ఆంధ్రప్రదేశ్ బిడ్డని అంటున్న అంబానీ కుమారుడు : హర్టీకల్చర్ హబ్ ప్రారంభోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా అనంత్ అంబానీ
రాయలసీమలో గ్లోబల్ హర్టీ కల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరగా, రిలయన్స్ సముఖత వ్యక్తం చేసింది.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేసిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA) శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యఅతిథిగా హాజరైన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తోపాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన ప్రముఖ పారిశ్రామిక వేత్త అనంత్ అంబానీ ప్రసంగించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమానికి ముందు సీఎం, డిప్యూటీ సీఎంతోపాటు మంత్రి లోకేశ్, ఇతర అధికారులతో అనంత్ అంబానీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంత్ అంబానీని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆలింగనం చేసుకుని ఐఎస్ఏ ఏర్పాటుకు ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
రాయలసీమలో గ్లోబల్ హర్టీ కల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరగా, రిలయన్స్ సముఖత వ్యక్తం చేసింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో పంటలను లాభసాటిగా చేసేందుకు రైతులకు అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చేందుకు ఐఎస్ఏ పనిచేయనుందని చెబుతున్నారు. ఇక ఐఎస్ఏ శంకుస్థాపన నిమిత్తం మదనపల్లె వచ్చిన అనంత్ అంబానీకి అపూర్వ స్వాగతం పలికారు. ఇది చూసి పులకించిపోయిన అనంత్ అంబానీ సభా వేదికపై ఆనందం వ్యక్తం చేశారు. ఇక నుంచి తనను ఆంధ్రప్రదేశ్ బిడ్డగా భావించాలని, రాష్ట్రానికి తాను ఏవిధంగా సేవ చేయగలనో సీఎం చంద్రబాబు తనకు మార్గదర్శనం చేయాలని కోరారు.
రాయలసీమలో ఏర్పాటు చేస్తున్న హార్టికల్చర్ హబ్ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని అనంత్ అంబానీ వ్యాఖ్యానించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) తరహాలోనే 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్' కూడా అద్భుతంగా ఎదుగుతుందని, దీని ద్వారా అన్నదాతలను తమ కమతాలకే సీఈఓలుగా మారుస్తామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కలలుగన్న 'వికసిత్ భారత్' స్వప్నాన్ని దేశ యువత అంతా కలిసి సాకారం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మదనపల్లె ప్రాంతానికే ప్రత్యేక చరిత్రాత్మక ప్రాధాన్యత ఉందని గుర్తుచేస్తూ.. ఇక్కడే గురుదేవ్ రబీంద్రనాథ్ టాగూర్ జాతీయ గీతాన్ని బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి అనువదించారని చెప్పారు.
గాంధీజీ సర్వోదయ, అంత్యోదయ స్ఫూర్తితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి, అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రధాని నరేంద్ర మోదీల నినాదాల కలయికతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ పనిచేస్తుందని అనంత్ అంబానీ వివరించారు. టెక్నాలజీ సాయంతో రైతుల ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఈ మిషన్‌ను చేపట్టారన్నారు. ఏఐ, డ్రోన్లు, రోబోటిక్స్ వంటి అధునాతన సాంకేతికతతో పంటలకు చీడపీడలు సోలకుండా ప్రెసిషన్ ఫార్మింగ్ విధానాన్ని అమలు చేయడానికి ఐఎస్‌ఏ పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. మదనపల్లె టమాటో రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడ, ఎప్పుడు విక్రయించాలో సరైన మార్గదర్శకత్వం చేస్తామన్నారు.
రిలయన్స్ సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని అన్నదాతలను 'ఉర్జా దాతలు'గా మారుస్తామని అనంత్ అంబానీ వెల్లడించారు. రిలయన్స్ గ్రీన్ బిజినెస్ కింద సీబీజీ ప్లాంట్ల ఏర్పాటు కోసం రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. దేశ్ సేవా - కిసాన్ సేవా నినాదంతో ముందుకు వెళ్తున్నామని, జామ్‌నగర్‌లో బయో ఎనర్జీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. 'జియో కృషి' యాప్ ద్వారా రైతుల ఇంటి ముంగిటకే అన్ని రకాల సేవలు అందిస్తామన్నారు. పశు సేవా హి ప్రభు సేవా అని నమ్మే వ్యక్తినని పేర్కొంటూ.. హైటెక్ యానిమల్ హస్బెండ్రీ ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పశు సంపదను పెంచుతామని, వంతారా ద్వారా మూగజీవాలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానం వల్ల భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ప్రశంసించారు. ఏపీకి సుమారు రూ. 14 లక్షల కోట్ల మెగా ఇన్వెస్ట్‌మెంట్లు వచ్చి, 11 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించడం రాష్ట్ర ఆర్థిక పురోగతికి నిదర్శనమన్నారు. గ్రామీణ వాణిజ్యం, సుస్థిర గ్రామాల అభివృద్ధికి నేడు పటిష్టమైన పునాది పడిందని, ఈ బృహత్ కార్యంలో రిలయన్స్ తన వంతు సహకారాన్ని నిరంతరం అందిస్తుందని అనంత్ అంబానీ తమ ప్రసంగాన్ని ముగించారు.