అక్షరాల ₹201 లక్షల కోట్లు.. అప్పుల కుప్పలో కేంద్రం! పదేళ్లలో 214% పెరిగిన భారం..
అభినందనలు దేశప్రజలారా.. మనం ఒక అద్భుతమైన.. చారిత్రాత్మక మైలురాయిని విజయవంతంగా దాటేశాం.
అభినందనలు దేశప్రజలారా.. మనం ఒక అద్భుతమైన.. చారిత్రాత్మక మైలురాయిని విజయవంతంగా దాటేశాం. ఎంతలా అంటే ఆ సంఖ్య వింటేనే మన కాల్క్యులేటర్‌లోని డిజిట్లు సరిపోక చేతులెత్తేస్తాయి. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ గారు నవ్వుతూ లేదా గంభీరంగానో ఇచ్చిన లెక్కల ప్రకారం.. మన కేంద్ర ప్రభుత్వ అప్పు అక్షరాల ₹201.17 లక్షల కోట్లకు చేరింది.. అవును మీరు సరిగ్గానే చదివారు.. 'లక్షల కోట్లు'! వందలు, వేలు మాట్లాడితే మన స్థాయి తగ్గుతుంది కాబట్టి లెక్కలు ఎప్పుడూ లక్షల కోట్లలోనే ఉండాలి మరి.
11 ఏళ్ల ప్రగతి.. 214 శాతం ఎగిసిన అప్పుల రథం!
ఒక్కసారి గతంలోకి తొంగి చూద్దాం. 2014-15 కాలంలో కేంద్ర ప్రభుత్వ అప్పు కేవలం ₹64.11 లక్షల కోట్లు మాత్రమే ఉండేది. ఎంత చిన్న సంఖ్యో కదా? మన పాలకులు ఊరుకుంటారా? "ఏంటిది.. అప్పులు కూడా సరిగ్గా చేయలేరా?" అని కసిగా కష్టపడి రాత్రింబవళ్లు శ్రమించి.. ఈ 11 ఏళ్ల కాలంలో ఆ అప్పును ఏకంగా 214 శాతం పెంచేశారు. గత పదేళ్లలో మన ప్రభుత్వం తెచ్చిన కొత్త అప్పులు ₹125.99 లక్షల కోట్లు. తిరిగి కట్టింది ఎంతంటే.. ఏదో బాకీ తీర్చామనిపించడానికి ఒక ₹30.94 లక్షల కోట్లు.. అప్పు తీర్చడం కంటే కొత్త అప్పు పుట్టించడమే కదా అసలైన కళ..
ఇప్పుడు మీలో కొందరికి సందేహం రావచ్చు.. "అయ్యా! పుట్టిన ప్రతి చిన్నారి నెత్తిన, కనీసం ఏమీ తెలియని సామాన్యుడి తలపైనా లక్ష రూపాయిలకు పైగా అప్పు భారం పడింది కదా?" అని. ఛీఛీ.. అలా ప్రతిదానికీ భయపడితే దేశం ఎలా ముందుకు వెళ్తుంది?
ఖర్చు అనకండి.. అది భవిష్యత్ పెట్టుబడి
అసలు ఈ అప్పులన్నీ దేనికి వాడారో తెలుసా? ఊరికే టీలు, బిస్కెట్లకు ఖర్చు పెట్టలేదు సుమా. అద్భుతమైన 8-లేన్ల నేషనల్ హైవేలు కట్టారు. వాటిపై మీరు ప్రయాణించాలంటే రోజుకో టోల్ గేట్ వద్ద 'స్పెషల్ టాక్స్' కట్టాలనడం వేరే విషయం. విమానాశ్రయాలు, రైల్వేలు ఆధునీకరించారు.
రక్షణ రంగాన్ని బలోపేతం చేశారు.
అంటే మీ దగ్గర పైసలు ఉన్నా లేకపోయినా.. మీ పేరు మీద మాత్రం సూపర్ నేషనల్ హైవేలు, భారీ ఎయిర్‌పోర్టులు సిద్ధంగా ఉన్నాయి. "మేము అప్పులు చేసింది మీ అభ్యున్నతి కోసమే" అని ప్రభుత్వం చాలా ప్రేమగా చెప్తోంది. రేపు భవిష్యత్ తరాలు వచ్చి "మాకేమిచ్చారు?" అని అడిగితే.. "మీకో గుట్టంత అప్పు, దానికి తగ్గట్టు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఇచ్చాం" అని గర్వంగా చెప్పుకోవచ్చు.
‘అప్పు చేసి పప్పు కూడు’ కాదు.. ‘అప్పు చేసి హైవే రోడ్డు’
ఆర్థిక నిపుణులు, విమర్శకులు మాత్రం ఊరికే ఏడుస్తుంటారు. "అయ్యో.. భవిష్యత్ తరాలపై భారం పెరిగిపోతోంది.. దేశ ఆర్థిక వ్యవస్థ డేంజర్ జోన్‌లో పడుతోంది" అని టెన్షన్ పడుతుంటారు. కానీ మన పాలకుల విజన్ వేరు. "అప్పు లేనిదే అభివృద్ధి ఎక్కడ?" అనే సూత్రాన్ని నమ్మి ఎంత అప్పు దొరికితే అంత ముంచెత్తడమే అసలైన ఆర్థిక నిర్వహణ అని నిరూపిస్తున్నారు.
ఏది ఏమైనా 140 కోట్లకు పైగా ఉన్న భారత జనాభాలో ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములే. జేబులో రూపాయి లేకపోయినా.. దేశం తరఫున లక్షల రూపాయల అప్పు ఉన్న 'సంపన్న' పౌరులుగా మనం గర్వపడాలో గంగవెర్రులెత్తాలో అర్థం కాక జనాలు తలలు పట్టుకుంటున్నారు. జై అప్పుల భారత్..