ఒక్కసారిగా మారిపోయిన రాజధాని రైతులు.. చంద్రబాబు ఏ మాయ చేశారో?

రాజధాని రైతులతో సుదీర్ఘ కాలం తర్వాత సమావేశమైన సీఎం.. రాజధాని అమరావతి రెండో విడత భూ సమీకరణకు రైతుల మద్దతు కూడగట్టారు.;

Update: 2025-11-28 13:05 GMT

మాయా లేదు.. మంత్రం వేయలేదు.. కానీ, కస్సుబుస్సులాడిన అందరినీ తన వైపు తిప్పుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజధాని రైతులతో సుదీర్ఘ కాలం తర్వాత సమావేశమైన సీఎం.. రాజధాని అమరావతి రెండో విడత భూ సమీకరణకు రైతుల మద్దతు కూడగట్టారు. కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా, తమ సమస్యలు పట్టించుకోవడం లేదని, భూములు ఇచ్చి సర్వం త్యజించిన తమను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని రాజధానికి చెందిన పలువురు రైతులు మీడియాకు ఎక్కి నానా హడావుడి చేశారు. తమ గోడు పట్టించుకోకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వంపై రైతుల్లో అసహనం పెరుగుతోందని, సర్కారుతోపాటు రాజధాని పనులకు ఇబ్బందులు తప్పవని ప్రచారం జరిగింది.

ఈ పరిస్థితుల్లో రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు.. తన రాజకీయ చతురతతో రైతులు అందరినీ ఆకట్టుకున్నారు. కొద్దిరోజులుగా సీఎంతోపాటు ప్రభుత్వాన్ని తీవ్ర స్వరంతో హెచ్చరించిన వారు సైతం.. చంద్రబాబును చూడగానే మంచులా కరిగిపోయారని అంటున్నారు. ఆయన మాటలతో పలువురు రైతులు తమ ఆగ్రహాన్ని చల్లార్చుకుని ప్రభుత్వానికి సహకరిస్తామని ప్రకటించడం విశేషంగా చెబుతున్నారు. రైతులతో ముఖ్యమంత్రి సమావేశం ఎలా ఉంటుంది? ఎలాంటి స్పందనలు కనిపిస్తాయని ఆత్రుతగా చూసిన వారు.. సమావేశం ముగిసిన తర్వాత రైతుల మాటలు చూసి షాక్ తిన్నారు.

ముఖ్యమంత్రితో సమావేశంలో ఏం జరిగిందని ఆరా తీస్తూ.. రైతుల ఆగ్రహాన్ని చల్లార్చేలా సీఎం చంద్రబాబు ఏ మంత్రదండం ప్రయోగించారని వ్యాఖ్యానిస్తున్నారు. గత ప్రభుత్వంలో తీవ్ర అణచివేతకు గురైన అమరావతి రైతులు కూటమి ప్రభుత్వానికి పూర్తి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. సీఎం చంద్రబాబు 4.0 సర్కారు కొలువుదీరిన వెంటనే తమ కష్టాలు అన్నీ తీరినట్లేనని, గౌరవంగా తల ఎత్తుకుని తిరగొచ్చని ఆశించారు. అయితే గత 18 నెలల పాలనలో వారు ఆశించిన మార్పు కనిపించలేదు. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ, స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రైతుల పక్షాన మాట్లాడుతున్నా, పనులు మాత్రం సాగడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

దాదాపు 33 వేల ఎకరాలను భూ సమీకరణ విధానంలో రైతులు అప్పగిస్తే.. 20 శాతం మందికి సాంకేతిక సమస్యలు, ఇతర కారణాల వల్ల రిటర్నబుల్ ప్లాట్లు ఇప్పటికీ అందజేయలేదని అంటున్నారు. అదే సమయంలో గ్రామ కంఠం, అసైన్డ్ భూమి, కౌలు, పింఛన్లు ఇలా అనేక అంశాల్లో రాజధాని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన సీఆర్డీఏ అధికారులు రకరకాల సాకులతో రైతులను విసిగిస్తున్నారని ఇటీవల విమర్శలు, ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని మంత్రులు స్థాయిలో కూడా పరిష్కరించకపోవడం, సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ లభించకపోవడంపై రైతులు కన్నెర్ర చేశారు.

దీంతో ప్రభుత్వ అనుకూల మీడియా సైతం ప్రత్యేక కథనాలు ప్రసారం చేసి ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురిచేసింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు.. రాజధాని రైతు సమస్యలపై ఫోకస్ చేశారు. ముందురోజు సీఆర్డీఏ, మున్సిపల్ అధికారులు, మంత్రి నారాయణతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం చంద్రబాబు.. తర్వాత రైతులతో చర్చించి వారిని ఓదార్చారు. ఇక సీఎం తమను పిలిపించి మాట్లాడిన తర్వాత రైతులు మెత్తబడ్డారు. సీఎం అడిగిన వెంటనే రెండో విడత సమీకరణకు సై అన్నారు. దీంతో తీవ్ర ఉత్కంఠ మధ్య ప్రారంభమైన రాజధాని రైతులు-ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య సమావేశం.. సుఖాంతమైందని అంటున్నారు.

Tags:    

Similar News