రప్పా.. రప్పా మాటకు మెగా బ్రదర్ డైరెక్ట్ పంచ్
సాధారణంగా ఎదురుదెబ్బలు తగిలినప్పుడు.. వాటి నుంచి పాఠాలు నేర్చుకొని.. ఆ తప్పులు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది.;
ఓటమి నుంచి తప్పుల్ని పాఠాలుగా నేర్చుకోవటం అందరూ చేసేదే. కానీ.. తమకు ఎదురైంది ఘోర ఓటమి కాదు.. అందరూ కలిసి కుట్ర పన్నారన్న మైండ్ సెట్ తో ఉంటే..? వైసీపీ అధినేత మొదలు వైసీపీ కార్యకర్త వరకు అందరూ అలాంటి మైండ్ సెట్ లో ఉండటమే ఆసక్తికర అంశం. తమను ఓడించేందుకు మూడు పార్టీలు కలిసి కూటమిగా బరిలోకి దిగటం వల్లే ఓడామని.. అలా జట్టు కట్టిన తర్వాత కూడా ఏదేదో చేశారన్న సందేహాలతో తమ ఓటమికి జస్టిఫికేషన్ ఇచచ్చుకోవటం చూసినప్పుడు వైసీపీ వారి మైండ్ సెట్ కు విస్మయం చెందాల్సిందే.
సాధారణంగా ఎదురుదెబ్బలు తగిలినప్పుడు.. వాటి నుంచి పాఠాలు నేర్చుకొని.. ఆ తప్పులు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది. కానీ.. వైసీపీ వారి నుంచి అలాంటివి ఆశించలేం. అందుకే.. సినిమాల్లోనే వెగటు కలిగించే రప్పా..రప్పా నరికేస్తామనే హింసాత్మక డైలాగ్ ను మరింత సినిమాటిక్ గా రియల్ లైఫ్ లో పార్టీ నినాదంగా మార్చటానికి మించిన తెగింపు ఇంకేం ఉంటుంది? కార్యకర్త మొదలు చిన్నపాటి నేత అత్యుత్సాహంతో అడుగులు వేస్తున్నప్పుడు.. అతడ్ని సరిదిద్దాల్సిన బాధ్యత పార్టీ ముఖ్యల మీద ఉంటుంది. వారేమో రప్పా రప్పా నరుకుతామంటే.. అదేం సరిపోతుంది? మరింత మోతాదు పెంచడన్న రీతిలో వైసీపీలోని కొందరు తీరు..ఆ పార్టీపై వ్యతిరేకత భావాన్ని కలిగిస్తుంది. అలాంటి మాటలతో మైలేజీ కంటే డ్యామేజే కలుగుతుందన్న మాట రాజకీయ పార్టీలే కాదు..వివిధ పార్టీ నేతలు మొత్తుకుంటున్నా.. పట్టించుకోకపోవటం కనిపిస్తుంది.
తాజాగా మెగా బ్రదర్ కం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కం ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని లావేరు మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన వారు చేస్తున్న రప్పా రప్పా నరుకుతామనే నినాదాలపై స్పందించారు. ‘‘రప్పా రప్పా నరుకుతామంటే ఇప్పుడున్న సీట్లు కూడా రావు. 2024 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసేలా వైసీపీ ఎన్నో కుట్రలు చేసింది. మళ్లీ జగన్ కు అవకాశం ఇవ్వకూడదని.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేం కూటమితో పొత్తు పెట్టుకొని పోటీ చేశాం. మరోసారి వైసీపీకి అవకాశం ఇస్తే.. ప్రజలు ఏపీని విడిచి పెట్టి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తుంది’’ అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మరో పదిహేనేళ్లు జనసేన. టీడీపీ.. బీజేపీ ఐక్యత సాగుతుందన్న నాగబాబు.. కూటమి కలిసి ఉన్నంతవరకు వైసీపీ ఆటలు సాగవన్నారు. వైసీపీ బెదిరింపులకు కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలన్న నాగబాబు.. వైసీపీ కార్యకర్తలు.. రప్పా రప్పా నరుకుతామన్న మాటలపై చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మెగా బ్రదర్ చేసిన ఈ వ్యాఖ్యల్ని వైసీపీ అండ్ కో కాస్తంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైసీపీ అధినాయకత్వం మరేం చేస్తుందో చూడాలి.