'మోదీ వర్సెస్ యాంటీ మోదీ' వార్.. లండన్ వీధుల్లో భారత రాజకీయం.. అసలు కథేంటి?
ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన ప్రశ్న ఏమిటంటే ఒక రాజకీయ నాయకుడిని లేదా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం అంటే దేశాన్ని వ్యతిరేకించడమేనా అనేదే.
విదేశీ గడ్డపై భారత రాజకీయ పరిణామాలు మరోసారి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. లండన్ వీధుల్లో ఒకవైపు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరం వినిపిస్తుంటే.. మరోవైపు దేశ ప్రతిష్ఠను చాటేలా కౌంటర్ ర్యాలీలు హోరెత్తుతున్నాయి. అసలు ఈ రచ్చ వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలేంటి? ఇది ప్రజాస్వామ్య స్వేచ్ఛా ప్రకటనో లేక విదేశీ గడ్డపై పెరుగుతున్న రాజకీయ విభజన పరిణామమా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)కు వ్యతిరేకంగా కొన్ని విద్యార్థి సంఘాలు, ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ మద్దతుదారులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థల తీరుపై వారు పలు ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఈ నిరసనలకు ప్రతిస్పందనగా ‘టీమ్ భారత్’ పేరిట మరో ప్రవాస భారతీయుల బృందం రంగంలోకి దిగింది. చేతిలో త్రివర్ణ పతాకాలు పట్టుకుని ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో లండన్లోని భారత హైకమిషన్ కార్యాలయం ఎదుట భారీ ర్యాలీ నిర్వహించింది. విదేశాల్లో దేశ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నాలను తిప్పికొట్టడమే తమ ప్రధాన ఉద్దేశమని వారు స్పష్టం చేశారు. ఇక్కడ ఒకవర్గం ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును వినియోగించుకుంటుంటే.. మరొక వర్గం దేశ ప్రయోజనాలు, ప్రతిష్ఠకు మద్దతుగా తమ స్వరాన్ని వినిపిస్తోంది.
ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన ప్రశ్న ఏమిటంటే ఒక రాజకీయ నాయకుడిని లేదా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం అంటే దేశాన్ని వ్యతిరేకించడమేనా అనేదే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం.. ఎన్నికల వ్యవస్థపై సందేహాలను వ్యక్తం చేయడం.. అధికారుల పనితీరుపై విమర్శలు చేయడం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలో భాగమే. అదే సమయంలో విమర్శల పేరుతో దేశ ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని భావించే వారు తమ అభ్యంతరాలను వ్యక్తం చేయడం కూడా వారి హక్కే అవుతుంది. అందువల్ల భావోద్వేగాలతో ఒకరిపై ఒకరు ‘దేశభక్తులు’ లేదా ‘దేశ వ్యతిరేకులు’ అని ముద్రలు వేయడం కంటే.. ఆయా వర్గాలు లేవనెత్తిన అంశాల్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది ఆధారాలతో పరిశీలించడమే సరైన ప్రజాస్వామ్య దృక్పథం.
ఇక నిరసనల చుట్టూ అల్లుకున్న మరో వివాదం ఏమిటంటే మోదీ, సీఈసీలకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ పౌరులు కూడా పాల్గొన్నారని.. భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారనే ఆరోపణలు రావడం. అలాగే ఒక నిరసనలో కొందరు వ్యక్తులు చేసిన వివాదాస్పద చర్యలను మొత్తం విద్యార్థి లోకానికి లేదా ఒక దేశ ప్రజలందరికీ ఆపాదించడం కూడా సబబు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
డిజిటల్ మీడియా, సోషల్ మీడియా యుగంలో స్వదేశంలో జరిగే ప్రతి చిన్న రాజకీయ పరిణామం విదేశాల్లోని భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యే చిన్న చిన్న వీడియో క్లిప్పులు పూర్తి వాస్తవాన్ని చూపించకపోవచ్చు.. అక్కడ ఎవరి రాజకీయ భావజాలానికి అనుగుణంగా వారు కథనాలను ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. పైగా విదేశీ గడ్డపై జరిగే ఇలాంటి నిరసనలు అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించి.. భారత రాజకీయ వ్యవస్థపై అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తాయి. ధ్రువ్ రాఠీ వంటి డిజిటల్ క్రియేటర్ల ప్రచారం ఆధారంగా కాకుండా విశ్వసనీయ నివేదికలతో ఎన్నారైలు రియాక్ట్ అయితేనే ఇలాంటివి జరుగకుండా ఉంటాయి.
లండన్ వీధుల్లో చోటుచేసుకున్న ఈ పరిణామాలు భారత రాజకీయ ప్రభావం అంతర్జాతీయ స్థాయికి ఏ విధంగా పాకిందో స్పష్టం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని సమర్థించే హక్కు ఎంత ముఖ్యమో.. విమర్శించే స్వేచ్ఛ కూడా అంతే ముఖ్యం. ‘టీమ్ భారత్’ ర్యాలీ దేశానికి తమ మద్దతును తెలపగా.. వ్యతిరేక నిరసనకారులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ రెండింటిలో ఏది సరైనదో తేలాల్సింది రాజకీయ నినాదాలతో లేదా భావోద్వేగాలతో కాక వాస్తవాలు, ప్రామాణిక ఆధారాలు.. స్వేచ్ఛాయుతమైన ఆరోగ్యకరమైన చర్చల ద్వారానే.. విదేశాల్లో భారత పరువు ప్రతిష్టలకు సంబంధించిన ఈ విషయంలో భారతీయులు సంయమనం పాటిస్తే దేశ ప్రతిష్ట ఇనుమడిస్తుంది.