మ‌ళ్లీ రంగంలోకి బాబు.. స‌మ‌స్య‌లు సెట్‌రైట్‌.. !

ఇది ఇలా కొనసాగితే పార్టీకి నష్టం వస్తుందని భావిస్తున్న చంద్రబాబు.. నామినేషన్ల పర్వం పూర్తి కాగానే అంటే ఒకటి రెండు రోజుల్లోనే ఆయన పార్టీ నాయకులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు.

Update: 2026-10-18 12:30 GMT

టిడిపి అధినేత చంద్రబాబు మళ్ళీ రంగంలోకి దిగుతున్నారా? పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆయన వరుస పెట్టి సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారా? అవ‌స‌ర‌మైతే జిల్లాల్లోనూ ప‌ర్య‌టించ‌నున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా కూటమి పొత్తులో భాగంగా 20 స్థానాలకు పైగా మున్సిపల్ సీట్లను జనసేనకు కేటాయించారు. ఇది టిడిపి నాయకులు తప్పు పట్టకపోయినప్పటికీ తాము కోరుకున్న స్థానాలను లేదా తమకు బలంగా ఉన్న స్థానాలను జనసేనకు ఇవ్వడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

సాలూరులో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఏకంగా కన్నీరు పెట్టుకున్న ఉదంతాలు, అలాగే శ్రీకాకుళం లో మాజీ మంత్రి, రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం వంటివి పార్టీలో హైలెట్ గా మారాయి. ఇవి ఒకరకంగా చిన్నవే అయినప్పటికీ ఎన్నికల సమయానికి కూటమిపై ప్రభావం చూపించే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. టిడిపిలో ఎంపికల విషయంలో కూడా తమ్ముళ్లు అసంతృప్తితో ఉన్నారు. తాము కోరుకున్న వారికి లేదా తాము ఆశించిన వారికి అవకాశం కల్పించలేదని అధిష్టానం పై ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా కొనసాగితే పార్టీకి నష్టం వస్తుందని భావిస్తున్న చంద్రబాబు.. నామినేషన్ల పర్వం పూర్తి కాగానే అంటే ఒకటి రెండు రోజుల్లోనే ఆయన పార్టీ నాయకులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. అదేవిధంగా తానే స్వయంగా అవసరమైతే జిల్లాల్లో పర్యటించాలని కూడా నిర్ణయించుకున్నారు. తద్వారా ప్రస్తుతం నెలకొన్న అసంసత్తులు, సమస్యలు పరిష్కారం అవుతాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా టిడిపి గెలుపు ఓటముల కంటే కూడా కూటమిగా ఉన్న జనసేన పార్టీపై ఎక్కువగా చంద్రబాబు దృష్టి పెడుతున్నారనే చెప్పాలి.

21 మున్సిపాలిటీ స్థానాలతో పాటు నాలుగు కార్పొరేషన్ స్థానాలను ఇచ్చిన నేపథ్యంలో వాటిలో ఆ పార్టీని గెలిపించుకోవడం ద్వారా కూటమిగా ఐక్యంగా ఉన్నామన్న సంకేతాలను బలంగా పంపించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక చూస్తూ ఊరుకుంటే కుదరదని క్షేత్రస్థాయిలో ఏర్పడిన సమస్యలను తానే స్వయంగా పరిష్కరించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు మంత్రులు.. జిల్లాల ఇన్చార్జి మంత్రులు కూడా స్థానికంగా ఉన్న క్యాడర్ కు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈ సర్దుబాట్లు పెద్దగా ఫలించే అవకాశం కనిపించడం లేదని అంచనా వేస్తున్న నేపథ్యంలో కచ్చితంగా చంద్రబాబు రంగంలోకి దిగుతార‌ని అంటున్నారు.

Tags:    

Similar News