అర్జునుడు, హనుమంతుడే సూపర్ హీరోలు.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

భారతదేశం త్వరలోనే సూపర్ పవర్ కావడం ఖాయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు చేశారు.;

Update: 2025-12-26 09:55 GMT

భారతదేశం త్వరలోనే సూపర్ పవర్ కావడం ఖాయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు చేశారు. తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభ సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి సందర్శించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వివిధ యుద్ద పరికరాల నమూనాలను సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. సంస్కృతి, సంప్రదాయాలను నిలబెడుతూ.. దేశాభివృద్ధి కోసం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కృషి చేస్తున్నారని చంద్రబాబు కితాబునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి.

మన దేశం, భారతీయత గురించి చర్చించుకోవడానికి భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ మంచి వేదిక అంటూ వ్యాఖ్యానించారు. ప్రాచీన కాలంలోనే భారతదేశం విజ్ఞానాన్ని సముపార్జించిన దేశంగా పరిఢవిల్లిందని గుర్తు చేశారు. వేల ఏళ్ల క్రితమే హరప్పా నాగరికత ద్వారా అర్బన్ ప్లానింగ్ అంటే ఏంటో చాటి చెప్పామన్నారు. 2900 ఏళ్ల క్రితమే యోగాభ్యాసం చేశాం... ఇప్పుడు 150 దేశాలు యోగాను పాటిస్తున్నాయి. యోగా పాటిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రికార్డు స్థాయిలో నిర్వహించామని వెల్లడించారు.

“మన భారతీయ విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు... మరింత విస్తృత పరిచేందుకు భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ అద్భుతంగా కృషి చేస్తోందని సీఎం కొనియాడారు. దక్షిణ భారత దేశంలో 7వ భారతీయ విజ్ఞాన్ సమ్మేళనాన్ని తిరుపతిలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. పవిత్ర ప్రాంతమైన తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు... వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయి. అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్, స్పెయిన్, జర్మనీ, రష్యా, జపాన్ వంటి దేశాల్లో 2 వేల ఏళ్ల క్రితం భారత దేశానికంటే ఎంతో వెనుకబడి ఉన్నాయి. 2 వేల ఏళ్ల క్రితం ప్రపంచంలోనే భారత దేశం 40 శాతం జీడీపీని కలిగి ఉండేది. నాలెడ్జ్ ఎకానమీలో భారత్ ఎప్పుడూ సూపర్ పవర్ గానే ఉండేదన్నారు సీఎం చంద్రబాబు.

‘‘భారత దేశం భవిష్యత్తులో సూపర్ పవర్ గా మారబోతోంది. దేశంలో అద్భుతమైన కుటుంబ వ్యవస్థ ఉంది. అందరికీ భద్రత కల్పించేలా మన కుటుంబ వ్యవస్థ ఉంటుంది. మన పురాణాల గురించి పిల్లలకు వివరించాలి. మన పురాణ పురుషుల గొప్పదనాన్ని యువతకు తెలియచెప్పాలి” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాముడు..రామరాజ్యం గురించి పిల్లలకు వివరించాలని సీఎం సూచించారు. స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ వంటివి కాకుండా... మన పురాణాల గురించి పిల్లలకు చెప్పండి. హలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణ పురుషులు గొప్ప వారని.. వారి చరిత్రను వివరించాలి. సూపర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడు. బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడు అన్న విషయాలు’’ పిల్లలకు తెలియాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.



కృష్ణుని మహిమలు, శివుడి మహత్యం గురించి యువతకు బోధించాలి. రాముడిని మించిన పురుషోత్తముడు ప్రపంచంలో ఎవ్వరూ లేరని... రామరాజ్యం గురించి వివరించాలి. *అవతార్ సినిమాకంటే మన భారత, రామాయణాలు గొప్పవి. బకాసురుడు, కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా పిల్లలకు తెలియజేయాలి. ఎవరు మంచి వాళ్లో... ఎవరు చెడ్డవాళ్లో చెప్పగలిగితే మంచికి, చెడుకి వ్యత్యాసం తెలుస్తుంది. ప్రజలు పురాణాల గురించి మరిచిపోయే సమయంలో ఎన్టీఆర్ ఎన్నో పురాణ గాధలతో కూడిన సినిమాలు చేశారంటూ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గొప్పతనాన్ని శ్లాఘించారు సీఎం చంద్రబాబు.

Tags:    

Similar News