ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైట్ వరల్డ్ కప్ షెడ్యూల్ నే మార్చేసిన ఐసీసీ.. ఈసారి టఫ్ ఫైట్

ఈ ప్రపంచకప్‌లో అత్యంత ఆసక్తికరమైన, కఠినమైన మార్పు 'సూపర్ 7' దశ. లీగ్ దశలో జట్లు సాధించిన పాయింట్లు సూపర్ 7 రౌండ్‌కు క్యారీ ఫార్వర్డ్ కావు.

Update: 2026-10-02 09:01 GMT

ప్రపంచ క్రికెట్‌లో వన్డే వరల్డ్ కప్ సమరానికి ఉండే క్రేజే వేరు. అయితే 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఉమ్మడి ఆతిథ్యంలో జరగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీ క్రికెట్ అభిమానులకు సరికొత్త అనుభూతిని ఇవ్వడమే కాకుండా ఆటగాళ్లకు తీరని శారీరక, మానసిక సవాలుగా మారనుంది. ఈ సారి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రవేశపెడుతున్న కొత్త ఫార్మాట్ మ్యాచ్‌ల భారాన్ని గణనీయంగా పెంచేసింది.

14 జట్లు, 57 మ్యాచ్‌ల సుదీర్ఘ పోరులో ఏకంగా కప్పు ముద్దాడాలంటే ఏ జట్టైనా విశ్వప్రయత్నం చేయక తప్పదు. ముఖ్యంగా టీమిండియా ఫైనల్ చేరి టైటిల్ సాధించాలంటే మొత్తం 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. 2023 ప్రపంచకప్‌లో ఫైనల్ వరకు భారత్ 11 మ్యాచ్‌లు మాత్రమే ఆడగా.. ఈసారి మరో రెండు అదనపు పోరాటాలు చేయాల్సి రావడం ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఆరంభంలోనే అసలైన సిసలైన పోరు

టోర్నీ అక్టోబర్ 2న ప్రారంభం కానుండగా గ్రూప్-ఏలో ఉన్న భారత్ అక్టోబర్ 7న కేప్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో తన తొలి మ్యాచ్ ఆడనుంది. సరిగ్గా మూడు రోజుల వ్యవధిలోనే అంటే అక్టోబర్ 10న జోహన్నెస్‌బర్గ్‌లో సాంప్రదాయ ప్రత్యర్థి పాకిస్థాన్‌తో హై-వోల్టేజ్ పోరులో తలపడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 14న ఆఫ్ఘనిస్థాన్, అక్టోబర్ 17న క్వాలిఫయర్ జట్టు, అక్టోబర్ 24న జింబాబ్వేతో మ్యాచ్‌లు ఆడనుంది. అంటే గ్రూప్ దశ దాటడానికే భారత్ 5 కీలక మ్యాచ్‌లు పూర్తి చేయాలి.

‘సూపర్ 7’ .. ఇక్కడే ఐసీసీ అసలు మాస్టర్ ప్లాన్

ఈ ప్రపంచకప్‌లో అత్యంత ఆసక్తికరమైన, కఠినమైన మార్పు 'సూపర్ 7' దశ. లీగ్ దశలో జట్లు సాధించిన పాయింట్లు సూపర్ 7 రౌండ్‌కు క్యారీ ఫార్వర్డ్ కావు. అంటే ఇక్కడ ప్రతి జట్టు మళ్లీ 'జీరో' పాయింట్ల నుంచే తమ ప్రయాణాన్ని ప్రారంభించాలి. ఈ దశకు అర్హత సాధించిన 7 జట్లు పరస్పరం ఒక్కో మ్యాచ్ ఆడతాయి. అంటే ఇక్కడ టీమిండియా మరో 6 మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుంది. పాత పాయింట్ల ప్రభావం ఉండదు కాబట్టి గ్రూప్ దశలో అద్భుత ప్రదర్శన చేసినా సూపర్ 7లో ఒక్క తప్పటడుగు వేసినా టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది.

ఫైనల్ దాకా భారత్ ప్రయాణం ఇలా..

గ్రూప్ దశలో 5 మ్యాచ్‌లు.. సూపర్ 7 దశలో 6 మ్యాచ్‌లు.. సెమీఫైనల్ & ఫైనల్ లో 2 మ్యాచ్‌లు.. మొత్తం 13 మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుంది. సూపర్ 7లో టాప్-4లో నిలిచిన జట్లు నవంబర్ 17, 18 తేదీల్లో జరిగే సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. విజేతలు నవంబర్ 21న జోహన్నెస్‌బర్గ్‌లో జరిగే గ్రాండ్ ఫైనల్‌లో తలపడతాయి.

ఈ కొత్త ఫార్మాట్ నేపథ్యంలో కేవలం ఒకరిద్దరు స్టార్ ప్లేయర్లపై ఆధారపడితే టైటిల్ గెలవడం అసాధ్యం. అక్టోబర్ 7 నుంచి నవంబర్ 21 వరకు దాదాపు ఒకటిన్నర నెలల పాటు జరిగే ఈ సుదీర్ఘ మెగా టోర్నీలో నిలదొక్కుకోవాలంటే భారత జట్టుకు మెరుగైన బెంచ్ స్ట్రెంగ్త్, బౌలింగ్ డెప్త్, అన్నింటికంటే మించి ఆటగాళ్ల ఫిట్‌నెస్ నిర్వహణ అత్యంత కీలకం కానున్నాయి.

Tags:    

Similar News