగులుతారని సీఎం చంద్రబాబు పేర్కొంటున్నారని చెబుతున్నారు.
మానవ మేధస్సుతో కొత్త ఆవిష్కరణలు చేయడం ఆగిపోయి, ఉన్న యంత్రాలను రక్షించుకోవడానికి, వాటి మెయింటెనెన్స్ కోసమే మనుషులు శ్రమించాల్సి వస్తుందని అర్థం చేసుకోవాలని అంటున్నారు. సమాజంలో 'క్రియేటివిటీ' తగ్గి, 'మెకానికల్' లైఫ్ ఎక్కువవుతుందని చెబుతున్నారు. ప్రతి కుటుంబం ఆలోచించాల్సింది కూడా ఇదేనంటున్నారు. మానవ వనరులు లేకపోతే సాంకేతికత సమాజాన్ని శాసిస్తుందే తప్ప, మానవాళికి ఉపయోగపడదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.