23 నుంచి 27.. ఇక్కడి నుంచి 34 ఎలా?: చంద్రబాబు అంతర్మథనం!
2024 ఎన్నికల సమయంలో బీసీ సామాజిక వర్గాలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చంద్రబాబు ప్రచారంలో హామీ ఇచ్చారు.
ఏపీలో బీసీ సామాజిక వర్గాలకు గత 2024 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఒకవైపు.. ఇదే బీసీ రిజర్వేషన్ అంశంపై మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు మరోవైపు.. సీఎం చంద్రబాబును ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తున్నాయి. దీంతో ఆయన అంతర్మథనం చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం.. అంటూ కూటమి పార్టీల కీలక నాయకులతో శనివారం రాత్రి అంతర్గత సమావేశం ఏర్పాటు చేశారు. బీసీలకు హామీ ఇచ్చామని.. ఇప్పుడు ఏం చేయాలని ఆయన చర్చించారు. ఈ క్రమం లో భవిష్యత్తులో ఏం చేయాలన్న విషయంపై నిర్ణయం తీసుకునేందుకు కూటమి పార్టీలు ఐక్యంగా సహకరించాలన్నారు.
అసలు ఏంటి విషయం?
2024 ఎన్నికల సమయంలో బీసీ సామాజిక వర్గాలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చంద్రబాబు ప్రచారంలో హామీ ఇచ్చారు. కానీ, అప్పటికి, ఇప్పటికీ.. ఈ రిజర్వేషన్ 23.56 శాతంగా ఉంది. దీనిని 34 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందన్నది హామీని బట్టి ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్‌తో కమిటీని నియమించింది. దాదాపు 6 మాసాల అధ్యయనం, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి అభిప్రాయాలు సేకరించిన రంజన్‌కమిటీ.. తాజాగా నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం.. ఆయన ఏమన్నారంటే.. ఏపీ సమాజంలో 50.26 శాతం మేరకు బీసీలు ఉన్నారని తెలిపారు.
అయితే.. అలాగని వారికి ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 34 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు రా జ్యాంగ, న్యాయ పరిమితులు అంగీకరించబోవని స్పష్టం చేశారు. ఈ క్రమంలో బీసీలకు 27.66 శాతం మేరకు అమలు చేయవ చ్చని కీలక సూచనలు చేశారు. తద్వారా.. రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు గత తీర్పులను అనుసరించి రిజర్వేషన్లను 50 శాతానికి మించకుండా చూసేందుకు అవకాశం ఉంటుందని కూడా కమిటీ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే.. ఇదే చేస్తే.. గత ఎన్నికలలో ఇచ్చిన హామీ పరిస్థితి ఏంటన్నది ప్రధాన ప్రశ్న. పైగా బీసీ సామాజిక వర్గం 50 శాతాన్ని దాటేసిన క్రమంలో వారి ఓటు బ్యాంకు కీలకంగా మారింది.
తాజాగా ఈ వ్యవహారంపైనే శనివారం రాత్రి పొద్దు పోయే వరకు సీఎం చంద్రబాబు చర్చించారు. రాజీవ్ రంజన్ కమిటీ సిఫారసు లను అమలు చేస్తే.. దాదాపు 7 శాతం మేరకు కోటాను బీసీలు కోల్పోతారు.(గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు). ఒకవేళ 34 శాతం హామీని అమలు చేస్తే.. కోర్టుల నుంచి న్యాయపరమైన చిక్కులు తప్పవు. అందుకే.. మధ్యేమార్గంగా పార్టీల పరంగా బీసీలకు న్యాయం చేయాలని నిర్ణయించారు. పార్టీ టికెట్ల నుంచి నామినేటెడ్ పదవులవరకు బీసీలకు 34 శాతం పూర్తిస్థాయిలో కోటాను అమలు చేయడానికి ఇబ్బందులు ఉండబోవని పేర్కొన్నారు. అయితే.. ఇది ప్రతిపక్షాలకు ఆయుధంగా కూడా మార్చుకోకుండా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మొత్తంగా.. బీసీ రిజర్వేషన్.. 23 నుంచి 27.. ఇక్కడి నుంచి 34 కు పెంపు అనేది మాత్రం ఇప్పుడు కత్తిమీద సాముగా మారింది.