ఏదీ.. మునుపటిలా ఉండదు: చంద్రబాబులో డిఫరెంట్ యాంగిల్
వచ్చే నాలుగు సంవత్సరాల కాలంలో సాధించబోయే ప్రగతిని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వివరిస్తూ.. ఏదీ మునుపటిలా ఉండదని వ్యాఖ్యానించారు.;
ఏపీ సీఎం చంద్రబాబు.. సాధారణంగా ఎక్కడ ప్రసంగించినా.. మూస ధోరణిలోనే ముందుకు సాగుతారు. గతం వర్తమానాన్ని జోడించడంలో ఎక్కువ సమయం తీసుకుంటారు. అదేసమయంలో భవిష్యత్తు దర్శ నం కూడా చేస్తారు. అయితే.. ఈసారి మాత్రం కొంత మేరకు ఆయన భావ భావాల్లో మార్పు కనిపించడం గమనార్హం. తాజాగా ఆయన చేసిన ప్రసంగంలో పంచ్ లు పడ్డాయి.. 'ఏదీ మునుపటిలా ఉండదు. మేం చెప్పిందే చేస్తాం.. చేసి చూపిస్తాం'' అంటూ.. సినిమాటిక్ డైలాగులను వండి వార్చారు.
వచ్చే నాలుగు సంవత్సరాల కాలంలో సాధించబోయే ప్రగతిని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వివరిస్తూ.. ఏదీ మునుపటిలా ఉండదని వ్యాఖ్యానించారు. అనేక కార్యక్రమాలు ఇప్పడు ముందుకు సాగుతు న్నాయని చెప్పారు. కేవలం 9 నెలల కాలంలోనే అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. రాజధాని అమరావతిని గాడిలో పెట్టినట్టు చెప్పారు. వచ్చే మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందన్నా రు. ''రాజధాని అభివృద్ధి చెందితే ఆదాయం వస్తుంది. దాని ద్వారా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు అవకాశం కలుగుతుంది'' అని భవిష్యత్తును చెప్పుకొచ్చారు.
ఇదే సయమంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. దీనిని పూర్తి చేసి ఉంటే.. ఇప్పటికే రాష్ట్ర సస్యశ్యామలం అయ్యేదని చెప్పారు. కానీ, ఏదీ మునుపటిలా ఉండదు.. పోలవరం పరుగులు పెడు తుంది.. అంటూ.. 2027 నాటికి ఆ ప్రాజెక్టును పూర్తిచేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతామన్నారు. వచ్చే ఎన్నికల నాటికి పోలవరం సమస్యను పూర్తి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం మాదిరిగా వ్యవహరించేది తాము కాదన్నారు.
గత పాలకులు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను దివాళా తీయించారంటూ .. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్రం దగ్గర ఒకవిధంగా.. రాష్ట్రంలో మరో విధంగా వ్యవహరించారని చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.11,400 వేల కోట్లు రప్పించి.. ప్లాంటును డెవలప్ చేస్తున్నామన్నారు. ఏదీ మునుపటిలా ఉండదని.. విశాఖ ప్లాంటు అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీకి కూడా.. ఈ నెలలోనే ముహూర్తం ఖరారు చేశామని చెప్పారు. ఇలా.. చంద్రబాబు తన ప్రసంగంలో డిఫరెంట్ చూపించడం గమనార్హం.