లోకల్ పోల్స్...జగన్ రికార్డు క్రియేట్ చేశారా ?
స్థానిక సంస్థల ఎన్నికలు విషయంలో వైసీపీ పోటీ చేయకపోవచ్చు అన్నది ఆ మధ్య దాకా ఉన్న ప్రచారం. ఎందుకంటే చడీ చప్పుడూ ఎక్కడా ఉండేది కాదు.
స్థానిక సంస్థల ఎన్నికలు విషయంలో వైసీపీ పోటీ చేయకపోవచ్చు అన్నది ఆ మధ్య దాకా ఉన్న ప్రచారం. ఎందుకంటే చడీ చప్పుడూ ఎక్కడా ఉండేది కాదు. అధికార కూటమిలోనే ఎక్కువగా స్థానిక ఎన్నికల గురించి చర్చలు సాగేవి. ఇక ఎటూ అధికార పక్షం దే లోకల్ బాడీ ఎన్నికల్లో పైచేయి గా ఉంటుంది కాబట్టి ఎందుకు పోటీ అన్నది కూడా ఒక దశలో వైసీపీలో ఉన్నది అని అంతా అనుకున్నారు. కానీ గత రెండు నెలల నుంచి వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికలను సీరియస్ గానే తీసుకుంది. జగన్ అయితే వరస మీటింగ్స్ పెడుతూ వస్తున్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశాలతో పాటు జిల్లా అధ్యక్షులతోనూ అలాగే రీజనల్ కో ఆర్డినేటర్లతోనూ ఆయన భేటీలు వస్తున్నారు.
గెలిచి తీరాల్సిందే :
స్థానిక సంస్థల మీద జగన్ కి ఎక్కువ నమ్మకం ఉందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం మీద ప్రజలలో వ్యతిరేకత అయితే పెద్ద ఎత్తున వచ్చింది అని ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు. తప్పకుండా ఈసారి వైసీపీ తన సత్తా చాటుతుందని జగన్ విశ్వసించడమే కాకుండా పార్టీ నాయకులకు క్యాడర్ కి అదే సూచిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే జగన్ సీరియస్ గా మీటింగులు నిర్వహిస్తున్నారు అని అంటున్నారు. అంతే కాకుండా ఏకగ్రీవాలు అన్నవి అసలు ఉండరాదు అని ఆయన అంటున్నారు. ఇక లేటెస్ట్ గా చూస్తే కనుక జగన్ జిల్లాల అధ్యక్షులతో పాటు రీజనల్ కో ఆర్డినేటర్లతో నిర్వహించిన సమావేశం అయితే సుదీర్ఘంగా సాగింది అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇంతటి సుదీర్ఘంగా :
జగన్ పార్టీ మీటింగ్స్ నిర్వహించడం అన్నది సాధారణమైనదే. అక్కడ మూడు నాలుగు గంటల మించి సాగేది ఉండదు, కానీ తాజాగా నిర్వహించిన సమావేశం మాత్రం ఏకంగా పది గంటల పాటు సాగింది అని అంటున్నారు. ఇన్ని గంటల పాటు జగన్ పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించి ఒక రికార్డునే క్రియేట్ చేశారు అని అంటున్నారు. దాంతో జగన్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ మీద ఎంత సీరియస్ గా ఉంటున్నారో అన్నది అర్థం అవుతోంది అని అంటున్నారు. జగన్ లో ఉన్న నమ్మకం, పట్టుదల ధీమా ఇవన్నీ చూసిన తరువాత పార్టీ నేతలు కూడా విజయం కోసం పోరాడి తీరాల్సిందే అని జిల్లా స్థాయిలో నియోజకవర్గాల స్థాయిలో జరిగే సమావేశాలలో ఒకటికి పది సార్లు చెబుతున్నారు అని అంటున్నారు.
జగన్ కమిట్మెంట్ అంటూ :
ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ కమిట్మెంట్ గురించి పార్టీ కార్యకర్తలకు చెప్పుకొచ్చారు. జగన్ ఏకంగా పది గంటలకు పైగా ప్రత్యేక సమావేశాన్ని స్థానిక సంస్థల ఎన్నికల గురించే నిర్వహించారు అని చెప్పారు. ప్రతీ జిల్లా అధ్యక్షుడు, రీజనల్ కో ఆర్డినేటర్లతో జగన్ అన్ని అంశాలు చర్చించారు అని చెప్పారు. ప్రతీ జిల్లాలో పార్టీ పరిస్థితుల మీద ఆయన పూర్తిగా సమీక్షించారని వెల్లడించారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల గురించి అధినాయకత్వం ఆలోచన చేస్తోంది అన్నారు. అన్ని చోట్లా పార్టీ అభ్యర్థులు పోటీ చేసి గెలిచి తీరాలన్నది జగన్ టార్గెట్ గా కాకాణి చెబుతున్నారు. ఇవన్నీ చూస్తూంటే జగన్ స్థానిక ఎన్నికల విషయంలో పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. మరి జగన్ పట్టుదలను చూసి జిల్లాలలో నేతలు ఏ విధంగా యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసి ఎన్నికలను ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది.