నెల్లూరులో రూప్కుమార్కు లక్కు చిక్కేనా.. ?
ఈ నేపథ్యంలో టికెట్ దక్కించుకున్నంత ఈజీగా రూప్ కుమార్కు గెలుపు సాధ్యం అవుతుందా అనేది ప్రశ్న.
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఎవరు ఊహించని విధంగా టిడిపి అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల తర్వాత టిడిపిలోకి వచ్చిన రూపు కుమార్ కు మేయర్ స్థానం అప్పగించారు. నిజానికి ప్రస్తుతం మంత్రిగా ఉన్న నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి బలమైన నాయకులు చేసిన లాబీయింగ్ కూడా పక్కనపెట్టి చంద్రబాబు రూప్ కుమార్ కు అవకాశం కల్పించారు. ఇది ఒక రకంగా ఆయనకు లక్ అనే చెప్పాలి. అయితే, అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. అంతర్గతంగా రూప్ కుమార్ చుట్టూ విభేదాలు ముసురుతున్నాయి.
టీడీపీ కీలక నాయకులు ఆయన ఎంపికను తీవ్రంగా విభేదిస్తున్నారు. స్థానికంగా తీవ్ర ఆరోపణలు ఉన్న రూప్ కుమార్ కు టికెట్ ఇవ్వడం పట్ల సీనియర్ నాయకులు గుస్సాగా ఉన్నారు. ముఖ్యంగా మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం రూప్ కుమార్ ఎంపికపై మౌనంగా ఉండిపోయారు. పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం కావడంతో పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఇష్టం లేక వారు సైలెంట్ అయిపోయారు. కానీ, అంతర్గతంగా మాత్రం రూప్ కుమార్ ఎలా గెలుస్తాడో చూస్తామని ఒకరిద్దరు నాయకులు వ్యాఖ్యానించడం గమనార్హం.
ఈ నేపథ్యంలో టికెట్ దక్కించుకున్నంత ఈజీగా రూప్ కుమార్కు గెలుపు సాధ్యం అవుతుందా అనేది ప్రశ్న. ముఖ్యంగా వైసిపి హయంలో రూపు కుమార్ వ్యవహరించిన తీరు, ఆయినపై వచ్చిన ఆరోపణలు వంటివి ఇప్పటికీ లైవ్ లోనే ఉన్నాయి. వాటిపై గతంలో టిడిపి సీనియర్ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాంటిది ఇప్పుడు రూప్ కుమార్ కి అవకాశం ఇవ్వడం పై వారంతా ఆగ్రహంతో ఉన్నారు. అయితే పైకి మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు. ఇది ఎన్నికల ప్రచారంపైన, అదేవిధంగా గెలుపు పైన కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
మరీ ముఖ్యంగా టిడిపి క్యాడర్లో రూప్ కుమార్ పై పెద్దగా పాజిటివ్ చర్చ అయితే నడవడం లేదు. ఆయనను ఇప్పటికీ వైసీపీ నుంచి వచ్చిన నాయకుడిగానే చూస్తున్నారు. గతంలో స్థానికంగా పదవులు నిర్వహించి ఉన్నప్పటికీ బలమైన కేడర్ను ఆయన సంపాదించుకోలేకపోయారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు స్వయానా బంధువు కావడం, ఆయన అనుచరులే ఈయనకి కూడా పనిచేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కూటమి పార్టీలను ఐక్యంగా చేయటం వారిని తనవైపు తిప్పుకోవటం అనేది రూప్ కుమార్ కు అత్యంత సంక్లిష్టమైన అంశంగా మారింది.
నామినేషన్ వేయడం తేలికే కావచ్చు. కానీ, తీవ్రమైన పోటీలో గెలుపు గుర్రం ఎక్కడం అత్యంత ప్రధానమైన అంశం. దీనికి అన్ని వర్గాలు చేతులు కలపాల్సిన అవసరం ఉంది. కానీ, ప్రస్తుతం ఆయన పరిస్థితిని గమనిస్తే మంత్రి నారాయణ సహా సీనియర్ నాయకులు అందరూ సైలెంట్ అయిపోవడం రూప్ కుమార్ పట్ల పెద్దగా సానుకూల ధోరణి వ్యక్తం చేయకపోవడం వంటివి పెద్ద సమస్యగా మారుతున్నాయి. దీంతో రూప్ కుమార్ ఏ మేరకు విజయం దక్కించుకుంటారనేది చూడాలి.