కేటీఆర్ హోటళ్ల వ్యాపారం ఎంత పెద్దది?
సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ..తమకుమూడు హోటళ్లు ఉన్నాయని.. అదేమీ కొత్త విషయం కాదని.. అందరికి తెలిసిన విషయాలుగా చెప్పారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం హెరిటేజ్ సంస్థ పేరుతో పాలు.. పెరుగు.. ఇతర ఉత్పత్తుల వ్యాపారం చేస్తుందన్న విషయం తెలుసు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి మీడియా, భారతి సిమెంట్ తదితర వ్యాపారాలు ఉన్నాయన్న విషయం తెలుసు. అయితే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబానికి హోటళ్ల వ్యాపారం ఉందని తెలుసా? అంటే.. కల్వకుంట్ల తారక రామారావు మాత్రం అందరికి తెలుసు కదా? అనేస్తున్నారు. అదేమంటే.. 2009 ఎన్నికల అఫిడవిట్ లోనే చెప్పాను కదా? అని ప్రశ్నిస్తున్నారు.
మిగిలిన అధినేతలు.. వారి కుటుంబ సభ్యులు చేసే వ్యాపారం గురించి సామాన్య ప్రజలకు తెలిసినప్పుడు.. కేటీఆర్ కుటుంబం నిర్వహిస్తున్న ఫైవ్ స్టార్ హోటళ్లు(?) వ్యాపారం గురించి ఎందుకు తెలీదు? ఆయన ఫ్యామిలీ బిజినెస్ ఎందుకు పాపులర్ కాలేదు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అదే సమయంలో.. తాను వ్యాపారం చేస్తామన్న విషయాన్ని ఎన్నికల అఫిడవిట్ లో చెప్పినట్లుగా కేటీఆర్ చెబుతున్న వేళ.. అలా అయితే ఏదో ఒక మీడియా సంస్థ ఈ అంశాన్ని హైలెట్ చేస్తుంది కదా? అలా ఎందుకు జరగలేదు? అన్నది మరో ప్రశ్న. ఇలాంటి వేళ.. ఈ మొత్తం ఉదంతాన్ని సాపేక్షంగా చూస్తే.. ‘అసలు విషయం’ ఇట్టే అర్థమవుతుంది.
అసలీ ఇష్యూ హాట్ టాపిక్ గా ఎలా మారింది?
కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ చేసిన తీవ్ర ఆరోపణలే ఈ మొత్తం అంశాన్ని హాట్ టాపిక్ అయ్యేలా చేశాయి. కేటీఆర్ సొంత నియోజకవర్గ ప్రజలకు కేటీఆర్ కుటుంబానికి ఎంత భారీగా ఆస్తులు.. వ్యాపారాలు ఉన్నాయన్న విషయాన్ని తొలిసారి ప్రస్తావించారు. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ సమీపంలో కేటీఆర్ కుటుంబానికి దక్కన్ సెరాయ్ అనే ఫైవ్ స్టార్ హెటళ్లు.. అట్ హోమ్ అనే సర్వీస్ అపార్ట్ మెంట్లు ఉన్నట్లుగా పేర్కొన్నారు.
ఈ మూడు హోటళ్లలో కలిపి సుమారు 400 గదులు ఉన్నాయని.. అందులో ఒక హోటల్ లోనే 190 గదులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఏపీకి చెందిన వ్యక్తుల పేరుతో ఉన్న ఈ హోటల్ ఆస్తులకు కొద్ది నెలల క్రితమే కేటీఆర్ కుటుంబ సభ్యుల పేర్ల మీద బదిలీ చేసుకున్నట్లుగా వెల్లడించారు. కేటీఆర్ ప్రజల ఓట్లను తమ సొంత సంపదగా మార్చుకొని.. బంజారాహిల్స్.. జూబ్లీహిల్స్ లో భారీ భవనాలు.. జన్వాడ, శంకర్ పల్లి, మొయినాబాద, ఎర్రవెల్లి లో ఫామ్ హైస్ లు ఉన్నాయనిచెబుతూ.. అమెరికా, సింగపూర్ లలో పెట్టుబడులు పెట్టారని ఆరోపిస్తూ.. తీవ్రంగా విమర్శించారు.
దీనికి కేటీఆర్ కౌంటర్ ఏంటి?
సీఎం రేవంత్ చేసిన ఆరోపణలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ‘‘అమెరికాలో కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో 2006లో హోటల్ వ్యాపారం ప్రారంభించాను. కుటుంబం కోసం వ్యాపారం చేయటం తప్పా? సిరిసిల్లలో సీఎం రేవంత్ చెప్పినదంతా నేను ఎప్పుడో చెప్పా. నాకు హోటల్ ఉన్నట్లు 2009 ఎన్నికల అఫిడవిట్ లో రాశాను. ఆ విషయాన్ని కొలంబస్ లెక్క.. వాస్కోడిగామా లెక్క ఏదో కనుగొన్నట్లు నువ్వేంది చెప్పేది. అఫిడవిట్ లో ఉన్నది నువ్వు చెప్పినవ్. భార్యాపిల్లలకు బువ్వ పెట్టాలె కదా. వాళ్ల కోసం వ్యాపారం చేయటం తప్పా? నేను ఉన్నత చదువులు చదివా. నీలా ఏళ్ల తరబడి డిగ్రీ చదవలేదు. 20 ఏళ్లలో మూడు హోటళ్లకు పెరిగింది. ఈ రాజకీయాల్లోకి రాకుండా వ్యాపారం మీదమరింత ఫోకస్ పెట్టి ఉంటే మరోపది హోటళ్లు కూడా ఏర్పాటు చేసేవాడిని. ఏదైనా నా హోటళ్లకు ఉచిత ప్రచారం కల్పించినందుకు సంతోషంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు.
