హెచ్-1బీ వీసా వ్యవస్థను పూర్తిగా రద్దు.. బాంబుపేల్చిన జేడీ వాన్స్.. భారతీయుల్లో గుబులు

తమ జీవిత సమయాన్నంతా గ్రీన్ కార్డు నిరీక్షణలోనే వెచ్చిస్తున్న లక్షలాది మంది భారతీయ ఉద్యోగుల పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది.

Update: 2026-10-02 09:55 GMT

వేలాది మైళ్ల దూరం నుంచి కళ్లలో వందలాది కలలను నింపుకుని, రెక్కలొచ్చిన పక్షుల్లా అమెరికా గడ్డపై వాలుతారు మన భారతీయ యువకులు. పగలనక, రేయనక కష్టపడి ఐటీ నుంచి టెక్నాలజీ వరకు ప్రతీ రంగంలో తమ ముద్ర వేస్తూ.. "అమెరికన్ డ్రీమ్"ను నిజం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆ కలల సౌధాన్ని ఒక్కసారిగా ప్రకంపనలకు గురిచేసే సంచలన వ్యాఖ్యలు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నుంచి వచ్చాయి. హెచ్-1బీ వీసా వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు లక్షలాది భారతీయ కుటుంబాల్లో తీరని ఆందోళనను.. కంటిమీద కునుకు లేని భయాన్ని నింపాయి.

అసలేం జరిగింది? ఏమా వాన్స్ వ్యాఖ్యల అంతరార్థం?

అమెరికన్ కంపెనీలు తక్కువ వేతనాలకే విదేశీయులను తెచ్చుకుంటూ స్థానిక అమెరికన్ ఉద్యోగుల పొట్ట కొడుతున్నాయని వాన్స్ ఘాటుగా విమర్శించారు. ప్రస్తుతం ఉన్న హెచ్1బీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని దానిని సరిచేయడం కంటే పూర్తిగా తొలగించడమే శ్రేయస్కరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉపాధ్యక్షుడి స్థాయిలో ఉన్న ఒక అగ్రనేత ఇలా విదేశీ ఉద్యోగుల మనుగడనే ప్రశ్నించడం.. భవిష్యత్తుపై ఆధారపడిన భారతీయ నిపుణుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

కన్నీటి సాగరంలో భారతీయ కుటుంబాలు..

ప్రతి ఏడాది జారీ అయ్యే హెచ్1బీ వీసాల్లో సింహభాగం పొందేది మన భారతీయులే. తమ జీవిత సమయాన్నంతా గ్రీన్ కార్డు నిరీక్షణలోనే వెచ్చిస్తున్న లక్షలాది మంది భారతీయ ఉద్యోగుల పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. పిల్లల చదువులు, స్థిరాస్తి రుణాలు, కుటుంబ భవిష్యత్తును అమెరికాలోనే ఊహించుకున్న దంపతులకు ఇది తీరని దిగ్భ్రాంతి. రూ. లక్షల విద్యా రుణాలు చేసి.. అమెరికాలో అడుగుపెట్టిన విద్యార్థులు, ఫ్రెషర్ల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది.

వెంటనే రద్దు కాకపోయినా.. తీరని మానసిక వేదన

చట్టపరంగా చూస్తే.. ఉపాధ్యక్షుడు వ్యాఖ్యానించినంత మాత్రాన వీసా వ్యవస్థ రాత్రికి రాత్రే రద్దయిపోదు. దానికి సెనేట్, కాంగ్రెస్ ఆమోదం, చట్ట సవరణలు అవసరం. కానీ అమెరికా పాలక వర్గాల ఆలోచనా విధానం ఇలా ఉందనే సంకేతం రావడం ఐటీ రంగానికి అతిపెద్ద దెబ్బ. వీసా నిబంధనలు కఠినతరం కావడం.. ఉద్యోగ భద్రత లోపించడం.. సోషల్ మీడియా వెట్టింగ్ వంటి పరిణామాలతో ఇప్పటికే నిత్యం భయంతో బతుకుతున్న భారతీయులకు ఈ వ్యాఖ్యలు మరింత మానసిక వేదనను మిగిల్చాయి.

అమెరికా అభివృద్దిలో వెన్నెముకలా నిలిచిన భారతీయ మేధస్సుకు దక్కే గౌరవం ఇదేనా అన్న వేదన సర్వత్రా వ్యక్తమవుతోంది. మరి రాబోయే రోజుల్లో ఈ విధానపరమైన హెచ్చరికలు ఎలాంటి రూపం దాల్చుతాయో.. ఎంతమంది ఆశలను అడియాసలు చేస్తాయోనని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు దిగులుతో ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News