మెడికోల కార్ రేసింగ్.. భార్యభర్తలు బలి
రేస్ మధ్యలో రేసింగ్ లోని మొదటి కారు అదుపు తప్పి.. తమ ముందు వెళుతున్న టూవీలర్ ను ఢీ కొట్టింది.
ప్రాణం విలువ వైద్యులకు మించి మరెవరికి తెలుసు. వారంతా ప్రభుత్వ వైద్యకళాశాలలో మెడికోలు. చదువు పూర్తై వైద్యులుగా మారాల్సిన వారు.. వినోదం కోసం కార్ రేసింగ్ ఆరాచకానికి తెర తీసి.. భార్యభర్తల్ని బలి తీసుకున్న షాకింగ్ ఉదంతం తెలంగాణలో చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన వైద్య విద్యార్థులు రెండు థార్ కార్లలో వనపర్తి జిల్లా ఆత్మకూర్ నుంచి మహబూబ్ నగర్ వరకు కార్ రేసింగ్ పెట్టుకున్నారు.
రేస్ మధ్యలో రేసింగ్ లోని మొదటి కారు అదుపు తప్పి.. తమ ముందు వెళుతున్న టూవీలర్ ను ఢీ కొట్టింది. వారి వేగానికి.. టూవీలర్ మీద ప్రయాణిస్తున్న భార్యభర్తలు (షాకీర్, షహానా బేగం) ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు పోయాల్సిన వైద్య విద్యార్థులు బాధ్యతారాహిత్యంతో నిర్లక్ష్యంగా కార్లను నడిపి రెండు నిండు ప్రాణాలు బలి తీసుకున్న వైనం షాకింగ్ గా మారింది.ఇదే ప్రాంతంలో గతంలో బైక్ రేసింగ్ కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా కార్ రేసింగ్ కు ఇద్దరు బలయ్యారు.
భూత్పూర్ మండలానికి చెందిన భార్యభర్తలు ఇద్దరు శుక్రవారం రాత్రి టూవీలర్ మీద జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఒక ఫంక్షన్ కు బయలుదేరారు. అదే సమయంలో వైద్య విద్యార్థులు వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి మహబూబ్ నగర్ కు కార్ రేసింగ్ పెట్టుకున్నారు. రెండు మహీంద్రా థార వాహనాల్లో అత్యంత వేగంగా దూసుకొచ్చారు. అమిస్తాపూర్ వద్ద రోడ్డు రిపేర్ జరుగుతోంది. ఈ క్రమంలో ఒక కారు అదుపు తప్పి ముందు వెళుతున్న టూవీలర్ ను ఢీ కొట్టింది. ఈ వేగానికి టూవీలర్ మీద ఉన్న భార్యభర్తలు ఇద్దరు ఎగిరిపడ్డారు. తలకు తీవ్ర గాయం కావటంతో షహానా బేగం అక్కడికక్కడే మరణించగా.. భర్త షాకీర్ కాళ్ల మీద నుంచి ఒకటి తర్వాత మరొక కారు దూసుకెళ్లటంతో రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న అతను శనివారం మరణించాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిప్పుడు అనాథలుగా మారారు.
కారు నడుపుతున్న మూడో ఏడాది విద్యార్థి నితిన్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన రెండు కార్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కార్లలో ప్రయాణిస్తున్న మెడికోలను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఆర్నెల్ల క్రితం బైక్ రేసింగ్ లో కారును ఢీకొని నలుగురు మరణించారు. రేసింగ్ మోజులో ప్రాణాలు పోగొట్టుకోవటం.. ప్రాణాలు తీయటం ఎక్కువైందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.