అసలు చిక్కుముడి ఏంటి?
కేటీఆర్ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లను చూసినప్పుడు అసలు విషయం అర్థమవుతుంది. అదేమంటే.. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమకున్న వాటాలున్న కంపెనీల రిజిస్టర్డ్ పేర్లను మాత్రమే అఫిడవిట్ లో నమోదు చేయాలే తప్పించి.. ఆ కంపెనీలు నడిపే హోటళ్ల బ్రాండ్ పేర్లు రాయాల్సిన అవసరం లేదు. అందుకే ‘అట్ హోమ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ అని ఉందే తప్పించి.. ఆ కంపెనీకి చెందిన డెక్కన్ సెరాయ్ అనే బ్రాండ్ మీద లేదు. అంతేకాదు.. ఈ ఆస్తులను చరాస్తుల విభాగంలో పేర్కొన్నారు.
2009 - 2023లో చరాస్తుల పెరుగుదల ఎంతంటే?
2009 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం చరాస్తుల విలువ రూ.1.72 కోట్లు. 2014 ఎన్నికల అఫిడవిట్ లో చరాస్తుల విలువ రూ.5.11 కోట్లుగా పేర్కొంటే.. 2018 ఎన్నికల అఫిడవిట్ లో చరాస్తుల విలువ రూ.3.63 కోట్లుగా పేర్కొన్నారు. ఇక.. 2023 ఎన్నికల అఫిడవిట్ లో చరాస్తుల విలువ రూ.6.92 కోట్లుగా పేరకొన్నారు. అదేసమయంలో కేటీఆర్ హిందూఅవిభక్త కుటుంబం కింద విడిగా ఉన్న చరాస్తులవిలువసుమారు రూ.14.93 లక్షలుగా పేర్కొన్నారు. కేటీఆర్ సతీమణికి ఆలేఖ్య వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు కాంటూర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాటి అనుబంధ ప్రమోటర్ గ్రూప్ ఇతర సంస్థల్లోనూ షేర్లు ఉన్నట్లుగా పేర్కొన్నారు.
ఇదంతా చూస్తే.. డెక్కన్ సరాయ్ అనే హోటళ్ల వ్యాపారం కేటీఆర్ కుటుంబానిది అన్న విషయం తెలియకపోవటానికి కారణం.. దీనికి పెద్దగా ప్రచారం లేకపోవటమే కాదు.. చాలా తక్కువ మందికి మాత్రమే ఈ విషయాలు తెలుసు. అధికారికంగా ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నప్పటికి.. కంపెనీ పేరు మాత్రమే ప్రస్తావించటంతో హోటళ్ల వ్యాపారం పాపులర్ కాలేదు.
నిజంగానే ఫైవ్ స్టార్ హోటళ్లా?
సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ..తమకుమూడు హోటళ్లు ఉన్నాయని.. అదేమీ కొత్త విషయం కాదని.. అందరికి తెలిసిన విషయాలుగా చెప్పారు. అంతేకాదు.. తాను ఎన్నికల అఫిడవిట్ లోనూ పేర్కొన్నట్లు తెలిపారు. ఇంతకూ కేటీఆర్ కుటుంబానికి ఉన్న మూడు హోటళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయన్నది చూస్తే.. హోటల్ డెకకన్ సెరాయ గ్రాండే (గచ్చిబౌలి), హోటల్ డెక్కన్ సెరాయ్ (హైటెక్ సిటీ), అట్ హోమ్ సర్వీస్డ్ అపార్ట్ మెంట్స్ (కొండాపూర్). వీటిల్లో గచ్చిబౌలిలో ఉన్నది ఫోర్ స్టార్ హోటల్ గా చెబుతున్నారు. అదేసమయంలో హైటెక్ సిటీలో ఉన్నది త్రీ స్టార్ బొటిక్ హోటల్ గా చెప్పొచ్చు. ఐదు అంతస్తుల్లో 100 గదులతో ఉంటుంది. గచ్చిబౌలిలో ఉననది మాత్రం 10 అంతస్తులు.. సుమారు 190గదులతో ఉంది. ఇది ప్రీమియం బిజినెస్ హోటల్ గా చెప్పొచ్చు.
కొండాపూర్ లో ఉన్నది మాత్రం సర్వీస్డ్ అపార్ట్ మెంట్. ఒక విధంగా చెబితే ఇదో సాధారణ బడ్జెట్.. లేదంటే ప్రీమియం అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ గా చెప్పొచ్చు. అయితే.. ఇవేమీ ఫైవ్ స్టార్ లగ్జరీ హోటళ్లు అని మాత్రం చెప్పలేం. ఇప్పుడు అసలు ప్రశ్న. చంద్రబాబు కుటుంబ వ్యాపారమైన హెరిటేజ్.. జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన భారతి సిమెంట్ మాదిరి కేటీఆర్ కుటుంబానికి చెందిన డక్కెన్ సరాయ్ హోటళ్లు ఎందుకు పాపులర్ కాలేదు? అన్న విషయానికి వస్తే.. తనను తాను అమెరికాలో ఉద్యోగిగా... ఉద్యమకారుడిగా.. రాజకీయవేత్తగా చెప్పుకునే కేటీఆర్.. తనకు.. తన కుటుంబం వ్యాపార రంగంలో ఉన్న విషయాన్ని చెప్పుకోకపోవటమే.