నయా వీరుడి కథ.. కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ బ్యాక్ గ్రౌండ్ ఇదే
అయితే.. కొడుకు ఆసక్తిని తండ్రి సమర్థించారు. దీంతో అతడి పైలట్ కోరిక తీరింది. తాను కోరుకున్న కోర్సును చేయటం కోసం న్యూజిలాండ్ లోని మొయిన్ ల్యాండ్ ఎయిర్ ఏవియేషన్ కాలేజీలో చేరాడు.
సాఫీగా సాగినంత సేపు విమాన ప్రయాణానికి మించింది మరొకటి లేదు. ఏ మాత్రం లెక్క తేడా వచ్చినా పీడకలగా మారటమే కాదు.. ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. అందునా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే.. అవి కాస్తా విషాద ఉదంతాలుగా మారతాయే తప్పించి.. ఆ ప్రమాదం నుంచి తప్పించుకునే ఛాన్సులు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటిదే కెప్టెన్ స్మిత్ ముచ్ఛార్ కారణంగా చోటు చేసుకుంది. కో పైలెట్ దాడిని అడ్డుకుంటూ.. తన ప్రాణాల్ని పణంగా పెట్టి 174 మంది ప్రయాణికుల్ని కాపాడిన మనోడ్ని ఇప్పుడు లోకమంతా కీర్తిస్తోంది.
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ కు వెళుతున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేందుకు కో పైలట్ పన్నిన కుట్రను భారతదేశానికి చెందిన పైలట్ కెప్టెన్ స్మిత్ ముచ్ఛార్ తిప్పి కొట్టటం తెలిసిందే. తనపై దాడికి పాల్పడి.. గాయపడినప్పటికి.. ఆ గాయాన్ని లెక్క చేయక ప్రయాణికులు.. విమాన సిబ్బంది ప్రాణాల్ని కాపాడిన ఇతడు ఇప్పుడు రియల్ హీరోగా మారాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. భారత ప్రధాని నరేంద్ర మోడీతో సహా యావత్ ప్రపంచం ఇప్పుడు కెప్టెన్ స్మిత్ ముచ్ఛార్ ను ప్రశంసల వర్షాన్ని కురిపిస్తూ రియల్ హీరోగా చెబుతున్నారు.
ఇంతకూ ఈ భారతీయుడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి విజయవంతం కావాలనుకున్న వ్యక్తి.. అనూహ్య రీతిలో ఒక సెమినార్ తో ప్రభావితమై పైలట్ కావటం చూస్తూ స్మిత్ ముచ్ఛార్ జీవితం ఒక సినిమా కథలా కనిపిస్తుంది. ముంబయిలోని ఘాట్ కోపర్ ఈస్ట్ ప్రాంతానికి చెందిన ఇతను చిన్నతనంలో ఫ్యామిలీ బిజినెస్ అయిన టెక్స్ టైల్ రంగంలోకి వెళ్లాలని భావించాడు.
స్కూలింగ్ తర్వాత టెక్స్ టైల్ ఇంజనీరింగ్ చేశాడు. ఎంబీఏ చేసే వేళలో ఒక ఏవియేషన్ సెమినార్ కు హాజరైన సందర్భంగా.. అక్కడే అతడికి పైలట్ కావాలన్న ఆసక్తి మొదలైంది. పందొమ్మిదేళ్ల వయసులో పైలట్ కావాలని డిసైడ్ అయిన వేళ.. ఆయన కుటుంబం భిన్నంగా స్పందించింది. దీనికి కారణం దాదాపు 15 ఏళ్ల క్రితం పైలట్లు అయ్యే వారు తక్కువగా ఉండటం.. విమానం నడపటం అనేది పెద్ద ప్రమాదంగా భావించేవారు. అందుకు తగ్గట్లే స్మిత్ తల్లి సైతం చాలా భయపడ్డారు.
