బీజేపీ బీఆర్ఎస్ పొత్తు...ఎందుకంత రచ్చ ?

తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. విపక్షంలో రెండు కీలక పార్టీలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ అయితే రెండవది జాతీయ పార్టీ బీజేపీ.

Update: 2026-10-02 19:30 GMT

తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. విపక్షంలో రెండు కీలక పార్టీలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ అయితే రెండవది జాతీయ పార్టీ బీజేపీ. ఈ రెండు పార్టీలు అధికారంలోకి రావాలని చూస్తున్నాయి. అయితే సాధారణంగా ఎన్నికల తీరు గమనిస్తే త్రిముఖ పోరు సాగితే అధికార పక్షానికి ఎక్కువ మేలు జరుగుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలిక అన్న దాని బట్టి అధికారానికి మొగ్గు ఉంటుంది. తెలంగాణాలో చూస్తే 2028లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడానికి ఇదొక ప్రధాన అంశం అవుతుందా అన్న చర్చ సాగుతోంది. దాంతో విపక్షాలు అన్నీ కలసికట్టుగా ఉంటేనే తప్ప అధికార పార్టీని ఓడించలేవని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటాయని గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్న విషయం.

కాంగ్రెస్ అంటోంది అదే :

ఇదిలా ఉంటే బీఆర్ఎస్ బీజేపీ రెండూ పొత్తులు పెట్టుకుని వచ్చినా 2028 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను తాము ఎదుర్కొని తిరిగి గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అనేక సందర్భాలలో చెప్పారు. ఆ రెండు పార్టీలు ఒక్కటే అని కూడా ప్రచారం చేస్తూ వచ్చారు. ఎప్పటికైనా పొత్తుల్లోకి వెళ్తారు అని కూడా జోస్యాలు చెప్పిన వారూ ఉన్నారు. అయితే ఇది కాదు అంటూ అటు బీఆర్ ఎస్ నేతలు ఇటు బీజేపీ నాయకులు ఎప్పటికపుడు ఖండిస్తున్నా ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఎందుకంటే తెలంగాణాలో రాజకీయం అలా ఉంది మరి.

అసలు ఉండదంటూ :

బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే ఉండదని కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు జి కిషన్ రెడ్డి తాజాగా మరోసారి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము పొత్తు లేకుండానే వెళ్తామని కూడా చెప్పుకొచ్చారు. తమ పార్టీలో కూడా బీఆర్ఎస్ తో ఎవరూ పొత్తులు కోరుకోవడం లేదని కూడా కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు అనే కాదు తెలంగాణాలో ఏ ఎన్నిక అయినా బీజేపీ సొంతంగానే పోటీ చేస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. అంతే కాదు 2028 లో ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వస్తుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు.

వారిది అదే మాట :

బీఆర్ఎస్ వైపు చూసినా వారిది అదే మాటగా ఉంది. ఈ మధ్యనే కేరళలో జరిగిన ఒక కాంక్లేవ్ లో కేటీఆర్ మాట్లాడుతూ బీజేపీతో పొత్తు అన్నదే ఉండదని స్పష్టం చేశారు. అవన్నీ ఒట్టి ప్రచారం మాత్రమే అని తోసి పుచ్చారు. తమకంటూ సొంత బలం ఉందని తాము అలాగే అధికారంలోకి వస్తామని ఆయన గట్టిగానే ఒట్టేసి మరీ చెప్పారు. ఇలా అతి కొద్ది రోజుల తేడాలో బీఆర్ఎస్ బీజేపీ అగ్ర నేతలు పొత్తుల గురించి ఖండిస్తూ చేసిన వ్యాఖ్యలు అయితే చర్చనీయాంశం అవుతున్నాయి.

ఆగని ప్రచారం :

అయితే ఎన్ని సార్లు చెప్పినా కూడా ఈ పొత్తుల గురించి ప్రచారాలు అయితే ఆగడం లేదు, ఎందుకు అంటే ముందే చెప్పుకున్నట్లుగా తెలంగాణాలో రాజకీయ వాతావరణం అలా ఉంది. అంతే కాదు విపక్షాల ఓట్లు చీలితే కాంగ్రెస్ కే రాజకీయ లాభం అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. దాంతోనేనా ఈ పొత్తుల గురించి పదే పదే ప్రచారం సాగుతోంది అని అంటున్నారు. అయితే రాజకీయాల్లో ఏదీ అసాధ్యం అయితే కాదు, ఇంకా రెండేళ్ళ సమయం అయితే ఎన్నికలకు ఉంది. దాంతో అప్పటి పరిస్థితుల బట్టి ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒక వేళ జరిగినా జరగకపోయినా ఈ పొత్తులు గురించిన వార్తలు ఎపుడూ రాజకీయ రచ్చనే రగిలిస్తున్నాయన్నది వాస్తవం.

Tags:    

Similar News