ఏపీ లోక‌ల్ వార్ ఇంకా ట్విస్టులు ఉన్నాయ్‌.. వీళ్ల‌కు బిగ్ టెస్ట్‌... !

అయితే ఈ ఘర్షణ‌లు ఇక్కడితో ఆగిపోయినట్టేనా ఇక అంతా ప్రశాంతంగా జరుగుతుందా అంటే దీనికి సమాధానం లేదు.

Update: 2026-10-18 10:30 GMT

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన శుక్రవారం నాడు రాయలసీమ జిల్లాల్లోని రాజంపేట పార్లమెంటు పరిధిలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా రాయచోటి, పుంగనూరు నియోజకవర్గాల్లో టిడిపి వైసిపి వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలు తారా స్థాయికి చేరాయి. కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేదన్న వాదన బలంగా వినిపించేలా చేసింది. దీనిపై పోలీసులు సీరియస్ గా స్పందించారు. తాజాగా 70 మందిపై కేసులు పెట్టారు. ఇంకా వందల మంది ఈ దాడుల్లో పాల్గొన్నారని భావిస్తూ.. వారి వివ‌రాల‌ను సేకరిస్తున్నారు.

అయితే ఈ ఘర్షణ‌లు ఇక్కడితో ఆగిపోయినట్టేనా ఇక అంతా ప్రశాంతంగా జరుగుతుందా అంటే దీనికి సమాధానం లేదు. ఎందుకంటే ఇంకా బలమైన, వివాదాస్పదమైన నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. వాటిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా ఉన్న ఆయా నియోజకవర్గాల్లో మరిన్ని ట్విస్టులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. వీటిలో ప్రధానంగా తాడిపత్రి, ఆళ్లగడ్డ, కర్నూలు, ఒంగోలు, చీరాల, బాపట్ల ఇట్లా అనేకమైన సమస్యాత్మక ప్రాంతాలు కనిపిస్తున్నాయి.

వీటిలో కూడా టిడిపి- వైసిపిల మధ్య చిరకాల‌ ఘర్షణలు చోటు చేసుకుంటాయ‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అలాగే మాచర్ల, గురజాల వంటి పల్నాడు ప్రాంతాల్లో సీట్లు కూడా హాట్ హాట్ గా ఉన్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని వైసిపి నాయకులను పోలీసులు హౌస్ అరెస్టులు చేయటం ఆంక్షలు విధించడం వంటివి ఉన్నప్పటికీ.. ఏ క్షణంలో ఏం జరుగుతుందని చెప్పడం కష్టంగా మారుతోంది. మరోవైపు టిడిపి నాయకులు కూడా ఏం జ‌రిగినా ఫ‌ర్వాలేదు.. అనే రీతిలో నామినేషన్ కేంద్రాలకు వెళ్లే పరిస్థితి నెలకొంది.

దీనికి ప్రధానంగా దీర్ఘకాలంగా ఉన్న విభేదాలు, రాజకీయంగా జరుగుతున్న పరిణామాలు వంటిపై కారణాలని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఒకప్పుడు పరిమితమైన సమస్యలు ఇప్పుడు దాదాపు సగానికి పైగా నియోజకవర్గాలకు పాకడం ఆయా ప్రాంతాల్లో తీవ్రస్థాయి ఘర్షణలు చోటు చేసుకోవడం వంటివి చర్చనీయాంశంగా ఉన్నాయి. ఇరుపక్షాల్లోనూ పట్టుదల, ఆగ్రహం, ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించాలన్న ధోర‌ణే కనిపిస్తోంది తప్ప ఎన్నికలను ప్రశాంతంగా ముందుకు తీసుకు వెళ్లాలన్న ఆలోచన కొర‌వ‌డింది అన్నది వాస్తవం.

దీనిని పరిష్కరించేందుకు ఇరుపక్షాలు సమన్వయం చేసుకొని సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి. ముఖ్యంగా పులివెందుల, కుప్పం వంటి నియోజకవర్గాల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉండే అవకాశం ఉందని పోలీసులు ముందుగానే భావిస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఎన్నిక‌ల‌ ప్రక్రియను సవాల్‌గా తీసుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. ప్రస్తుతం అయితే సమస్యాత్మక ప్రాంతాలు పెరుగుతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏ మేరకు ఫలిస్తాయి అన్నది ఆందోళన గానే ఉంది.

Tags:    

Similar News