ఓకే సెట్ రైట్.. టీడీపీలో ఆల్ హ్యాపీస్!

టీడీపీలో అంతా సెట్ రైట్ అయిందా? అన్న చర్చ జరుగుతోంది. గత కొద్దిరోజులుగా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-12-02 12:25 GMT

టీడీపీలో అంతా సెట్ రైట్ అయిందా? అన్న చర్చ జరుగుతోంది. గత కొద్దిరోజులుగా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చి కేవలం 18 నెలలే అయినప్పటికీ, రేపే ఎన్నికలు జరుగుతాయన్నట్లు పనిచేయాలని ఇద్దరు ముఖ్యనేతలు మంత్రులు, ఎమ్మెల్యేల వెంటపడుతున్నారు. 2029లో ఎట్టిపరిస్థితుల్లోనూ మరోసారి గెలవాలని టార్గెట్ పెట్టుకున్న చంద్రబాబు, లోకేశ్ ఎమ్మెల్యేల పనితీరుపై నిరంతరం ఫోకస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంతో ఎమ్మెల్యేలు దారికొచ్చారని టీడీపీ అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేస్తోంది. గత నెలలో 48 మంది ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి డుమ్మాకొడితే.. సోమవారం జరిగిన పింఛన్ల పంపిణీలో 90 శాతం ఎమ్మెల్యేలు హాజరయ్యారు. దీంతో ఎమ్మెల్యేల్లో మార్పు వచ్చినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

గత ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు.. వచ్చే ఎన్నికలకు ఇంకా సమయం ఉందన్న ధీమాతో వ్యవహరిస్తున్నారని అంటున్నారు. కొత్తగా ఎన్నికైన వారితోపాటు సీనియర్ ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వ, పార్టీ పనులను నిర్లక్ష్యం చేస్తున్నారని, శాసనసభ్యులు అందుబాటులో లేకపోవడం వల్ల పలు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చింది. గత నెలలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు.. ఎమ్మెల్యేలపై వస్తున్న ఫిర్యాదులపై సమీక్షించారు. దాదాపు 48 మంది ఎమ్మెల్యేలు నెలనెలా నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంతోపాటు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి జారీ చేస్తున్న చెక్కులను సకాలంలో అందించకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక యువనేత లోకేశ్ ప్రజాదర్బార్ లో కూడా ఎక్కువగా ఎమ్మెల్యేల పనితీరులో లోపం బయటపడింది. చిన్నచిన్న సమస్యలు సైతం ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం వల్ల తనను కలిసేందుకు ప్రజలు రాజధాని వరకు వస్తూ ఇబ్బంది పడుతున్నారని లోకేశ్ గ్రహించారు. ఈ పద్ధతి సరిదిద్దకపోతే ప్రజలకు పార్టీ ఎమ్మెల్యేలకు గ్యాప్ పెరిగి ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉందని యువనేత అప్రమత్తమయ్యారు. ఇక ప్రజాదర్బార్ మధ్యలోనే పార్టీ సీనియర్లను పిలిపించుకుని ప్రతి శుక్రవారం ఎమ్మెల్యేలు ప్రజాదర్బార్ నిర్వహించాల్సిందేనని పక్క ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా నెలలో ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలన్న టైం టేబుల్ కూడా ఇచ్చారు. ఇలా అధినేత, యువనేత ఒకేసారి ఎమ్మెల్యేల పనితీరును ప్రశ్నించడంతో ఎమ్మెల్యేలు ఆలోచనలో పడ్డారు. ఇద్దరి వద్ద చెడ్డ పేరు తెచ్చుకుంటే భవిష్యత్తులో ముప్పేనని భావించిన ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాల్లో తప్పనిసరిగా హాజరు వేయించుకుంటున్నారు.

ముఖ్యనేతల నుంచి వరుసగా చీవాట్లు వస్తుండటంతో పసుపుపార్టీలోని ఎమ్మెల్యేలు తమ బద్ధకాన్ని వదిలించుకున్నారని అంటున్నారు. డిసెంబరు 1వ తేదీన నిర్వహించిన పేదల సేవలో.. పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి 90 శాతం ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మిగిలిన పది శాతం మంది స్థానికంగా లేకపోవడం, అనారోగ్యం వంటి కారణాలతో హాజరుకాలేకపోయారు. ఇక తమ నియోజకవర్గాలకు వెళ్లలేకపోయిన మంత్రులు.. అందుబాటులో ఉన్న నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ అధినేత ఉద్దేశాన్ని ప్రజలకు చాటిచెప్పేలా తమ వంతు పాత్ర పోషించారని అంటున్నారు. ఇలా మొత్తం పార్టీ ఎమ్మెల్యేలు చాలా రోజుల తర్వాత ప్రజల్లో కనిపించడంపై హైకమాండ్ తోపాటు పార్టీ కేడర్ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News