అప్పులతో పాక్ బతుకు... ఆర్థిక సంక్షోభం ముప్పు !

అప్పు చేసి పప్పు కూడు అన్న సామెత దాయాది పాక్ కి అక్షరాలా సరిపోతొంది. ఎన్నో గొప్పలు బయటకు చెబుతూ ఆడంబరంగా వ్యవహరిస్తున్న పాక్ కోటు వెనక చిరుగుల బనియన్ ఉందని అంటున్నారు.

Update: 2026-10-02 23:30 GMT

అప్పు చేసి పప్పు కూడు అన్న సామెత దాయాది పాక్ కి అక్షరాలా సరిపోతొంది. ఎన్నో గొప్పలు బయటకు చెబుతూ ఆడంబరంగా వ్యవహరిస్తున్న పాక్ కోటు వెనక చిరుగుల బనియన్ ఉందని అంటున్నారు. అప్పు చేస్తేనే కానీ దేశం బండి చక్రం నడవడం లేదని చెబుతున్నారు. ఇలా అప్పులతోనే ఎంత కాలం పాక్ బతుకుతుంది అన్నదే ప్రశ్న. ఇలాగే కొనసాగితే ఏదో నాటికి పాక్ ఆర్ధిక వ్యవస్థ కుప్ప కూలి పెను సంక్షోభం తలెత్తే ప్రమాదం పొంచి ఉందని డాన్ అనే పత్రిక ప్రచురించిన కథనం బట్టి తెలుస్తోంది. పాక్ ఇప్పటికైనా జాగ్రత్త పడాలని అందులో సూచించారు. ప్రస్తుతానికి అయితే పాక్ దేశం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది అని కధనం ప్రకారం వెల్లడి అయింది.

విదేశీ రుణాలతోనే :

పాక్ విదేశీ రుణాలతోనే పొద్దు గడుపుకుంటోంది. అలాగే డిపాజిట్ల మీదనే ఆధారపడి రోజులు వెళ్లదీస్తోంది. పాక్ కి ఈ అప్పులు ఎలా పుడుతున్నాయంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి అని అంటున్నారు. అలాగే మిత్ర దేశాలుగా ఉన్న సౌదీ అరేబియా చైనాలు ఇచ్చే డిపాజిట్లతో పాక్ పప్పు కూడు వండుకుంటోంది అని చెబుతున్నారు. అయితే ఇలా ఎంత కాలం అన్న ప్రశ్నలనే డాన్ పత్రికా కధనం కీలకమైన ప్రశ్నగా ఎత్తి చూపుతోంది. ఆర్థిక స్థిరత్వం పాక్ కి ఎపుడూ సరిగ్గా లేకపోవడం ఒక శాపంగా కూడా అంతర్జాతీయ ఆర్ధిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. పాక్ ఎంతసేపూ రాజకీయ భౌగోళిక అంశాల మీదనే ఫోకస్ పెడుతోంది తప్ప తమ దేశం ఆర్థికంగా ఎలా బలోపేతం కావాలి అన్నది ఆలోచించడం లేదని అంటున్నారు.

ఎగుమతులు ఎక్కడ :

ఏ దేశం అయినా ఆర్థికంగా బలంగా ఉండాలీ అంటే ఎగుమతులు అతి ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు. పాక్ విషయమే తీసుకుంటే దిగుమతులే తప్ప ఎగుమతులు అన్నదే లేదు, ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నా కూడా చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ కూడా ఎగుమతులను పెంచడంలో విఫలం అయింది అని గుర్తు చేస్తున్నారు. దిగుమతులు ఎక్కువగా ఉంటే విదేశీ మారక ద్రవ్య నిధులు పూర్తిగా కరిగిపోతాయి. అది కనుక జరిగితే కోలుకోలేని దెబ్బ పాక్ కి పడుతుందని అంటున్నారు. ఇప్పటికి రెండు దశాబ్దాల క్రితం చూస్తే ఆనాటి అంతర్జాతీయ పరిణామాలు పాక్ కి ఎంతో మేలు చేశాయి. అలా 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఉగ్రవాదంపై యుద్ధం ప్రారంభించింది. అప్పట్లో పాక్ కి అధ్యక్షుడిగా జనరల్ పర్వేజ్ ముషారఫ్ బాధ్యతలు చేపట్టారు. ఆయన అమెరికాతో స్నేహం నెరిపడంతో పాకిస్థాన్‌కు భారీగా విదేశీ నిధులు వచ్చాయి. అలాగే రుణమాఫీతో పాటు పెట్టుబడులు పెద్ద ఎత్తున లభించాయి.

పటిష్టంగా ఉన్నపుడు :

అలా పాకిస్థాన్ ఆర్ధికంగా పటిష్టంగా ఉన్న సమయంలో దేశీయ ఎగుమతి రంగం మీద పాలకులు ఫోకస్ పెట్టలేకపోయారు అని అంటున్నారు. దాంతో అలా వచ్చిన నిధులు దిగుమతులకు వినియోగానికి రియల్ ఎస్టేట్ సహా ఇతర రంగాలకు వెళ్ళిపోయాయి. ఈ క్రమంలో 2008 నాటికి పాక్ భారీ లోటుతో అల్లల్లాడింది. ఆర్థికంగా తీవ్ర సంక్షోభం అప్పట్లోనే ఎదుర్కొంది. ఆ సమయంలో పాక్ చైనా ఎకనామిక్ కారిడార్ పాకిస్తాన్ లోని విద్యుత్ కొరతను తీర్చడానికి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి బాగానే ఉపయోగపడింది. అదే సమయంలో విదేశీ రుణాలు ఎలా తగ్గించుకోవాలో పాక్ సరిగ్గా ప్లాన్ చేయలేకపోయింది. ఈ విధంగా దిగుమతులు పెరిగి 2018లో మళ్లీ ఆర్ధిక సంక్షోభంలోకి పాక్ వెళ్ళింది.

కొట్టుమిట్టాడుతూనే :

ఇక 2019లో వచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక చక్రాన్ని స్థంభింపచేసింది. పాక్ లో అయితే మరింత సంక్షోభం ముదిరింది. దాంతో పాక్ పూర్తిగా ఆర్థిక ఇబ్బందులోకి నెట్టబడింది. పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో పాక్ ఇంకా కునారిల్లుతోంది. దీంతో పాక్ ఆర్ధిక వ్వవస్థను చక్క దిద్దుకోవాలని డాగ్ పత్రిక నివేదిక సూచిస్తోంది. ఎగుమతుల విషయంలో ఫోకస్ పెట్టాలని పేర్కొంటోంది. లేకపోతే ఒక్కసారిగా కుప్ప కూలడం ఖాయమని అంటోంది. మరి పాక్ ఇప్పటికైనా తన దేశం గురించి సీరియస్ గా ఆలోచించి యాంక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News