'ఫోల్డబుల్ ఫోన్' తో యాపిల్ దూకుడు.. ధరలు చూస్తే షాకింగే!
కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్‌లో ఇటీవల జరిగిన గ్రాండ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియుల దృష్టిని ఆకర్షించింది.
ప్రపంచ ప్రసిద్ధ టెక్ దిగ్గజం యాపిల్ ఎట్టకేలకు మోస్ట్ అవైటెడ్ ఫోల్డబుల్ ఐఫోన్`ను మార్కెట్‌లోకి ఆవిష్కరించింది. `ఐఫోన్ డ్యూయో పేరుతో తీసుకొచ్చిన ఈ తొలి విప్లవాత్మక ఫోన్ ధర చూసి టెక్ ప్రియులు షాక్‌కు గురవుతున్నారు. భారత మార్కెట్‌లో ఈ ఫోల్డబుల్ ఐఫోన్ ప్రారంభ ధర ఏకంగా రూ.2,99,900గా నిర్ణయించారు. దీంతో పాటు ఐఫోన్ 18 సిరీస్‌లో భాగంగా 6.3 అంగుళాల డిస్‌ప్లేతో ఐఫోన్ 18 ప్రో, 6.9 అంగుళాల డిస్‌ప్లేతో ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడళ్లను కూడా కంపెనీ లాంచ్ చేసింది.
కొత్త ఉత్పత్తుల విభాగంలో యాపిల్ ప్రకటించిన ధరల వివరాలు పరిశీలిస్తే.. 256GB వేరియంట్ ఐఫోన్ డ్యూయో రూ.2,99,900 కాగా... ఐఫోన్ 18 ప్రో (256GB) ధర రూ.1,64,900.. అలాగే ఐఫోన్ 18 ప్రో మాక్స్ (256GB) ధర రూ.1,79,900గా ఉంది. ఐఫోన్లతో పాటు యాపిల్ వాచ్ 12 ను రూ.56,900కి, యాపిల్ వాచ్ ఆల్ట్రా 4 ను రూ.1,09,900కి అలాగే ఎయిర్‌పాడ్స్ 5ను రూ.14,900 ప్రారంభ ధరలతో పరిచయం చేసింది. ఇవి కొనుగోలుకు ఎప్పటినుంచి స్టోర్స్ లో అందుబాటులోకి వస్తాయి? అనే విషయానికి వస్తే.. ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మాక్స్ మోడళ్లు ఈ నెల 18వ తేదీ నుంచే లభించనుండగా.. ఫోల్డబుల్ ఐఫోన్ డ్యూయో మాత్రం అక్టోబర్ 23 నుండి వినియోగదారులకు స్టోర్‌లో లభిస్తాయి.
కొత్త సిరీస్ మోడళ్లను లాంచ్ చేయడమే కాకుండా.. భారతీయ కస్టమర్లకు యాపిల్ ఊహించని విధంగా మరొక పెద్ద షాక్ ఇచ్చింది. కంపెనీ తన పాత ఐఫోన్ మోడళ్ల ధరలను భారత్‌లో ఏకంగా రూ.10,000 నుండి రూ.30,000 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా కొత్త వర్షన్లు వచ్చినప్పుడు పాత మోడళ్ల ధరలు తగ్గుతాయని ఆశించే వినియోగదారులకు ఈ నిర్ణయం గట్టి షాకింగ్ ప్లాష్‌లా మారింది.
ధరల సవరణ తర్వాత పాత మోడళ్ల రేట్లు చూస్తే.. ఐఫోన్ 17ఇ ధర రూ.64,900 నుండి రూ.79,900కి పెరగ్గా... ఐఫోన్ 16 రేటు రూ.79,900 నుండి రూ.89,900కి చేరింది. అలాగే ఐఫోన్ 17 వేరియంట్ ధర రూ.82,900 నుండి రూ.99,900కి ఎగబాకగా.. ఐఫోన్ ఎయిర్ ధర ఏకంగా రూ.1,19,900 నుండి రూ.1,49,900కి పెరిగింది. మొత్తానికి కొత్త ఫోన్ల మైండ్ బ్లాకింగ్ ధరలతో పాటు పాత ఐఫోన్ల ధరల పెంపుతో యాపిల్ భారత మార్కెట్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈవెంట్ వైభవంగా:
కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్‌లో ఇటీవల జరిగిన గ్రాండ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఈసారి కొత్త మోడళ్లలో హార్డ్‌వేర్‌తో పాటు యాపిల్ ఇంటెలిజెన్స్- మరింత శక్తివంతమైన సిరి-AI ఫీచర్లకు ప్రాధాన్యతనిచ్చారు. యూజర్లు ప్రత్యేకంగా ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేసేలా AIని రూపొందించి.. తమ సాఫ్ట్‌వేర్ ఫస్ట్ వ్యూహాన్ని యాపిల్ స్పష్టం చేసింది.
ధరల పెరుగుదలకు కారణం?
సీబీయు దిగుమతి సుంకాలు.. జీఎస్టీ, పెరిగిన విడిభాగాల వ్యయాలు.. ఆపిల్ అనుసరిస్తున్న ఆల్ట్రా-ప్రీమియమైజేషన్ వ్యూహం ఈ ధరల పెంపునకు ప్రధాన కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణ ఐఫోన్ 18 మోడల్‌ను ఈ ఏడాది విడుదల చేయకపోవడం.. భారీ ధరలు ఉన్నా సులభమైన ఫైనాన్సింగ్ ఆప్షన్ల ద్వారా భారత్‌లోని ప్రీమియం వినియోగదారులను ఆకట్టుకోవాలని ఆపిల్ లక్ష్యంగా పెట్టుకుంది.