మోడీ కోసం.. బాబు 'యజ్ఞం' ..!
సాధారణంగా మోడీ బయట పర్యటనలకు వచ్చినప్పుడు కూడా.. సొంత చెఫ్‌ను వెంట పెట్టుకుని వస్తారు.;
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోసం.. సీఎం చంద్రబాబు ఓ యజ్ఞమే చేస్తున్నారని చెప్పాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా చంద్రబాబు 4.0 ప్రభుత్వంలో ప్రధాని మోడీకి చంద్రబాబు భారీ ప్రాధాన్యం ఇస్తున్నారు. దాదాపు కీలక అంశాల విషయంలో మోడీకి తెలియకుండా ఆయన ఏమీ చేయడం లేదన్న చర్చ ఉంది. అమరావతి రాజధాని పనులను పునః ప్రారంభించడం దగ్గర నుంచి విశాఖలో నిర్వహించనున్న యోగా వరకు కూడా సీఎం చంద్రబాబు చాలా శ్రద్ధ పెడుతున్నారు.
సాధారణంగా మోడీ బయట పర్యటనలకు వచ్చినప్పుడు కూడా.. సొంత చెఫ్‌ను వెంట పెట్టుకుని వస్తారు. విమానంలో ఆయనతోనే వంట చేయించుకుంటారు. కానీ.. ఏపీలో అమరావతి పనుల పునః ప్రారంభఘట్టానికి వచ్చినప్పుడు.. చంద్రబాబు చేయించిన వంటకాన్ని ఆయన ఆప్యాయంగా ఆరగించారు. అంటే.. చంద్రబాబుపై ఆయనకు, మోడీపై చంద్రబాబుకు ఉన్న ప్రాధాన్యం ఈ వ్యవహారం స్పష్టం చేస్తోంది. వాస్తవానికి ఇద్దరికీ ఉన్న పరస్పర రాజకీయ ప్రయోజనాలు కూడా.. ఇద్దరినీ కలిపి ఉంచాయనే చెప్పాలి.
కేంద్రంలో బలమైన మద్దతు మోడీకి లేదు. పైగా ప్రస్తుత మిత్రపక్షాల్లో బిహార్ జేడీయూ అంత నమ్మశక్యం కాని మిత్ర పక్షం. దీంతో ఎక్కువగా మోడీ ఆశలు, ఆకాంక్షలు కూడా.. ఏపీపైనే ఉన్నాయి రేపు ఏదైనా తేడా వచ్చినా.. ఏపీ ఆదుకుంటుందన్న ధీమా ఆయనలో ఉంది. ఇక, ఏపీలో వైసీపీని కట్టడి చేయాలంటే.. ఖచ్చితంగా కేంద్రం దన్ను అవసరమని.. గుర్తించిన చంద్రబాబు లోకల్ కన్నా.. ఢిల్లీతోనే బెస్ట్ అనిపించుకునే పరిస్థితిలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఈ నెల 21న జరగనున్న ప్రపంచ యోగా దినోత్సవానికి ఏపీ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో విశాఖలో దీనిని ఏర్పాటు చేశారు. అయితే.. ఈ కార్యక్రమానికి మోడీని ఆహ్వానించిన నాటి నుంచి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఎక్కడా చిన్న పొరపాటు రాకుండా స్వయంగా చూసుకుంటున్నారు. ప్రతి విషయాన్నీ అడిగి తెలుసుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. మోడీ కోసం..చంద్రబాబు ఓ యజ్ఞమే చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. దీని తాలూకు ఫలితం 2029లో కనిపిస్తుందనే వాదనా వినిపిస్తోంది.