బంపర్ ఆఫర్లతో విజయ్ పార్టీ ఉక్కిరి బిక్కిరి
లేటెస్ట్ గా చూస్తే అదిరిపోయే ఒక ఆఫర్ బీజేపీ విజయ్ పార్టీకి ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది.;
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి అతి పెద్ద ఆకర్షణ దళపతి విజయ్ కి చెందిన టీవీకే పార్టీ. ఈ కొత్త పార్టీ ఇంకా ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగలేదు, తన సామర్థ్యం ఏమిటి అన్నది నిరూపించుకోలేదు, కానీ టీవీకే పవర్ ఏంటో ప్రత్యర్ధులకు అపుడే తెలిసి వచ్చినట్లుంది. అందుకే విజయ్ పార్టీ చుట్టూనే తమిళ రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి.
అడగకుండానే ఆఫర్లు :
మాకు ఎవరితో పొత్తు లేదు మేము ఒంటరిగానే పోటీ చేస్తామని విజయ్ పార్టీ ఎంతగా చెప్పుకుంటున్నా బీజేపీ నుంచి వరసబెట్టి ఆఫర్లు వచ్చి పడుతున్నాయని అంటున్నారు. లేటెస్ట్ గా చూస్తే అదిరిపోయే ఒక ఆఫర్ బీజేపీ విజయ్ పార్టీకి ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ ఆఫర్ ప్రకారం చూస్తే మొత్తం తమిళనాడు అసెంబ్లీ సీట్లలో మూడవ వంతు సీట్లను పొత్తులో భాగంగా విజయ్ పార్టీకి ఇచ్చేందుకు బీజేపీ రెడీ అయింది అని అంటున్నారు. అంటే ఒక బ్రహ్మాండమైన ఆఫర్ గా బీజేపీ టీవీకే ముందు పెట్టినట్లుగా చెబుతున్నారు. 80 సీట్లతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా విజయ్ కి ఇవ్వాలని బీజేపీ డిసైడ్ అయింది అని అంటున్నారు.
తెర వెనక ఒక ఉప ముఖ్యమంత్రి :
ఇక బీజేపీ ప్రతిపాదనలు విజయ్ పార్టీకి చేరవేసేందుకు ఈ మొత్తం రాయబారం వెనక ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉన్నారని కూడా ప్రచారం సాగుతోంది. ఆ ఉప ముఖ్యమంత్రి కూడా సినీ హీరో కావడంతో పాటు విజయ్ తో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆయన విజయ్ ని ఎన్డీయేలోకి తీసుకుని వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. తన రాష్ట్రంలో తాను ఎదుర్కొన్న అనుభవాలు తాను సాధించిన విజయాలు అన్నీ ముందు పెట్టి త్రిముఖ పోరులో కొత్త పార్టీ ఎదుర్కొనే కష్టాలు సవాళ్ళు వివరించే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు.
సీఎం సీటుకే గురి :
అయితే విజయ్ పార్టీ వైపు నుంచి చూస్తే బీజేపీతో పొత్తుకు విముఖంగానే ఉన్నట్లుగా చెబుతున్నారు. పైపెచ్చు తమిళనాడులో దళపతిగా జనాలలో సూపర్ స్టార్ ఇమేజ్ ని సాధించిన విజయ్ గురి ఏకంగా సీఎం సీటు మీదనే ఉంది అని అంటున్నారు. దాంతో ఒంటరిగానే పోటీకి దిగి తమకంటూ కీలకమైన సంఖ్యా బలంతో సీట్లను సాధిస్తే ఎన్నికల అనంతరం హంగ్ ఏర్పడుతుందని వస్తున్న వారతల నేపథ్యంలో కింగ్ మేకర్ కాకుండా ఏకంగా కింగ్ అయ్యే చాన్స్ ఉంటుందని విజయ్ పార్టీ తరఫున వారు ఆలోచిస్తున్నారు అని చెబుతున్నారు. ఈ తరహా ఎత్తుగడలతోనే తమ ఆప్షన్లు అన్నీ ఓపెన్ గా చేసి పెట్టుకున్నారని చెబుతున్నారు.
తమిళనాడుకు కొత్త సీఎం గా :
ఎన్నికల అనంతరం రాజకీయ ముఖ చిత్రం క్లియర్ గా ఉంటుందని ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే విజయ్ పార్టీ సీట్లే అతి ముఖ్యమవుతాయని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాలు సర్వేల బట్టి చూస్తే ముప్పయి సీట్లకు తక్కువ కాకుండా విజయ్ పార్టీ గెలుస్తుంది అని అంటున్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఈ నంబర్ పెరిగి ఒక యాభై సీట్లు తెచ్చుకుంటే చాలు తమిళనాడుకు కొత్త సీఎం గా విజయ్ అవుతారు అని ఆ పార్టీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే విజయ్ పార్టీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నా విపక్షంలో ఉన్న బీజేపీ అన్నా డీఎంకేకి మాత్రం ఓట్ల చీలిక వ్యవహారం అతి పెద్ద సమస్యగా మారుతుంది అన్న కంగారు అయితే పట్టుకుంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారాలు ఊహాగానాలు వ్యూహాలలో ఏవి నిజం అవుతాయో.