అయితే.. కొడుకు ఆసక్తిని తండ్రి సమర్థించారు. దీంతో అతడి పైలట్ కోరిక తీరింది. తాను కోరుకున్న కోర్సును చేయటం కోసం న్యూజిలాండ్ లోని మొయిన్ ల్యాండ్ ఎయిర్ ఏవియేషన్ కాలేజీలో చేరాడు. అక్కడ ట్రైనింగ్ పూర్తయ్యాక బోయింగ్ 737 నడిపించాడు. అతడి తొలి వాణిజ్య విమాన ప్రయాణం బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు సాగింది. 2011 జూన్ లో స్పైస్ జెట్ లో చేరి.. పదకొండేళ్లకు పైనే పని చేశాడు. సీనియర్ కమాండర్ గా..లైన్ ట్రైనింగ్ కెప్టెన్ గా పదోన్నతి పొందారు. 2020లో స్పైస్ జెట్ లో లైన్ ట్రైనింగ్ కెప్టెన్ గా మారారు. ఈ హోదాలో పలువురు పైలట్లకు స్వయంగా శిక్షణ ఇచ్చిన అనుభవం అతడి సొంతం.
ఒకటి కాదు రెండు కాదు పలు రకాల విమానాలను నడిపిన అనుభవం అతడి సొంతం. మొత్తంగా 737 విమానాలను దాదాపు 9750గంటలు నడిపారు. స్పైస్ జెట్ లో పైలట్ ఇన్ కమాండర్గా 6400 గంటలకు పైనే పని చేసి.. 2022 జూన్ లో ఫ్లై దుబాయ్ లో డైరెక్ట్ ఎంట్రీ కెప్టెన్ గా చేరారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. అతడి సోదరుడు కూడా పైలట్. అతను ఆకాశ ఎయిర్ సంస్థలో పైలట్ గా సేవలు అందిస్తున్నారు.
గత ఏడాది ‘బోనాఫైడ్ బాంటర్’ అనే పాడ్ కాస్ట్ లో తన అనుభవాన్ని పంచుకున్న స్మిత్.. పైలట్ గా యూనిఫాం ధరించిన తర్వాత తనకు మరే ఆలోచనలు మనసులోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటానని వెల్లడించారు. పని గురించే వంద శాతం ఆలోచిస్తానని.. పర్సనల్, ప్రొఫెషనల్ జీవితానికి సమ ప్రాధాన్యత ఇవ్వటంతో మరింత శక్తివంతంగా పని చేయొచ్చన్నారు.
తన సుదీర్ఘ అనుభవంలో ఏ రోజు కూడా తాను నడిపిన ఏ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ కావాల్సిన అవసరం రాలేదని పేర్కొన్నారు. ఒత్తిడి పరిస్థితులను ఏ విధంగా ఫేస్ చేయాలో తన సీనియర్ అధికారులు నేర్పించారన్న అతను.. సంక్షోభ సమయాల్లోనూ ప్రశాంతంగా పని చేసే శక్తి స్మిత్ సొంతంగా చెబుతారు. అదే విషయాన్ని మొయిన్ ల్యాండ్ ఎయిర్ సంస్థ సీఈవో చెప్పటం గమనార్హం. అత్యంత నిజాయితీ కలిగిన వ్యక్తిగా స్మిత్ నిలిచిపోతారని ఆయన వ్యాఖ్యానించారు. తాజా ఉదంతంతో ఆయన ఎప్పటికి ప్రపంచ ప్రజలకు ఒక మంచి గుర్తుగా.. సాహసోపేతమైన రియల్ హీరోగా నిలుస్తారని చెప్పాలి.
