అలక వీడిన పవన్?! వరుస కార్యక్రమాలతో ఆ ప్రచారానికి చెక్

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అలక వీడినట్లేనా? కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షాల మధ్య చిన్నపాటి సమస్యలు కూడా సమసిపోయాయా? అంటే ఔను అన్న సమాధానమే వినిపిస్తోంది.

Update: 2026-10-02 14:58 GMT

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అలక వీడినట్లేనా? కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షాల మధ్య చిన్నపాటి సమస్యలు కూడా సమసిపోయాయా? అంటే ఔను అన్న సమాధానమే వినిపిస్తోంది. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలిసి ఒకే వేదిక పంచుకుంటున్న దృశ్యాలు కూటమిలో ఆల్ రైట్ అన్నట్లు రాజకీయాలు ఉన్నాయనే దానికి నిదర్శనంగా చెబుతున్నారు. ప్రధానంగా కొద్దిరోజులుగా ప్రభుత్వ పెద్దల తీరుపట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కాస్త గుర్రుగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఇటీవల నిర్వహిస్తున్న వరుస కార్యక్రమాలతో డిప్యూటీ సీఎం చెక్ చెప్పారని అంటున్నారు.

కూటమిలో కీలక మిత్రపక్షమైన జనసేన వైఖరిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా కూటమిలో ముఖ్య నేతల మధ్య చక్కని సమన్వయం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ఈ విషయంలో జనసేన ఎమ్మెల్యేల నుంచి సీనియర్ నేతలు కూడా బహిరంగంగానే తమ అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట టీడీపీ నేతలకు గౌరవం ఇస్తున్నామని, కానీ టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట జనసేన కేడర్ కు సరైన గౌరవం ఇవ్వడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ విషయమై అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు. మరోవైపు స్థానిక ఎన్నికల్లో జనసేన 15 శాతం సీట్లలో పోటీ చేస్తుందని మంత్రి లోకేశ్ ప్రకటించినట్లు జరిగిన ప్రచారం కూడా జనసేనానిని ఇబ్బంది పెట్టిందని అంటున్నారు. మరోవైపు ప్రభుత్వంలో మంత్రి లోకేశ్ హవా పెరిగిపోవడం కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కు ఫిర్యాదులు ఉన్నట్లుగా ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో వరుసగా నాలుగైదు కేబినెట్ సమావేశాలకు పవన్ గైర్హాజరు కావడంతోపాటు ముఖ్యమైన కార్యక్రమాలలో పవన్ కనిపించకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇక కూటమిలో ఏదో జరుగుతుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ ఆరోగ్య కారణాలతో కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ ప్రచారం మరింత ఎక్కువైందని చెబుతున్నారు. ఇక రాజకీయ కారణాలతో ప్రభుత్వంలో ఏదో జరుగుతుందన్న ప్రచారానికి ప్రత్యర్థులు మరింత మసాలా దట్టించి సోషల్ మీడియాలో విస్తృత చర్చకు తెరలేపారని అంటున్నారు. దీంతో స్థానిక ఎన్నికల్లో జనసేన తగ్గేదేలే అన్నట్లు పోటీ చేస్తుందని, అవసరమైతే టీడీపీపైనా పోటీ ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించాల్సివచ్చిందని అంటున్నారు.

అయినప్పటికీ కూటమిలో సమన్వయంపై రకరకాల చర్చ జరుగుతుండటంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. తన ఆరోగ్య కారణాలతో విశ్రాంతి తీసుకున్న సమయంలో చెలరేగిన ఊహాగానాలకు తెరదించాలంటే, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చాటేలా కార్యక్రమాలు రూపొంది, అందులో తాను చురుగ్గా పాల్గొనేలా పవన్ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దీంతోనే ఇటీవల కాలంలో పల్లెపండుగ 3.0 కార్యక్రమంతోపాటు ఈ రోజు మదనపల్లెలో రాయలసీమ హర్టీకల్చర్ ప్రారంభోత్సవానికి పవన్ స్వయంగా హాజరయ్యారని అంటున్నారు.

అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సొంత ఇలాఖా పులివెందులలో ఈ నెలలో జరిగే జలజీవన్ మిషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో కలిసి డిప్యూటీ సీఎం హాజరు అవుతున్నట్లు చెబుతున్నారు. గత పది రోజుల్లో మూడు కార్యక్రమాలలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన జనసేనాని పవన్ తాను అలక వహించానని జరుగుతున్న ప్రచారం తప్పు అన్న సంకేతాలు పంపారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తాను పూర్తిగా సంతృప్తితో ఉన్నట్లుగా ఇటీవల ఆయన వ్యవహరిస్తున్న తీరు స్పష్టం చేస్తోందని అంటున్నారు.

Tags:    

Similar News