రాయలసీమ రైజింగ్ : రూ. లక్ష కోట్ల పెట్టుబడులతో 'స్వర్ణ సీమ'గా రూపాంతరం

పసిడి పంటల సీమగా తన పూర్వ వైభవాన్ని తిరిగి సాధించుకునేందుకు 'రాయలసీమ రైజింగ్' పేరుతో ప్రారంభమైన ఈ రూ. లక్ష కోట్ల అభయహస్తం.. ప్రతి సీమవాసి భవిష్యత్తుపై కొత్త వెలుగులను ప్రసరింపజేస్తోంది.

Update: 2026-10-02 04:27 GMT

రాయలసీమ అంటే ఎండిపోయిన పొలాలు.. నెర్రలు బారిన నేల.. పొట్టచేతపట్టుకుని వలసబాట పట్టిన రైతన్నల కన్నీటిగాథలు మాత్రమే గుర్తుకొచ్చే రోజులకు ఇక శాశ్వత ముగింపు పడబోతోంది. దశాబ్దాలుగా సీమ గుండెల్లో పేరుకుపోయిన కరువు వేదనను తుడిచేస్తూ.. కక్షలు-కాటకాల స్థానంలో ఆకుపచ్చని ఆశల చిగుళ్లను తొడిగించేందుకు ఏపీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక సంకల్పంతో ముందడుగు వేసింది. పసిడి పంటల సీమగా తన పూర్వ వైభవాన్ని తిరిగి సాధించుకునేందుకు 'రాయలసీమ రైజింగ్' పేరుతో ప్రారంభమైన ఈ రూ. లక్ష కోట్ల అభయహస్తం.. ప్రతి సీమవాసి భవిష్యత్తుపై కొత్త వెలుగులను ప్రసరింపజేస్తోంది.

 

కరువు, కాటకాలు, వెనుకబాటుతనం, ముఠా కక్షలు... దశాబ్దాలుగా రాయలసీమ పేరు వినగానే పలకరించే ప్రతికూల ముద్రలవి. అయితే ఈ పాత గుర్తింపుకు శాశ్వతంగా చరమగీతం పాడుతూ సీమ సమాజానికి సమగ్ర సమృద్ధిని, కొత్త భరోసాను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత భారీ, ప్రతిష్ఠాత్మక ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రాయలసీమ రైజింగ్’ పేరిట రాబోయే మూడేళ్ల కాలంలో ఏకంగా రూ. 1 లక్ష కోట్ల నిధులను సమీకరించి ఈ ప్రాంతాన్ని దేశంలోనే అగ్రగామి ఉద్యాన, వ్యవసాయ, ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసింది.

మదనపల్లె వేదికగా చారిత్రాత్మక ఆరంభం

విజయవాడ పరిపాలనా సముదాయాల పరిధి దాటి నేరుగా క్షేత్రస్థాయిలో మార్పును తీసుకొచ్చే దిశగా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న ఉదయం 11 గంటలకు అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని బీకే పల్లిలో ఈ కార్యక్రమానికి అంగరంగ వైభవంగా నాంది పలకనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ ప్రణాళికను అధికారికంగా ప్రారంభించడంతో పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్ఏ) నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు.

10 జిల్లాలు.. 201 క్లస్టర్ల వినూత్న నమూనా

రాయలసీమలోని 8 జిల్లాలు అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, తిరుపతి, వైఎస్సార్ కడప పాటు పొరుగున ఉన్న ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలను కలిపి మొత్తం 10 జిల్లాలలో 201 క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు.

ఈ ప్రణాళికలోని ప్రధానాంశాలు

ప్రభుత్వ రంగం నుంచి రూ. 40,000 కోట్లకు పైగా.. ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా రూ. 60,000 కోట్లకు పైగా నిధులు సమీకరించనున్నారు. కేవలం సాగుకే పరిమితం కాకుండా నీటిపారుదల, ఆధునిక రవాణా రహదారులు, ప్రాసెస్డ్ కోల్డ్ స్టోరేజీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మార్కెటింగ్, అంతర్జాతీయ ఎగుమతుల వ్యవస్థను అనుసంధానించనున్నారు. ప్రస్తుతం ఉన్న ఉద్యాన సాగు పరిధిని విస్తరించి ఏకంగా 14.41 లక్షల హెక్టార్లకు పెంచడం ప్రధాన లక్ష్యం. మామిడి, అరటి, టమాట, దానిమ్మ, బత్తాయి వంటి సాంప్రదాయ ఉత్పత్తులతో పాటు విదేశీ మార్కెట్‌లో అధిక ధర పలికే డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, వివిధ రకాల బెర్రీస్ సాగును విస్తృతంగా ప్రోత్సహించనున్నారు. దీనిద్వారా దాదాపు 9.6 లక్షల మంది రైతులకు నేరుగా ఆర్థిక ప్రాప్తి లభించనుంది.

సాగునీరు.. వ్యవసాయ సాంకేతికతకు అత్యున్నత పీఠం

రాయలసీమను భౌగోళికంగా నిలబెట్టేది సాగునీరే కాబట్టి ప్రభుత్వ కేటాయింపుల్లో సింహభాగం రూ. 20,884 కోట్లను నీటిపారుదల ప్రాజెక్టులకే ప్రతిపాదించారు. దానికితోడు ఉద్యాన రంగానికి రూ. 15,000 కోట్లు, రహదారుల నిర్మాణానికి రూ. 4,562 కోట్లు వెచ్చిస్తారు. దీనివలన కొత్తగా 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా మరో 4.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు శాశ్వత స్థిరీకరణ కలగనుంది.

మరొకవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో మదనపల్లెలో నెలకొల్పనున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్ఏ) ద్వారా గ్లోబల్ రీసెర్చ్, ఏఐ ఆధారిత వ్యవసాయ సాంకేతికత, స్కిల్ డెవలప్‌మెంట్ అందుబాటులోకి రానున్నాయి.

విజయనగర శ్రీకృష్ణదేవరాయల పాలనలో సంపదతో.. పసిడి పంటలతో తులతూగిన రాయలసీమ.. ఆధునిక సాంకేతికత.. పారిశ్రామిక ప్రాసెసింగ్.. భారీ పెట్టుబడుల తోడై మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుని నిఖార్సయిన ‘స్వర్ణ సీమ’గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News