కాంగ్రెస్ లోకి మమత రీ ఎంట్రీ ?
ఈ రోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభావం లేదు. దానికి కారణం ఎంతో మంది బలమైన నాయకులు కాంగ్రెస్ ని వీడి బయటకు వెళ్లిపోయారు.
ఈ రోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభావం లేదు. దానికి కారణం ఎంతో మంది బలమైన నాయకులు కాంగ్రెస్ ని వీడి బయటకు వెళ్లిపోయారు. అలా వెళ్ళిన వారు సొంతంగా ప్రాంతీయ పార్టీలు పెట్టారు, అధికారంలోకి వచ్చారు. తమ రాజకీయాలు తాము సొంతంగా చేసుకుంటూ వెళ్లారు. ఈ ప్రస్థానంలో కాంగ్రెస్ తో కొన్నాళ్ళు విభేదించారు, మళ్ళీ కలిశారు, ప్రస్తుతం మిత్రులుగా కొందరు ఉంటే మరి కొందరు తటస్థులుగా ఉంటున్నారు. అయితే దేశంలో కాంగ్రెస్ తిరిగి తన పూర్వ వైభవం సాధించి కనీసం రెండు వందలకు పైగా ఎంపీలు సాధించే అతి పెద్ద పార్టీగా నిలవాలి అంటే కాంగ్రెస్ ని వీడిన వారు అంతా తిరిగి పార్టీలోకి వచ్చి చేరాలని అంటున్నారు. ఇది కాంగ్రెస్ మేధో మధనంలో కూడా చర్చకు వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంతో మంది వివిధ సందర్భాలలో మాజీ కాంగ్రెస్ నేతలకు పిలుపు ఇస్తున్నారు.
ఆ ముగ్గురి మీదనే :
దేశంలో ఈ రోజు మూడు పార్టీలు ఉన్నాయి. ఒకటి తృణమూల్ కాంగ్రెస్. రెండవది శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్. మూడవది వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్. చిత్రమేంటి అంటే ఈ మూడు పార్టీల పేర్లలోనూ కాంగ్రెస్ ఉంది. అందుకే ఈ పార్టీలను తిరిగి కాంగ్రెస్ గూటికి రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఇక మమత విషయం తీసుకుంటే 1998లో ఆమె కాంగ్రెస్ ని వీడారు. ఆమె 1984లో తొలిసారి కాంగ్రెస్ నుంచే ఎంపీ అయ్యారు. ఆ తరువాత కూడా ఎంపీగా అదే పార్టీ తరఫున పనిచేశారు.
ఇబ్బందుల్లో మమత :
అయితే పశ్చిమ బెంగాల్ లోని వామపక్ష ప్రభుత్వం మీద కాంగ్రెస్ గట్టిగా పోరాటం చేయడం లేదని భావించి ఆమె సొంత పార్టీ పెట్టుకున్నారు. దాదాపుగా మూడు దశాబ్దాలుగా తృణమూల్ కాంగ్రెస్ ని విజయవంతంగా నడిపారు. పదిహేనేళ్ల పాటు బెంగాల్ సీఎం గా ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో మాత్రం ఆమె భారీ ఓటమి చవి చూశారు. ఇపుడు పార్టీ కూడా భారీ చీలికతో ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ తో మరింత సఖ్యతను ఆమె చూపిస్తున్నారు. దాంతో ఆమె బయట ఎందుకు కాంగ్రెస్ లోనే చేరిపోవాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు అంతా సూచిస్తున్నారు.
హస్తం బాట పట్టాలని :
ఇదిలా ఉంటే మమతా బెనర్జీ హస్తం పార్టీ బాట పట్టాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి బహిరంగంగానే కోరారు. ఆమె తమకు ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలతో కలిసి కంగ్రెస్ లో చేరడమే సరైన నిర్ణయం అని ఆయన అంటున్నారు. అంతే కాదు ఆమె పార్టీలో చేరేముందు తనకు ఉన్న భారాన్ని విడిపించుకోవాలని సూచించడం విశేషం. ఆ భారం ఏమిటి అన్నది బయటకు చెప్పకపోయినా మమత మేనల్లుడు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషిస్తున్నారు.
ఆమె వస్తే కనుక :
ఇదిలా ఉంటే మమతా బెనర్జీ ఏడు పదుల వయసు దాటేసి ఉన్నారు. మరో అయిదేళ్ల పాటు బెంగాల్ లో అసెంబ్లీకి ఎన్నికలు లేవు. చూస్తే ఆమె పార్టీ రెండుగా చీలి ఇబ్బంది పడుతున్నారు. దాంతో పార్టీని నడపడం ఒక సవాల్ గా మారుతోంది. దాంతో మమతా బెనర్జీ తిరిగి కాంగ్రెస్ లో చేరితే జాతీయ స్థాయిలో అగ్ర నేతగా ఉంటారని అంటున్నారు. బెంగాల్ లో కాంగ్రెస్ బలపడుతుందని బీజేపీని అలా ఎదుర్కోవడం సులువు అవుతుందని భావిస్తున్నారు. మరి మమత కనుక సంచలన నిర్ణయం తీసుకుంటే అపుడు శరద్ పవార్ ఎన్సీపీ మీద అలాగే ఏపీలో జగన్ వైసీపీ మీద ఒత్తిడి పెరుగుతుందని అంటున్నారు. చూడాలి మరి మమత ఘర్ వాపసీ నినాదాన్ని వంటబట్టించుకుని కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఇస్తారా అన్నది.