కో పైలట్ దాడి చేసి.. తీవ్రంగా గాయపడినప్పటికి అతడ్ని నిలువరిస్తూనే.. కారుతున్న రక్తాన్ని లెక్క చేయకుండా ధైర్యంతో కాక్ పిట్ తలుపులు తెరిచి.. ప్రయాణికులు.. క్యాబిన్ సిబ్బంది సాయంతో దాడి చేసిన కో పైలట్ ను అదుపు చేసిన కెప్టెన్ స్మిత్ ధైర్యం మాటల్లో చెప్పలేనిదిగా చెప్పాలి. ఇక.. కత్తిపోట్ల దాడిలో తీవ్రంగా గాయపడిన స్మిత్ ప్రస్తుతం సౌదీ అరేబియాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు సర్జరీ నిర్వహించిన తర్వాత ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు.
తాజా ఘటన అనంతరం అతడి కుటుంబ సభ్యులను ముంబయి ఘాట్ కోపర్ ఈస్ట్ ఎమ్మెల్యేస్వయంగా వెళ్లి పరామర్శించారు. స్మిత్ కు జరుగుతున్న చికిత్స వ్యవహారాలను మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. భారత ప్రభుత్వం కూడా పర్యవేక్షిస్తున్నాయి. ఇప్పటికే స్మిత్ తల్లిదండ్రులు దుబాయ్ చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ ను యూఏఈలోని భారత రాయబారి సంజయ్ మిట్టల్ గురువారం రాత్రి స్వయంగా కలిసి మాట్లాడారు. అతడి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు.
కెప్టెన్ స్మిత్ ను కలిసిన సందర్భంలో తనతో నవ్వుతూ స్పష్టంగా మాట్లాడున్నారని.. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడించారు. జెడ్డాలోని భారత కాన్సులేట్ అధికారులు కెప్టెన్ స్మిత్ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నారు. తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కెప్టెన్ స్మిత్ ముచ్ఛార్ కు ‘గుజరాత్ గరిమా అవార్డు’ను ప్రకటించారు. అతను సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలంటూ సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తాజా ఉదంతంతో మార్పులెన్నో..
ఈ ఘటనపై పూర్తిస్థాయి భద్రతా దర్యాప్తు ముగిసే వరకు ఇజ్రాయెల్ కు వెళ్లే విమానాలే కాదు అక్కడి నుంచి వచ్చే అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా ఫ్లై దుబాయ్ వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయెల్ సైతం సీరియస్ చర్యలు చేపట్టింది. తమ దేశంలోకి ప్రవేశించే విమానాలు..తమ దేశంమీదుగా ప్రయాణించే ఫ్లైదుబాయ్ విమానాల పైలట్లపై ఇజ్రాయెల్ ప్రభుత్వం భద్రతానిఘాను మరింత తీవ్రతరం చేసింది.అరబ్ దేశాల నుంచి వచ్చే విమానాల సిబ్బందికి మరింత కఠినమైన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేలా ప్రోగ్రామ్ లను సవరిస్తున్నారు.
అనూహ్య చర్చ మళ్లీ మొదలు
9/11 దాడుల తర్వాత తీసుకొచ్చిన "కాక్‌పిట్ తలుపులను లోపలి నుండి లాక్ చేసే" విధానంపై అంతర్జాతీయ విమానయాన నిపుణులు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. తాజా ఉదంతం నేపథ్యంలో కాక్ పిట్ లోపల ఉన్న పైలట్ నుంచే ప్రమాదం కానీ ముప్పు కానీ ముంచుకొస్తే ఎలా నియంత్రించాలన్న దానిపై సరికొత్త కాక్ పిట్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ రూపొందించే చర్చలు ముమ్మరం అయ్యాయి. తాజా పరిణామాలతో భారత్ కూడా తీవ్రంగా స్పందించింది. దేశీయ.. అంతర్జాతీయ విమానయాన సంస్థల భద్రతకు సంబంధించి త్వరలో ఒక ప్రత్యేక సెక్యూరిటీఅడ్వైజరీ జారీ చేసే దిశగా చర్యలు మొదలు కావటం గమనార్హం.