సింధు జలాల ఒప్పందంపై పాకిస్థాన్‌కు భారత్ తీవ్ర హెచ్చరిక.. కెనడాలోనూ పాక్‌కు మళ్లీ చుక్కెదురు
భారత్, పాకిస్థాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సింధు జలాల ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది.
భారత్, పాకిస్థాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సింధు జలాల ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న రూపంలో ఈ ఒప్పందం మళ్లీ అమలులోకి వచ్చే ప్రసక్తే లేదని ప్రభుత్వ వర్గాలు ఖరాకండిగా స్పష్టం చేశాయి.
భవిష్యత్తులో నదీ జలాల పంపిణీపై చర్చలు జరగాలన్నా.. ఒప్పందం పునరుద్ధరణ కావాలన్నా పాకిస్థాన్ ముందుగా సరిహద్దు ఉగ్రవాదాన్ని శాశ్వతంగా అంతం చేయాలని భారత్ షరతు విధించింది. దేశ సార్వభౌమాధికారానికి, భద్రతకు ముప్పు వాటిల్లితే ఈ ఒప్పందం నుంచి పూర్తిగా వైదొలగడానికి కూడా వెనుకాడబోమని తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చింది.
అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ
ఒకవైపు భారత్ హెచ్చరికలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్‌కు అంతర్జాతీయ దౌత్య వేదికలపై కూడా వరుసగా చుక్కెదురవుతోంది. కశ్మీర్ అంశంతో పాటు సింధు జలాల ఒప్పందం వివాదంలో జోక్యం చేసుకోవాలంటూ కెనడాను కోరిన పాకిస్థాన్ ప్రయత్నాలు దారుణంగా విఫలమయ్యాయి.
అభ్యర్థనలను పట్టించుకోని కెనడా...
కెనడా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. ఆ దేశ విదేశాంగ మంత్రి అనితా ఆనంద్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ భేటీలో భారత్ సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని.. దీనిపై భారత్‌పై అంతర్జాతీయ ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా కశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వం వహించాలని కోరారు. దౌత్య పరంగా పాకిస్థాన్ చేసిన ఈ ప్రతిపాదనలను కెనడా అస్సలు పట్టించుకోలేదు. భేటీ అనంతరం ఇరు దేశాలు విడుదల చేసిన అధికారిక సంయుక్త ప్రకటనలో కశ్మీర్ కానీ.. సింధు జలాల వివాదం కానీ కనీసం ప్రస్తావనకు కూడా రాకపోవడం గమనార్హం.
పరువు తీసుకున్న పాక్ దౌత్యం
నిత్యం అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై బురదజల్లే ప్రయత్నం చేసే పాకిస్థాన్‌కు కెనడా పర్యటనలోనూ పరాభవం ఎదురైంది. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ జలాల ఒప్పందాల గురించి మాట్లాడే అర్హత పాక్‌కు లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేయగా.. ఇప్పుడు కెనడా కూడా పాక్ వ్యాఖ్యలను లైట్ తీసుకోవడంతో అంతర్జాతీయంగా ఆ దేశం మరోసారి తీవ్ర అవమానాన్ని ఎదుర్కొంది.