ప్రేమ కూడా రెంటేనా? చైనాలో వెర్రితలలు వేస్తున్న కొత్త సోషల్ మీడియా ట్రెండ్

ఒకప్పుడు అనుబంధాలు.. ఆప్యాయతలు గుండె లోతుల్లో నుంచి వచ్చేవి. మనసులోని భావాలను పంచుకోవడానికి.. ఒకరికొకరు తోడుగా నిలవడానికి ఒక వ్యక్తి జీవితంలోకి రావాలనుకునేవారు.

Update: 2026-10-02 16:28 GMT

ఒకప్పుడు అనుబంధాలు.. ఆప్యాయతలు గుండె లోతుల్లో నుంచి వచ్చేవి. మనసులోని భావాలను పంచుకోవడానికి.. ఒకరికొకరు తోడుగా నిలవడానికి ఒక వ్యక్తి జీవితంలోకి రావాలనుకునేవారు. కానీ ఈ డిజిటల్ యుగంలో అనుబంధాల స్వభావమే మారిపోతోంది. నిజమైన ప్రేమ, ప్రాణమైన బంధం కంటే సోషల్ మీడియాలో వచ్చే కొన్ని 'లైక్లు', 'కామెంట్లు' ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. దీనికి పరాకాష్టగా చైనాలో ఇప్పుడు ఒక కొత్త, వింతైన ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. కేవలం సోషల్ మీడియాలో తమ పోస్టులకు ఆకర్షణ పెంచుకోవడానికి.. డేటింగ్ చేస్తున్నట్టు ప్రపంచానికి చూపించుకోవడానికి అక్కడ యువతులు అందమైన మేల్ మోడళ్లను ‘అద్దెకు’ తెచ్చుకుంటున్నారు. గంటల చొప్పున భారీగా డబ్బులు చెల్లించి రొమాంటిక్ ఫొటోషూట్లు చేయించుకుంటున్నారు.

చైనాలోని ప్రముఖ వార్తా సంస్థ ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తెలిపిన కథనం ప్రకారం.. ఈ తరహా ఫొటోషూట్ల క్రేజ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. యువతులు అందమైన మేల్ మోడళ్లతో కలిసి పార్కులు, రెస్టారెంట్లు, పర్యాటక ప్రాంతాల్లో తిరుగుతూ ఫొటోలు దిగుతున్నారు. ఒకరినొకరు ప్రేమగా చూసుకోవడం, భుజంపై చేయి వేయడం, హగ్ చేసుకోవడం వంటి క్లోజ్ పోజులతో షూట్ చేస్తున్నారు. బయటకు చూసేవారికి ఇది నిజమైన జంటల డేటింగ్ ఫొటోలాగే అనిపిస్తుంది. ఈ ఒక్క ఫొటోషూట్ కోసం గంటకు సుమారు రూ.50,000 నుండి రూ.1,00,000 వరకు ఖర్చు చేస్తున్నారంటే ఈ మోజు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మోడల్ ప్రజాదరణ, ఫాలోయింగ్, అందాన్ని బట్టి ఈ ధరలు మరింత పెరుగుతున్నాయి.

ఈ ట్రెండ్ వెనుక ప్రధానంగా సోషల్ మీడియాలో తమ ఫాలోయింగ్ పెంచుకోవాలనే తాపత్రయం, అలాగే జీవితంలో ఎదుర్కొంటున్న ఒంటరితనం ముఖ్య కారణాలుగా కనిపిస్తున్నాయి. డిజిటల్ ప్రపంచంలో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎదగడానికి కంటెంట్ వైరల్ చేయడానికి ఈ రొమాంటిక్ ఇమేజ్ ఒక సాధనంగా మారింది. మరోవైపు నిజమైన బంధంలో పడేందుకు ఇష్టపడని లేదా ఆ సమయం లేని కొందరు.. కేవలం కొద్ది గంటల పాటు ప్రేమికులుగా నటిస్తూ ఆ అనుభూతిని పొందేందుకు ఈ సేవలను ఆశ్రయిస్తున్నారు. జీవితంలో ఒంటరిగా ఉన్నప్పటికీ ప్రపంచం ముందు మాత్రం తాము ఎంతో సంతోషంగా.. ఒక అందమైన భాగస్వామితో ఉన్నట్టు చూపించుకోవడానికి పడే తాపత్రయమే ఈ ‘రెంటల్ డేటింగ్’ ఫొటోషూట్లు.

ఈ వైరల్ సంస్కృతి కేవలం ఒక తాత్కాలిక ఫ్యాషన్ మాత్రమే కాదు.. నేటి సమాజంలో పెరుగుతున్న తీవ్రమైన ఒంటరితనానికి.. సోషల్ మీడియా తెచ్చిపెట్టిన ఆభాసకరమైన జీవితాలకు నిదర్శనం. నిజమైన భావోద్వేగాలను పక్కనపెట్టి, వేలకు వేలు చెల్లించి ప్రేమను 'అద్దెకు' తీసుకోవడం మానసిక ఆరోగ్యానికి ఎంతవరకు మంచిదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లైక్‌ల కోసం కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తే ఇక నిజమైన అనుబంధాలకు విలువ ఏముంటుంది? సోషల్ మీడియా ప్రపంచంలో చూపించే రంగుల కలల వెనుక ఎంతటి నిశ్శబ్దం ఉందో ఈ ట్రెండ్ స్పష్టంగా చాటిచెబుతోంది. ఈ క్రేజ్ రాబోయే రోజుల్లో మరిన్ని దేశాలకు విస్తరిస్తుందో లేక నీటి బుడగలా కరిగిపోతుందో చూడాలి.

Tags:    

Similar News