4 రోలెక్స్ వాచీల ధ‌ర 400 కోట్లు.. మ‌న స్టార్ల‌కు ఎందుకు అంత పిచ్చి?

లండన్‌లో జరిగిన ఒక ప్రతిష్టాత్మక ఛారిటీ వేలంలో నాలుగు రోలెక్స్ డేటోనా వాచీలు ఏకంగా 49.4 మిలియన్ డాలర్లు, అంటే భారతీయ కరెన్సీలో రూ.400 కోట్లకు పైగా ధర పలికి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

Update: 2026-10-02 13:03 GMT

లండన్‌లో జరిగిన ఒక ప్రతిష్టాత్మక ఛారిటీ వేలంలో నాలుగు రోలెక్స్ డేటోనా వాచీలు ఏకంగా 49.4 మిలియన్ డాలర్లు, అంటే భారతీయ కరెన్సీలో రూ.400 కోట్లకు పైగా ధర పలికి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అత్యంత విలాసవంతమైన.. అరుదైన ఈ వాచీలు అంతర్జాతీయ వాచ్ కలెక్టర్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ వేలం ద్వారా వచ్చిన భారీ మొత్తాన్ని ప్రముఖ సామాజిక, పర్యావరణ సంస్థలకు విరాళంగా అందిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఈ నాలుగు రోలెక్స్ వాచీలు వేర్వేరు ప్రత్యేకతలు.. అద్భుతమైన డిజైన్‌లతో రూపుదిద్దుకున్నాయి. వీటిలో `సమ్మర్` వాచీ ఎవర్రోజ్ గోల్డ్ .. టర్కాయిస్ మెటీరియల్స్‌తో తయారై 13.65 మిలియన్ డాలర్లు పలికింది. అలాగే `ఆటం` వాచీ ఎల్లో గోల్డ్ - ముకైట్ కాంబినేషన్‌తో 13.5 మిలియన్ డాలర్లను సొంతం చేసుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇక మిగిలిన రెండు వాచీలలో `వింటర్`ఎడిషన్ ప్లాటినం - బ్లూ ఓపల్ డిజైన్‌‌తో కూడి 13.2 మిలియన్ డాలర్ల ధరను దక్కించుకుంది. అలాగే `స్ప్రింగ్` ఎడిషన్ వాచీ వైట్ గోల్డ్ మెటీరియల్‌తో రూపొంది 9 మిలియన్ డాలర్ల ధరను పలికింది. ఇలా ప్రకృతిలోని ప్రతి సీజన్‌ను ప్రతిబింబించేలా వీటిని అత్యంత నైపుణ్యంతో తీర్చిదిద్దడం ప్రధాన విశేషం.

ఈ వేలం ద్వారా లభించిన మొత్తం భారీ నిధులను కేవలం విలాసాల కోసం కాకుండా సామాజిక- పర్యావరణ సేవలకు వినియోగిస్తున్నారు. ఈ మొత్తాన్ని టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ స్థాపించిన `రోజర్ ఫెడరర్ ఫౌండేషన్` అలాగే ప్రముఖ హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియోకు చెందిన పర్యావరణ సంస్థ రీ-వైల్డ్‌కు విరాళంగా అందిస్తున్నారు. విలాసవంతమైన వస్తువుల విక్రయం ద్వారా వచ్చే సొమ్మును ఇలాంటి సత్కార్యాలకు ఉపయోగించడం పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

టాలీవుడ్ బాలీవుడ్ స్టార్ల‌లో రోలెక్స్ క్రేజ్:

అంతర్జాతీయ స్థాయిలో రోలెక్స్ వాచీలకు ఉన్న క్రెజ్ ఇలా ఉంటే.. మన టాలీవుడ్ - బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా రోలెక్స్ వాచీలపై ప్రత్యేక మమకారాన్ని కలిగి ఉన్నారు. కోట్లాది రూపాయల ఖరీదు చేసే లగ్జరీ వాచీలను ధరించడంలో మన టాలీవుడ్ స్టార్స్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి ప్రముఖులు ముందు వరుసలో ఉంటారు. వారి వద్ద ఉన్న ప్రత్యేకమైన, లిమిటెడ్ ఎడిషన్ రోలెక్స్ వాచీలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

ఇక బాలీవుడ్‌లో బాద్‌షా షారుక్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, సల్మాన్ ఖాన్ వంటి అగ్ర నటులు అత్యంత ఖరీదైన.. అరుదైన రోలెక్స్ - ఇతర లగ్జరీ వాచీలను ఉపయోగిస్తుంటారు. కేవలం ఫ్యాషన్ స్టేట్‌మెంట్ మాత్రమే కాకుండా.. తమ హోదాకు తగినట్లుగా కోట్లాది రూపాయల విలువైన ఈ వాచీలను సేకరించడం ఈ స్టార్లకు అలవాటు. ఈ రకమైన అరుదైన వాచీల క్రేజ్.. వాటి వెనుక ఉన్న దాతృత్వ దృక్పథం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News