విజయవాడలో హైడ్రామా.. తగ్గేదేలే అంటున్న తమ్ముళ్లు.. పోటీకి సై అంటోన్న బీజేపీ
చర్చలు కొలిక్కి వచ్చినా మిత్రపక్షాలు చేస్తున్న ప్రకటనలతో టీడీపీ నేతలు, అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు.
విజయవాడ నగరంలో పొత్తు రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. కూటమిలోని మూడు పార్టీలు సీట్ల సర్దుబాటులో బెట్టు చేస్తున్నాయి. శనివారం అర్థరాత్రికి ఒక అవగాహనకు వచ్చినట్లు చెబుతున్నా, బీజేపీ వైఖరితో రాజకీయం హాట్ హాట్ గానే కొనసాగుతోంది. ఇదే సమయంలో తన నియోజకవర్గంలో ఎక్కువ డివిజన్లు జనసేనకు కేటాయించడాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా వ్యతిరేకిస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయంలో ఎంపీ కేశినేని చిన్నపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారని జరుగుతున్న ప్రచారం వాతావరణాన్ని వేడెక్కించింది. దీంతో నామినేషన్ల ఉపసంహకరణ వరకు సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
విజయనగరం కార్పొరేషన్ లో మేయరు సీటును జనసేనకు కేటాయించారు. ఇక నగరంలో 86 డివిజన్లను పార్టీల బలాబలాల మేరకు సర్దుబాటు చేసుకోవాలని భావించారు. అయితే తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో తమ పార్టీకే ఎక్కువ సీట్లు కావాలని ఎమ్మెల్యేలు కోరుతుండటంతో పొత్తు చర్చల్లో చిక్కుముడులు పడ్డాయని అంటున్నారు. నగరంలో మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా, తూర్పు, సెంట్రల్ ఎమ్మెల్యేలు టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పశ్చిమ ఎమ్మెల్యే బీజేపీ. దీంతో తమ పరిధిలో తమ వారే కార్పొరేటర్లుగా పోటీ చేస్తారని సెంట్రల్ ఎమ్మెల్యే ఉమా, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పట్టుబడుతున్నారని అంటున్నారు.
ఈ పరిస్థితుల్లో రెండు రోజులుగా పలుమార్లు సమావేశమైన సమన్వయ కమిటీ సభ్యులు శనివారం అర్థరాత్రికి ఒక నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే ఏ నిర్ణయం తీసుకున్నారనే విషయమై అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడంతో కార్యకర్తల్లో గందరగోళం కనిపిస్తోందని అంటున్నారు. అనధికార సమాచారం ప్రకారం మొత్తం 86 డివిజన్లలో టీడీపీకి 58, జనసేనకు 21, బీజేపీకి 7 కేటాయించినట్లుగా చెబుతున్నారు. అయితే పశ్చిమ నియోజకవర్గంలో 14 డివిజన్లు కావాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తుండటంతో సర్దుబాటుపై అనిశ్చితి నెలకుందని అంటున్నారు. ఎవరు ఏమనుకున్నా బీజేపీ తరఫున 14 సీట్లలో పోటీ చేస్తామని ఆ పార్టీ నేతలు చేసిన ప్రకటన హై డ్రామాకు తెరలేపిందని చెబుతున్నారు.
చర్చలు కొలిక్కి వచ్చినా మిత్రపక్షాలు చేస్తున్న ప్రకటనలతో టీడీపీ నేతలు, అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. ఓ పక్క నామినేషన్లకు చివరి రోజు కావడంతో తమ పరిస్థితి ఏంటి? అంటూ అభ్యర్థులు జుట్టు పీక్కుంటున్నారు. ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తూ తమ పరిస్థితి తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఒత్తిడికి గురవుతున్న ఎమ్మెల్యేలు పార్టీ అగ్రనాయకత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ తమ అనుచరులతో నామినేషన్లు వేయిస్తామని, తర్వాత చూసుకుందామని చెబుతూ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారని అంటున్నారు.
సొంతంగా బీజేపీ పోటీ
నగరంలోని 14 డివిజన్లలో పోటీ చేయాలని బీజేపీ నేతలు సొంతంగా నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం కూటమిలో చిచ్చు రేపుతోందని అంటున్నారు. బీజేపీకి 7 సీట్లు ఇవ్వడంపై ఆ పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి నెలకుందని అంటున్నారు. దీంతో కార్యకర్తలను చల్లార్చేందుకు తమకు బలం ఉన్న 14 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తొలి నుంచి తాము 14 స్థానాలు అడుగుతుంటే కూటమి నేతలు ముందుగా 9 స్థానాలు ఇస్తామని చెప్పి, చివరికి 7 స్థానాలతో సర్దుకోవాలని అనడంపై బీజేపీ క్యాడర్ రగిలిపోతోందని అంటున్నారు. దీంతో ఆదివారం 14 డివిజన్లలో ముందు నామినేషన్ వేసి తర్వాత చర్చిద్దామన్నట్లుగా బీజేపీ వైఖరి ఉందని అంటున్నారు. దీంతో విజయవాడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.