ఉద్యోగుల కోసం డేటింగ్ యాప్.. ప్రేమ పెళ్లిళ్ల బాధ్యత కూడా ప్రభుత్వానిదేనా?

2025లో సింగపూర్‌లో 30 వేల కంటే తక్కువ మంది పిల్లలు జన్మించినట్లు నివేదికలు వెల్లడించాయి. దీంతో భవిష్యత్తులో జనాభా పరిస్థితిపై అక్కడ ఆందోళనలు పెరుగుతున్నాయి.

Update: 2026-10-18 04:13 GMT

ప్రేమించడం వ్యక్తిగత విషయం.. జీవిత భాగస్వామిని వెతుక్కోవడం ఎవరి ఇష్టం వారిది. కానీ సింగపూర్‌లో మాత్రం ఈ విషయంలో ప్రభుత్వమే కాస్త చొరవ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దేశంలో జననాల రేటు తగ్గిపోతుండటంతో ప్రజలు తమకు సరైన భాగస్వామిని వెతుక్కునేందుకు ‘ఫస్ట్‌డేట్’ (FirstDate) పేరుతో ఓ డేటింగ్ యాప్‌ను పరీక్షిస్తున్నట్లు సమాచారం.

ఈ యాప్‌ను 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న ప్రభుత్వ ఉద్యోగుల కోసం రూపొందించినట్లు నివేదికలు చెబుతున్నాయి. పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి వారి అభిరుచులు, హాబీలు, జీవనశైలి ఆధారంగా సరైన జోడీని సూచించడం దీని ఉద్దేశం. సాధారణ డేటింగ్ యాప్‌ల మాదిరిగా ఒకేసారి చాలామందితో పరిచయం పెంచుకునే అవకాశం కాకుండా, ఒక్కోసారి ఒకరితో మాత్రమే కనెక్ట్ అయ్యే విధానం ఇందులో ఉన్నట్లు సమాచారం. వినియోగదారులు ప్రభుత్వ డిజిటల్ ఐడీ ద్వారా తమ గుర్తింపును కూడా ధ్రువీకరించుకోవాలి.

2025లో సింగపూర్‌లో 30 వేల కంటే తక్కువ మంది పిల్లలు జన్మించినట్లు నివేదికలు వెల్లడించాయి. దీంతో భవిష్యత్తులో జనాభా పరిస్థితిపై అక్కడ ఆందోళనలు పెరుగుతున్నాయి.

ఇక అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ప్రేమ కోసం యాప్‌లలో వెతుకులాట సాగించే రోజుల్లో, ఇప్పుడు ప్రభుత్వమే జోడీని వెతికే ప్రయత్నం చేస్తోందన్నమాట! అయితే ఇందులోనూ కొన్ని షరతులున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులే ఎందుకు? 35 ఏళ్లు దాటినవారికి ప్రేమించే అవకాశం లేదా? ప్రైవేట్ ఉద్యోగులు మాత్రం ఏం పాపం చేశారు? అంటూ ప్రశ్నలు రావడం సహజం.

ప్రస్తుతం ఈ కార్యక్రమం ప్రయోగాత్మక దశలో ఉన్నట్లు సమాచారం. ఇది ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి. చివరికి ఈ యాప్ ఎన్ని జంటలను కలుపుతుంది, జననాల రేటుపై ఎంత ప్రభావం చూపుతుంది అన్నది భవిష్యత్తే చెప్పాలి. ఏదేమైనా, ప్రేమకు కూడా ప్రభుత్వ ప్రణాళికలు అవసరమయ్యే పరిస్థితి వచ్చిందన్నమాట!

Tags:    

Similar News